సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్లకు సోనియా స్టార్ క్యాంపెయినర్లు లేక డీలాపడిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు 27న పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేవెళ్లకు రానున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వస్తున్న ఆమె మెదక్ జిల్లా అందోల్‌లో జరిగే సభలో పాల్గొంటారు.
అంతకుముందుగానీ ఆ తర్వాతగానీ చేవెళ్లలో ఏర్పాటుచేసే బహిరంగసభలో పాల్గొనేలా షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో భేటీ అయిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి చేవెళ్లలో మేడమ్ పర్యటన ఉండాలని పట్టుబట్టారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్‌జ దిగ్విజయ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పొన్నాల చెప్పి నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు మేడమ్ పర్యటన ఉండేలా చూస్తామని, ఏర్పాట్లు చేసుకోవాలని పొన్నాల సూచించినట్లు కార్తీక్‌రెడ్డి ‘సాక్షి’ తెలిపారు. దీంతో చేవెళ్లలో జరిగే ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ముగింపు వేళ అధినేత్రి చేసే మార్గనిర్దేశం పార్టీ శ్రేణులకు టానిక్‌లా పనిచేస్తుందని అధికార పార్టీ భావిస్తోంది.
ఏడు చోట్ల కేసీఆర్ ‘షో’లు
ఇదివరకే చేవెళ్ల, మల్కాజిగిరిలో పర్యటించిన టీఆర్‌ఎస్ సారథి కేసీఆర్ ఈ నెల 27న రెండో విడ త ఎన్నికల ప్రచారానికి జిల్లాకు రానున్నారు. హెలికాప్టర్ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకునే కేసీఆర్.. ఆ రోజు జిల్లాలో ఏడు చోట్ల జరిగే రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. తాండూరు, పరిగి, వికారాబాద్, మేడ్చల్, ఎల్‌బీ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్‌లో నిర్వహించే రోడ్‌షో/బహిరంగసభల లో కేసీఆర్ మాట్లాడనున్నారు. మంచి ఊపు మీదు గులాబీ బాస్ జిల్లాపై గంపెడాశ పెట్టుకున్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదేనని ఆశలపల్లకీలో ఉన్న కేసీఆర్.. టీడీపీ, కాంగ్రెస్ బలంగా ఉన్న రంగారెడ్డి జిల్లాపై గురి పెట్టారు.ఈ నేపథ్యంలోనే జిల్లాలో ముమ్మరంగా ప్రచారం సాగించేందుకు ప్రణాళిక ఖరారు చేశారు.
బాబు ప్రచారం ఇక్కడి నుంచే..
సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈనెల 13న ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన మరుసటి రోజు చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్నికల భేరీని మోగించారు. ఇప్పటి కే మహేశ్వరం, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మేడ్చల్ తదితర నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. మరో ఐదు రోజుల్లో ప్రచారపర్వానికి తెరపడనున్న నేపథ్యంలో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఈ నెల 27న జిల్లా పర్యటనకు వస్తున్నారు. చేవెళ్ల, కందుకూరు (మహేశ్వరం), శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
అగ్రనేతలొస్తున్నారు!
Published Wed, Apr 23 2014 11:14 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement