వరంగల్ ఓసిటీ మైదానంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికలకు కరీంనగర్ నుంచి సమర శంఖారావం పూరించిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం వరంగల్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుందన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ ఎన్నికల శంఖారావం పూరించడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సన్నాహక సభ కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ‘ఓ సిటీ’ మైదానం ముస్తాబైంది. వరంగల్ మహా నగరం మొత్తం గులాబీమయమైంది.
ఏర్పాట్లు పూర్తి..
సన్నాహక సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ నేతలు అందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సారథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి దయాకర్‌రావుతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఏ లోటూ రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశం ద్వారా సత్తా చాటేందుకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.
కేడర్‌కు దిశానిర్ధేశనం...
టీఆర్‌ఎస్‌కు అన్ని విధాలా కలిసొచ్చే కరీంనగర్ వేదికగా కేటీఆర్ బుధవారం లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించగా... తెలంగాణలో రెండో సన్నాహక సమావేశం వరంగల్‌లో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బా«ధ్యతలు చేపట్టిన కేటీఆర్ మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలతో పాటు ఆయా జిల్లాల నేతలతో ముఖాముఖి, సమన్వయం చేయడంలో నిమగ్నమయ్యారు.
లోక్‌సభ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల అవుతుందన్న ప్రచారం మేరకు 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సూచన మేరకు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాల నిర్వహణ పూర్తిగా కేటీఆర్ ఆధ్యర్యంలో జరుగుతుండగా, ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో చర్చించి, షెడ్యూలు ఖరారు చేశారు. ఇందులో భాగంగానే గురువారం వరంగల్‌లో నిర్వహించే సన్నాహక సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్టీ ఎన్నికల సమావేశమైనా బహిరంగ సభను మరిపించే రీతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ మార్గదర్శనం చేయనున్నారు. వరంగల్ లోక్‌సభ స్థానంలో జరిగిన అభివృద్ధి, ఎంపీ కృషి, రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలపై నిర్వహించిన పాత్ర, పార్టీని పటిష్ఠం చేసేందుకు జరిగిన కృషి తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దేశానికి ఆదర్శంగా సాగుతున్న పాలన, అనేక సంక్షేమ పథకాలు, జాతీయ రాజకీయాల్లో పార్టీ పురోగమనం వంటి వాటిని ఆయన పార్టీ నేతలకు వివరించనున్నారు.
కరీంనగర్ నుంచి వరంగల్ వేదికకు...
కరీంనగర్ నుంచి బుధవారం లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించిన కేటీఆర్ అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం కరీంనగర్ నుంచి బయలదేరనున్న ఆయనకు వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడి నుంచి మంత్రులు, ముఖ్యనేతలు వరంగల్ ఓ సిటీ మైదానం వరకు ఆయనను అనుసరిస్తారు.
ఈ సమావేశంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, పాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్, నగరపాలక సంస్థ మేయర్, పురపాలక సంఘాల ఛైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, రైతు సమన్వయ సమితి సభ్యులు తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరుతారు.
హసన్‌పర్తి నుంచి భారీ ర్యాలీ..
కరీంనగర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30 గంటలకు హసన్‌పర్తికి వచ్చే కేటీఆర్‌కు అక్కడ భారీ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వందలాది వాహనాలతో వరంగల్ ఓ సిటీ సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హసన్‌పర్తి నుంచి భీమారం, కాకతీయ యూనివర్సిటీ, నయీంనగర్ పెట్రోల్‌పంపు, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ మీదుగా ఓ సిటీ మైదానం వరకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతారు. ఇప్పటికే వరంగల్ మహానగరం మొత్తం గులాబీమయమైంది. ప్రతి చౌరస్తాలో గులాబీ జెండాలు, తోరణాలు ఏర్పాటు చేశారు. రహదారులు, చౌరస్తాల్లో కేటీఆర్‌కు స్వాగత ఫ్లెక్సీలు నెలకొల్పారు.
Comments
Please login to add a commentAdd a comment