కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి జస్టిన్ ట్రూడో ఎత్తుగడ
ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయలో భారత్‌పై పదేపదే ఆరోపణలు
ఖలిస్తానీ శక్తుల పట్ల మెతక వైఖరితో సిక్కులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం
ప్రజా వ్యతిరేక, సొంత పార్టీ లో తిరుగుబాటును అధిగమించడానికి కుయుక్తులు
ప్రజా వ్యతిరేకతను, సొంత పార్టీ లో తిరుగుబాటును అధిగమించి వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గడానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? కెనడాలో గణనీయ సంఖ్యలో ఉన్న సిక్కు ఓటర్లను ప్రసన్నం చేసుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తహతహలాడుతున్నారా? కేవలం అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలతో భారత్– కెనడా సంబంధాలను బలి పెట్టడానికి సైతం వెనుకాడడం లేదా? రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అవుననే చెబుతున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని జస్టిన్ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్నారు.
అంతేకాదు ఈ హత్యలో భారత హైకమిషనర్ సంజయ్ కమార్ వర్మను ట్రూడో ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చింది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ట్రూడో పదవీ కాంక్ష వల్ల భారత్, కెనడా ప్రజలు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్‌లో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. మరో ఏడాది సమయమే మిగిలి ఉంది. మరోవైపు జస్టిన్ ట్రూడో పాలనల పై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సొంత పార్టీ లో సైతం నిరసన గళాలు బలం పుంజుకుంటున్నాయి. ట్రూడో నాయకత్వాన్ని, పరిపాలనా సామర్థ్యాన్ని అధికార ‘లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా’ నాయకులు ప్రశి్నస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించడానికి నిజ్జర్ హత్యను ట్రూడో తెలివిగా తనకు అనుకూలంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజ్జర్ వ్యవహారంలో భారత్‌ను ఇరుకునపెట్టడం ద్వారా సిక్కుల ఓట్లపై ఆయన వల విసురుతున్నట్లు ప్రచారం సాగుతోంది. 2021 నాటి గణాంకాల ప్రకారం కెనడాలో 7.70 లక్షల మంది సిక్కులున్నారు. అంటే జనాభాలో 2.1 శాతం మంది సిక్కులే. భారత్‌కు వెలుపల అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉన్న దేశం కెనడా. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండి రాజకీయ ప్రాబల్యం కలిగిన సిక్కులను మచ్చిక చేసుకోవడానికి కెనడా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తులను ప్రోత్సహిస్తుంటాయి.
భారత్‌లో సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్న నినాదంతో పుట్టుకొచి్చన ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కెనడా అడ్డాగా మారిపోయింది. వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, సిక్స్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తదితర సంస్థలు కెనడా నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీ లు వీటికి మద్దతిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. కనీసం 9 ఖలిస్తానీ టెర్రర్ గ్రూప్‌లకు కెనడాయే ప్రధాన స్థావరం.
ఇవన్నీ భారత సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నాయి. తమ దేశంలో నేరాలకు పాల్పడిన ఖలిస్తాన్ ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కెనడా లెక్కచేయడం లేదు. కనీసం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా తిరస్కరిస్తోంది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ఖలిస్తానీలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్‌ఐ’ పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తోంది. ట్రూడో పాలనలో కెనడా దేశం భారత్‌కు మరో పాకిస్తాన్‌గా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
విద్యార్థి వీసాలపై పిడుగు!
కెనడా–భారత్ మధ్య విభేదాలు ముదురుతుండడంతో ఇరు దేశాల ప్రజలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా వీసా సేవలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కెనడాలో 1.78 లక్షల మంది ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు), 15.10 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. 2.80 లక్షల మందికిపైగా భారత విద్యార్థులు ఉన్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 41 శాతం మంది భారతీయులే.
ఈ ఏడాది ప్రారంభంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాలను ప్రభుత్వం 3.60 లక్షలకే పరిమితం చేసింది. 2022 నాటితో పోలిస్తే విద్యార్థి వీసాల సంఖ్యను 35 శాతం తగ్గించింది. దీనివల్ల భారతీయ విద్యార్థులు నష్టపోయారు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో విభేదిస్తున్న నేపథ్యంలో విద్యార్థి వీసాలను మరింత తగ్గించే అవకాశం కనిపిస్తోంది. భారతీయ ఉద్యోగులను ఇప్పటికప్పుడు వెనక్కి పంపించే పరిస్థితి లేకున్నా, సమీప భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment