ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత దౌత్య అధికారుల హస్తం ఉందన్న విశ్వసనీయ సమాచారాన్ని ఇండియాకు తాము కొన్ని వారాల క్రితమే తెలియజేశామని అన్నారు. గత సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడటం కంటే ముందే భారత్‌కు చెప్పామని స్పష్టం చేశారు. ఇండియాతో నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కోరుకున్నామని చెప్పారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య అధికారుల ప్రమోయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించారు. కెనడా పౌరుని హత్యలో భారత్ జోక్యం అంటూ మండిపడ్డారు. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టింది. ఇది రాజకీయ లాభం కోసం చేస్తున్న చర్యగా అభిప్రాయపడింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి.
హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిఘా విభాగాలు ఎలాంటి ఆధారాలు సేకరించాయో బయటపెట్టాలని భారత్ కోరింది. కానీ కెనడా ఇప్పటివరకు ఆధారాలను వెల్లడించలేదు.
ఇండియా జవాబుదారీగా ఉండాలి: అమెరికా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆరోపణలపై భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. దర్యాప్తులో కెనడాకు సహకరించాలని ఇండియాకు పిలుపునిచ్చారు. ఈ అంశంలో భారత్, కెనడాతో సంప్రదింపులు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత..?
Comments
Please login to add a commentAdd a comment