హామీలను విస్మరించిన కేసీఆర్
♦ దళిత ముఖ్యమంత్రి విషయంలో మోసం
♦ కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం సిగ్గుచేటు
♦ మూడెకరాల భూపంపిణీ ఏమైంది?
♦ మహాజన సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాగాయకుడు గద్దర్
జనగామ: అమరుల త్యాగాల పునాదులపై సాధిం చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మాఫి యా రాజ్యమేలుతోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని మహా జన సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాగాయకుడు గద్దర్ విమర్శించారు. జనగామలోని గాయత్రి గార్డెన్‌లో ఆదివారం జరిగిన మహాజన సమాజం జిల్లా సదస్సుకు గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కన్వీనర్ ఏదునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దున్నేవాడికే భూమి అన్న నినాదాన్ని నక్సలైట్ల నినాదమన్న సీఎం కేసీఆర్.. ఆయన ప్రకటించిన దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. దొరల రాజ్యంలో సామాజిక, ధామాశ ప్రకారం ప్రజలకు ప్రాతినిత్యం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలోని కేబినెట్‌లో కనీసం మహిళలకు ప్రాతినిత్యం లేకపోవడం సిగ్గు చేటన్నారు. అంబేద్కర్ అశించిన రాజ్యస్థాపన జరగాలంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమానత్వ హక్కులు రావాలని గద్దర్ పేర్కొన్నారు. దీని కోసం అన్ని వర్గాల ప్రజల్లో ఆలోచన రావాలని కోరారు.
పారిశ్రామిక అభివృద్ధే కీలకం..
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే జనగామ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని గద్దర్ అన్నారు. అంతే కాకుండా ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని, ఇందు కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటాలతోనే సమాజంలో మార్పు జరుగుతుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఉద్యమాలు లేనిదే ప్రపంచంలో ఎక్కడా ఫలితాలు సాధించలేదన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు మహాజన సమాజ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటించి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగే వరకు మా పోరు ప్రజాపక్షం వైపు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో అమరులైన కుటుంబాలను గద్దర్ సన్మానించారు.
జిల్లా ఉద్యమకారులకు సన్మానం..
జనగామ జిల్లా సాధన కోసం ఉద్యమం చేసిన పోరాట యోధులను గద్దర్ ఆధ్వర్యంలో సన్యాసం చేశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, టీ జేఏసీ చైర్మెన్ ఆకుల సతీష్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మినారాయణ నాయక్, ఐఎంఏ సెంట్రల్ కమిటీ సభ్యులు డాక్టర్ రాజమౌళి, సేవ్ జనగామ ప్రతినిధి మంగళ్లపల్లి రాజు, ఓయూ జేఏసీ ఇన్‌చార్జి బాలలక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఉడుత రవి, బూడిద గోపి, ఇర్రి అహల్య, బొట్ల శ్రీనివాస్, కౌన్సిలర్ బొట్ల సుగుణలను ఘనంగా సత్కరించారు. పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకోవచ్చని నాటి తెలంగాణ.. నేటి జిల్లా సాధనే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మహాజన సమాజం నాయకులు శ్రీరాముల శ్రీనివాస్, బత్తుల సిద్ధేశ్వర్, ప్రభాకర్ యాదవ్, చుక్క కిషన్ ఉన్నారు.