అయిదేళ్ళ అగ్నిపరీక్ష! | Sakshi Editorial On President of France Emmanuel Macron | Sakshi
Sakshi News home page

అయిదేళ్ళ అగ్నిపరీక్ష!

Published Wed, Jun 22 2022 12:36 AM | Last Updated on Wed, Jun 22 2022 12:36 AM

Sakshi Editorial On President of France Emmanuel Macron

వ్యక్తిగతంగా చరిత్రాత్మక విజయం సాధించినా, ఒక్కోసారి అది వ్యవస్థను నడపడానికి చాలక పోవచ్చు. గెలిచామన్న ఆనందం కళ్ళ ముందు కొద్ది రోజులకే ఆవిరి అయిపోనూ వచ్చు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ పరిస్థితి ఇప్పుడు అదే! రెండునెలల క్రితం ఏప్రిల్‌లో దేశానికి వరుసగా రెండో సారి అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన ఆయన తీరా తాజా పార్లమెంట్‌ దిగువ సభ ఎన్నికల్లో తమ పార్టీ కూటమికి 289 సీట్ల మెజారిటీని కూడగట్టుకోలేకపోయారు.

అనుమానిస్తున్నట్టే ఆదివారం నాటి ఫ్రాన్స్‌ నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెక్రాన్‌కు చేదు అనుభవమయ్యాయి. 577 సీట్ల సభలో ఆయన కూటమి 245 స్థానాలకే పరిమితమైంది. మునుపటి 350 స్థానాల స్థాయి నుంచి ఏకంగా 100కు పైగా సీట్లను తమ కూటమి కోల్పోవడంతో మెక్రాన్‌కు నిద్ర లేని రాత్రులు మొదలయ్యాయి. 

ఎగువ సభ ‘సెనేట్‌’, దిగువ సభ ‘నేషనల్‌ అసెంబ్లీ’ – ఇలా సభాద్వయ విధానమున్న ఫ్రాన్స్‌ పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ఫలితాలు పలురకాలుగా దిగ్భ్రాంతి కలిగించాయి. అనేక సంక్షోభా లున్న వేళ పార్లమెంట్‌లో తమ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుంటే, ఫ్రాన్స్‌లో, తద్వారా ప్రపంచంలో అస్తవ్యస్తత తప్పదంటూ మెక్రాన్‌ ఈ ఎన్నికల వేళ ఓటర్లను అభ్యర్థించారు. కానీ, ఓటర్లు ఆ మాటను నిర్ద్వంద్వంగా తిరస్కరించారన్నది స్పష్టం. కూటమిలోని హేమాహేమీలు ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం.

పార్లమెంట్‌లో ప్రధాన బలం ఇప్పటికీ మెక్రాన్‌ సారథ్యంలోని మధ్యేవాద ‘ఎన్‌సెంబుల్‌’ కూటమిదే. కానీ సభలో మెజారిటీయే దక్కలేదు. 1988 తర్వాత అధ్యక్షు డిగా గెలిచినా, ఫ్రాన్స్‌ పార్లమెంట్‌లో మెజారిటీ సాధించలేకపోయిన తొలి ప్రెసిడెంట్‌ మెక్రానే. 

అతి తక్కువగా 46.23 శాతమే ఓటింగ్‌ నమోదైన ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో ఫ్రాన్స్‌ ఛాందస మితవాద పార్టీలు మునుపెన్నడూ లేనంతటి విజయం సాధించడం మరో విశేషం. రెండు నెలల క్రితమే అధ్యక్ష ఎన్నికల్లో మెక్రాన్‌ చేతిలో ఓడిపోయిన మహిళా నేత మెరైన్‌ లీ పెన్‌ సారథ్యంలోని ఆ కూటమి 8 నుంచి 89 స్థానాలకు ఎగబాకింది. అలాగే, ఫ్రాన్స్‌లో చీలికలు పేలికలుగా ఉన్న లెఫ్ట్‌ పార్టీలు ఈసారి అగ్గిబరాటా లాంటి సీనియర్‌ వామపక్షీయుడు జీన్‌ లుచ్‌ మెలెన్‌ఛాన్‌ నేతృత్వంలో ‘న్యూప్స్‌’ పేరిట కొత్త కూటమిగా ఏర్పడి, సత్తా చాటాయి. 2017లో ఈ పార్టీలన్నీ విడివిడిగా గెలి చినవాటికి రెట్టింపు పైనే సీట్లు సాధించి, 131 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షం కావడం అనూహ్యం.  

తాజా ఎన్నికల ఓటమిలో మెక్రాన్‌ పక్షం తప్పులూ చాలా ఉన్నాయి. ఏప్రిల్‌లో అధ్యక్ష ఎన్నికల విజయంతో వచ్చిన ఉత్సాహం మీదే ప్రధానంగా ఆ కూటమి ఆధారపడింది. ఈసారీ గెలుస్తాం లెమ్మనే అర్థంపర్థం లేని భరోసా పెట్టుకుంది. నిస్తేజంగా ప్రచారం నడిపింది. దాని పర్యవసానమే తాజా ఫలితాలు. అలాగే, ఒక్కతాటి మీదకు వచ్చిన వామపక్షాలను పెద్ద బూచిగా చూపిస్తూ, మెక్రాన్‌ తెలివితక్కువగా వ్యవహరించారు.

అది సంప్రదాయవాదుల పట్ల వ్యతిరేకతకు గండికొట్టింది. చివరకు అటుపోయి, ఇటుపోయి సంప్రదాయవాద కూటమికే కలిసొచ్చింది. సభలో మెజారిటీ మెక్రాన్‌కు అందని మ్రానిపండయింది. ఈ రెండోసారి అధ్యక్ష పదవీకాలంలో ఆయన మునుపటి కన్నా భిన్నంగా వ్యవహరించక తప్పని పరిస్థితి వచ్చిపడింది. 

2017లో తొలిసారి ఫ్రాన్స్‌ అధ్యక్ష పీఠమెక్కిన మెక్రాన్‌ కొన్నిసార్లు సర్వం సహాధిపతిలా వ్యవహరించారు. రాజకీయంగా అంతా తానే అన్నట్టు ప్రవర్తించారు. ఫలితంగా, ఆయనకు దూరమైన ఓటర్లు తాజా పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన రెక్కలు కత్తిరించారనుకోవాలి. ఇప్పుడిక రానున్న అయిదేళ్ళ అధ్యక్ష పదవీ కాలంలో మెక్రాన్‌ తాను అనుకున్నట్టు పాలన సాగించాలంటే, కొత్త మిత్రపక్షాలను కూడదీసుకోక తప్పదు. ఆ క్రమంగా అనేక అంశాలపై రాజీలూ పడక తప్పదు. పదవీ విరమణ వయస్సును పెంచడం, సంక్షేమ సంస్కరణల్ని ప్రవేశపెట్టడం లాంటి మెక్రాన్‌ ఆలోచనలు ఏమవుతాయో ఇప్పుడే చెప్పలేం.

ఆ ప్రతిపాదనలకు ఇతర పార్టీల సభ్యుల మద్దతును ఏ మేరకు ఆకర్షించగలుగుతారన్నది చూడాలి. నిన్నటి దాకా రబ్బరు స్టాంపు అనుకున్న నేషనల్‌ అసెంబ్లీ రాత్రికి రాత్రి కీలకంగా మారడం ఫ్రెంచ్‌ ప్రజాస్వామ్యానికి మంచిదే. అయితే, ఉక్రెయిన్‌లో యుద్ధం, పర్యావరణ ఆత్యయిక పరిస్థితుల లాంటి అనేక సవాళ్ళపై తక్షణం చర్యలు చేపట్టాల్సిన తరుణంలో పార్లమెంటులో మెజారిటీ లేక పాలన కుంటుపడితే కష్టమే. 

మొత్తానికి, నేషనల్‌ అసెంబ్లీ ఫలితాలతో ఫ్రాన్స్‌లో కొత్త కథ మొదలైంది. మరో వారంలో కొత్త పార్లమెంట్‌ తొలిసారి కొలువు తీరగానే జీవన వ్యయానికి సంబంధించిన బిల్లుతో ఆట ఆరంభమవు తుంది. పార్లమెంట్‌లో అవసరమైన మెజారిటీ కన్నా కనీసం 44 సీట్లు తక్కువున్న మెక్రాన్‌ సర్కార్‌ ఏ బిల్లుకు ఆమోదముద్ర వేయించాలన్నా ప్రతిపక్షాలపై ఆధారపడక తప్పదు.

ఇలా పార్లమెంట్‌లో ఆయనకు ప్రతిరోజూ అగ్నిపరీక్షే! ఫ్రాన్స్‌లో విదేశాంగ విధానమంతా అధ్యక్షుడి వ్యవహారమే కానీ, ఖండాంతర దౌత్యవేత్తగా పేరు తెచ్చుకున్న మెక్రాన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాంగ విధానం పక్కనబెట్టి, తన పదవీ కాలమంతా దేశీయ అజెండా పైనే దృష్టి సారించక తప్పదు. అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, కనీసం ఐరోపా స్థాయిలోనూ ఆయన మునుపటిలా రాజకీయ విన్యాసాలు చేయలేకపోవచ్చు.

ఇదంతా ఐరోపా రాజకీయ వ్యవహారాలపై ప్రభావం చూపవచ్చు. వెరసి, ఇటు మెక్రాన్‌కూ, అటు ఫ్రాన్స్‌ పార్లమెంట్‌కూ గతుకుల బాటలో పయనం తప్పదు. అయితే, జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఆ ప్రయాణం సాగితే ప్రజాస్వామ్యానికి మంచిది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement