ఖలిస్తాన్ నేతలను భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు
బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తున్నారు: కెనడా పోలీసులు
భారత్ హత్యలకు తెగిస్తోందన్న కెనడా ప్రధాని ట్రూడో
అసంబద్ధ ఆరోపణలంటూ కొట్టిపారేసిన భారత్
ఒట్టావా/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, కెనడా దౌత్యబంధానికి హఠాత్తుగా బీటలు పడుతున్నాయి. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ హైకమిషన్ పేరును చేర్చిన కెనడా తాజాగా వ్యవస్థీకృత నేరగ్యాంగ్‌తో భారతీయ ఏజెంట్లకు సంబంధం అంటగట్టి భారత్‌తో దౌత్యబంధంలో ఆగ్రహజ్వాలలను రగలించింది. భారత్‌పై కెనడా నోటికొచి్చనట్లు ఆరోపణలు గుప్పించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మొదలు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులదాకా అందరూ మూకుమ్మడిగా భారత్‌పై అభాండాలు మోపారు.
కెనడాలోని ఖలిస్తానీ నేతలను భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని, ఇందుకోసం కెనడాలోని బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఏజెంట్లు చేతులు కలిపారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కెనడియన్లపై దాడులకు భారత్ తన ఏజెంట్లతోపాటు వ్యవస్థీకృత నేరగాళ్లను ఆశ్రయించిందని కెనడా ప్రధాని ట్రూడో మంగళవారం దారుణ విమర్శలు చేశారు. తప్పని పరిస్థితుల్లో భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. కెనడా అధికారులు, నేతల మూకుమ్మడి విమర్శలను భారత్ ఏకపక్షంగా తోసిపుచ్చింది.
నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్ అందుకు ప్రతిగా ఢిల్లీలోని ఆరుగురు దౌత్యాధికారులను బహిష్కరించడం, దానికి ప్రతీకారంగా కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యాధికారులను బహిష్కరించిన నేపథ్యంలో మంగళవారం కెనడా ఆరోపణల పర్వం మొదలెట్టింది.
ఖలిస్తాన్ ఉద్యమకారులపై దాడులు
కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమకారులు, నేతలపై దాడులను ప్రస్తావిస్తూ రాయల్ కెనడా మౌంటెడ్ పోలీస్ కమిషనర్ మైక్ డ్యూహెన్, డిప్యూటీ కమిషనర్ బ్రిగిట్ గౌవిన్‌లు మంగళవారం ఒట్టావాలో మీడియాతో మాట్లాడారు. ‘‘దక్షిణాసియా వాసులను, ముఖ్యంగా ఖలిస్తాన్ ఉద్యమంలో భాగస్వాములైన వారిని భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం ఏజెంట్లు బిష్ణోయ్ గ్యాంగ్‌తో చేతులు కలిపారు. హత్య, డజనుకుపైగా బెదిరింపులు, హింసాత్మక ఘటనలతో భారత్‌కు సంబంధం ఉంది. హత్యల కేసులో 8 మందిని, భారతప్రభుత్వంతో సంబంధం ఉండి బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో 22 మందిని అరెస్ట్‌చేశాం’’అని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసులో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మళ్లీ తెరపైకి వచి్చన వేళ ఆ నేరముఠా పేరును కెనడా పోలీసులు ప్రస్తావించడం గమనార్హం.
భారత్ పెద్ద తప్పిదం చేసింది: ట్రూడో
కెనడా రాయల్ పోలీసులు ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే ట్రూడో మీడియాతో మాట్లాడారు. ‘‘కెనడియన్లపై దాడి చేసేందుకు భారత్ తన దౌత్యవేత్తలు, ఏజెంట్లతోపాటు వ్యవస్థీకృత నేరగాళ్లను వినియోగించి భారీ తప్పిదం చేసింది. కెనడాలో హింస పెరగడంలో భారత పాత్ర దాగి ఉంది. భారత వైఖరితో మా పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. హింసకు పాల్పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గత వేసవికాలం నుంచి మా పంచ నేత్ర నిఘా కూటమి(ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్, అమెరికా)తో భారత వైఖరిని పంచుకుంటున్నాం. చట్టాలకు అతీతంగా భారత్ హత్యలకు ప్రయత్నించింది. భారత్‌తో ఇలాంటి ఘర్షణాత్మక సంబంధాలను మేం కోరుకోవట్లేము. కానీ మాతో కలిసి పనిచేసేందుకు భారత్ విముఖత చూపుతోంది’’అని ట్రూడో వ్యాఖ్యానించారు.
ఆరోపణలను తోసిపుచి్చన భారత్
‘‘నిజ్జర్ కేసులో సాక్ష్యాలను ఇచ్చామని కెనడా చెబుతున్న దాంట్లో నిజం లేదు. ట్రూడో మళ్లీ అదే పాత కారణాలను, పాత విషయాలను వల్లె వేశారు. నిజ్జర్ హత్య ఘటనకు ఎవరు బాధ్యులో, ఎందుకు బాధ్యులో కెనడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదు. ఆ ఉదంతంలో గత ఏడాదికాలంగా భారత హైకమిషర్‌ను వేధించి ఇప్పుడు కేసులో ఇరికించి లక్ష్యంగా చేసుకోవడం అసంబద్ధం’’అని భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
కెనడా, భారత్ జాతీయ భద్రతా సలహాదారుల రహస్య భేటీ!
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కెనడా జాతీయ భద్రతా మహిళా సలహాదారు నాథలీన్ డ్రౌలీ, ఉన్నతాధికారులతో వారం రోజుల క్రితం సింగపూర్‌లో రహస్యంగా సమావేశమయ్యారని అమెరికా వార్తాసంస్థ వాషింగ్టన్ పోస్ట్ కొత్త కథనం ప్రచురించింది. నిజ్జర్ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయముందని కెనడా రాయల్ పోలీసులు ఆరోపించిన వేళ ఈ వార్త చర్చనీయాంశమైంది. కెనడాలో సిక్కు వేర్పాటువాదులపై దాడులకు, నిజ్జర్‌ను హత్యచేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను భారత్ వాడుకుందని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కెనడా అధికారులు దోవల్‌కు సమరి్పంచారని కథనం సారాంశం.
Comments
Please login to add a commentAdd a comment