ఆలంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకే కార్తీక్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని.. ప్రత్యేక రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖరేనని ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి అన్నారు. శనివారం కార్తీక్‌రెడ్డి తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపేందుకే కార్తీక్‌రెడ్డి పాదయాత్రను చేపట్టారని ఆయన తెలిపారు.
తెలంగాణ కోసం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి, మాజీ హోంమంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి, డా.ఎ.చంద్రశేఖర్‌లు తమ పదవులను త్యాగం చేసి ఉద్యమించారని గుర్తు చేశారు. ఇంద్రారెడ్డి ఆశయాల సాధనకు కార్తీక్‌రెడ్డి పూనుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. కార్తీక్‌రెడ్డి జిల్లాలో మంచి నాయకునిగా ఎదగేందుకు ప్రజలు ఆశీర్వదించాని ఆయన కోరారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు పాదయాత్ర పట్ల మతిభ్రమించిన వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. అధికారంలో ఉండి కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన సోనియాగాంధీకి రుణపడి ఉండాలని పిలుపు నిచ్చారు. దాహం వేపసినప్పుడు గ్లాసు నీరు ఇస్తేనే కృతజ్ఞతలు తెలుపుతాం.. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియమ్మ కాళ్లు మొక్కినా తప్పులేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే 111జీఓను ఎత్తివేస్తామని అన్నారు. ఇక్కడి ప్రజల చిరకాల కోరిక వికారాబాద్ జిల్లా కేంద్రంగా ప్రకటించడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తెచ్చామో.. వికారాబాద్ జిల్లాను కూడా అలాగే తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ నాయకులు కార్తీక్‌రెడ్డి, రంగారెడ్డి, చంద్రశేఖర్‌లను గజమాలతో సన్మానించారు.
కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. హఫీజ్, మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, జిల్లా లీగల్‌సెల్ మాజీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ైచె ర్మన్ రాంచంద్రారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య, సీనియర్ నాయకులు చెట్టెపు మల్లారెడ్డి, పోలీస్ రాంరెడ్డి, తరిగోపుల సంగమేశ్వర్, ఏనుగు మురళిధర్‌రెడ్డి, ఆర్.నర్సింలు, రవీందర్‌రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశం గుప్తా, రవికాంత్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, నర్సింలు పాల్గొన్నారు.
వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేస్తాం: కార్తీక్‌రెడ్డి
వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేసేందుకు పాటుపడతానని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. కార్తీక్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం వికారాబాద్‌లో ప్రవేశించింది. ఈ సంద ర్భంగా యాత్ర కొత్రెపల్లి, శివారెడ్డిపేట, ఎన్నెపల్లి, సాకేత్‌నగర్ వికారాబాద్ రైల్వే బ్రిడ్జిల మీదుగా భారీగా పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు అమరులయ్యారని, వారి కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన తమ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీకి కృతజ్ఞత తెలిపేందుకే పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.
పార్టీ అంగీకరిస్తే ఎంపీగా పోటీ చేస్తా
పూడూరు: కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే ఎంపీగా పోటీ చేస్తానని కార్తీక్‌రెడ్డి స్పష్టంచేశారు. పాదయాత్ర సందర్భంగా శనివారం మండల పరిధిలోని ఎన్కెపల్లి హిట్స్ కళాశాలలో బస చేసిన కార్తీక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నవ నిర్మాణం పేరుతో చేపట్టిన పాదయాత్ర కేవలం ప్రజల కోసమేనని రాజకీయ లబ్ధి కోసం కాదన్నారు. కొందరు గిట్టనివారు దీన్ని రాజకీయం చేయడాన్ని ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ కోసం కలలు కన్న తన నాన్న ఇంద్రారెడ్డి ఆశయం నెరవేరిందని, ప్రజల ముఖంలో సంతోషాలను చూడాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టానన్నారు.
అంతేకాకుండా ‘మా నాన్న ఎంపీని కావాలనుకునేవారు. ఆ కల నెరవేర్చేందుకు పార్టీ అంగీకరిస్తే చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నా’నన్నారు. పార్టీ టికెట్టు ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పటిష్టతకు కృషి చేస్తానని తెలియజేశారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి టి.రామ్మోన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సుభానయ్య,సురేందర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎన్కెపల్లి సర్పంచ్ దయాకర్, షకీల్, అబ్బాస్‌ఖాన్ పాల్గొన్నారు.
సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకే పాదయాత్ర
Published Sun, Jan 12 2014 12:57 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement