
బహుముఖ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న జర్మనీ ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మితవాదపక్షాల వైపు మొగ్గింది. 1990లో జర్మనీ ఏకీకరణ తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో 83.5 శాతం పోలింగ్ నమోదు కాగా మధ్యేవాద మితవాదులైన క్రిస్టియన్ డెమాక్రాటిక్ యూనియన్ (సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) పార్టీలు రెండింటికీ కలిపి 208 స్థానాలు వచ్చాయి.
పోలైన వోట్లలో ఆ రెండు పార్టీలూ 28.6 శాతం గెల్చుకోగా, తీవ్ర మితవాద పక్షం ఆల్టర్నే టివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) 20.8 శాతంతో రెండో స్థానానికి చేరుకోవటం అందరినీ కలవర పరుస్తోంది. ఆ పార్టీకి 132 స్థానాలు లభించాయి. 2021తో పోలిస్తే దాని వోటింగ్ శాతం రెట్టింప యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుచరగణం అత్యుత్సాహం ప్రదర్శించి జర్మనీ ఎన్నికల్లో జోక్యం చేసుకోనట్టయితే ఏఎఫ్‌డీ వైపు మరింత శాతం మంది మొగ్గుచూపేవారన్నది ఎన్నికల నిపుణుల అంచనా.
ఇంతవరకూ పాలించిన కూటమికి నేతృత్వం వహించిన సోషల్ డెమాక్రాటిక్ పార్టీ (ఎస్‌పీడీ) 16.4 శాతం వోట్లతో, 120 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కానీ పార్లమెంటులోని 630 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పర్చటానికి కావాల్సిన 316 స్థానాలు సీడీయూ, సీఎస్ యూలకు లేవు గనుక అనివార్యంగా ఎస్‌పీడీతో చేతులు కలపాల్సి వుంటుంది. తమకు ప్రభుత్వంలో కొనసాగే ఉద్దేశం లేదని ఎస్‌పీడీ చెబుతున్నా అంతకుమించి దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు.
ఇప్పటికీ ప్రధాన స్రవంతి పక్షాల వైపే వోటర్లు మొగ్గుచూపుతున్నట్టు తేలినా వాటి బలం గణనీ యంగా పడిపోయిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. యువత, మహిళలు ప్రధానంగా ఎస్‌పీడీ, గ్రీన్ పార్టీ, వామపక్షాల వైపు మొగ్గటం గమనించదగ్గ అంశం. యువతలో ఏఎఫ్‌డీ ప్రభావం కూడా పెరిగింది. ప్రాంతాలవారీగా చూస్తే గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంవున్న తూర్పు జర్మనీ ప్రాంత రాష్ట్రాల్లో ఏఎఫ్‌డీ బలమైన శక్తిగా ఎదిగినట్టు కనబడుతోంది.
పశ్చిమ ప్రాంతంలో సీడీయూ, సీఎస్ యూలు ఆధిక్యత సాధించాయి. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మిశ్రమంగావున్న బెర్లిన్ ఒక్కటే ఇందుకు మినహాయింపు. అక్కడ వామపక్ష పార్టీకి అత్యధిక వోట్లు వచ్చాయి. ఈ ఫలితాలు వెల్లడిస్తున్న మరో కీలకాంశం దేశం ప్రాంతాలవారీగా విడిపోయిందన్నదే. తమను దేశంలో ద్వితీయ శ్రేణి పౌరు లుగా చూస్తున్నారని, వలసలను ప్రోత్సహిస్తూ తమ అవకాశాలను దెబ్బతీస్తున్నారని చాన్నాళ్లుగా పూర్వపు తూర్పు జర్మనీ వాసులు ఆగ్రహంతో ఉన్నారు. ఏఎఫ్‌డీ ఆ అసంతృప్తిని తనకు అనుకూలంగా మల్చుకున్నదని ఫలితాలు చెబుతున్నాయి.
రెండో ప్రపంచ యుద్ధానంతరం చకచకా కోలుకుని సుస్థిర ఆర్థిక వ్యవస్థతో యూరప్ ఖండా నికే చుక్కానిగా నిలిచిన జర్మనీని గత కొన్నేళ్లుగా సమస్యలు చుట్టుముట్టాయి. ఇవి చాల్లేదన్నట్టు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం మైనారిటీలో పడటంతో గడువుకు ముందే ఎన్నికలకు పోవాలని చాన్స్‌లర్ ఓలోఫ్ షోల్జ్ గత ఏడాది నిర్ణయించారు.
ట్రంప్‌నూ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌నూ ఎదిరించే సామర్థ్యం షోల్జ్‌కు లేదని 65 శాతంమంది వోటర్లు అభిప్రాయపడ్డారు. తన మాట వినని దేశాలపై భారీగా సుంకాలు విధించటం, నాటో కూటమికి చరమగీతం పాడటం తప్పదని బెదిరిస్తున్న ట్రంప్ వ్యవహారశైలితో వోటర్లు అసహనంతో ఉన్నారు.
దానికి తోడు మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర మితవాద పక్షాలను దూరం పెడుతున్న యూరప్ దేశాలపై విరుచుకుపడటంతో అంతవరకూ మందకొడిగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి ఒక్కసారిగా జవసత్వాలొచ్చాయి. ఒకప్పుడు తమ దేశం సర్వనాశనం కావటానికి కారణమైన తీవ్ర మితవాద పక్షాలను వెనకేసుకురావటం ఎటూ మొగ్గని వోటర్లను ప్రభావితం చేసింది.
పూర్వాశ్రమంలో సీడీయూ నాయకుడే అయినా సైద్ధాంతికంగా విభేదించి పార్టీకి దూరమైన ఫ్రెడరిక్ మెర్జ్ రెండేళ్లక్రితం అదే పార్టీ సారథ్యం స్వీకరించి సీడీయూని విజయతీరాలకు చేర్చారు. ఆయన ముందున్న సవాళ్లు తక్కువేమీ కాదు. రష్యా నుంచి తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని జర్మనీ భావిస్తోంది. ట్రంప్ వైఖరి చూస్తుంటే నాటో కూటమి అంతరించటం ఖాయమన్న సంకే తాలు కనబడుతున్నాయి.
కనుకనే ‘సాధ్యమైనంత త్వరగా’ యూరప్ రక్షణకు ఏర్పాట్లు చేసుకోవా లని షుల్జ్ పిలుపునిచ్చారు. అందుకు దండిగా నిధులు కావాల్సివుంటుంది. ప్రస్తుతం నాటోకు యూరప్ దేశాలు చెల్లిస్తున్న మొత్తం 29వేలకోట్ల డాలర్లు. కానీ భారీయెత్తున బలగాలు, ఆయుధాలు సమీకరించాలంటే అదనంగా మరో 26 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే తప్ప రష్యాను యూరప్ దేశాలు సొంతంగా ఎదుర్కొనటం సాధ్యంకాదని నిపుణులు అంచనా వేశారు.
యూరప్‌లో ఆర్థికంగా అగ్రస్థానంలోవున్న జర్మనీ ఇందులో అధిక మొత్తాన్ని భరించాల్సి వుంటుంది. ఇప్పుడున్న పరిస్థి తుల్లో అది సాధ్యమేనా? ఎందుకంటే ఎగుమతులపై ఆధారపడిన జర్మనీ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ బహిరంగ మార్కెట్ వ్యవస్థలు ఇన్నాళ్లూ దన్నుగా నిలిచాయి. అమెరికా వైఖరితో ఆ శకం అంత రిస్తున్న సూచనలు కనబడుతున్నాయి.
కనుక మారిన పరిస్థి తుల్లో రష్యాతో తాత్కాలి కంగానైనా అవగాహనకు రావటం ఎంతో ఉత్తమం. ఇన్నాళ్లూ అమెరికా అభీష్టానికి అనుగుణంగా ఉక్రెయిన్‌లో నైనా, మరోచోటైనా యూరప్ దేశాలు పావులు కదిపినందు వల్లే రష్యాతో శత్రుత్వం వచ్చింది. ఇకపై ఆ దేశాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయన్న అభిప్రాయం రష్యాలో కలిగించగలిగితే చాలా వరకూ సమస్యలు సమసిపోతాయి. ఈ విషయంలో యూరప్ దేశాలు వివేకంతో ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment