పారిస్: ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ఆదివారం కీలకమైన రెండో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదుగంటలకు 59.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 1981 తర్వాత ఇంతటి పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 30వ తేదీన జరిగిన తొలి రౌండ్‌లో 67 శాతం పోలింగ్ జరిగింది.
ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా రెండు దశల్లో జరుగుతాయి. ఆదివారం జరిగిన రెండో దశ కీలకమైనది. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉంది.
ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల వల్ల ఆయన పదవికి తక్షణ ప్రమాదం ఏమీ లేకున్నా, చట్టాలు చేసేటప్పుడు పార్లమెంటులో అడుగడుగునా పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు తొలిరౌండ్‌లో చేదు అనుభవం ఎదురైన విషయం తెల్సిందే. మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది.
తొలి రౌండ్‌లో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టి విజయం సాధించింది. విపక్షాలకు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి 27.99 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ పార్టీ కేవలం 20.04 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల యురోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకురాలు మెరీన్ లీ పెన్‌కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం సాధించింది. ఆలస్యం చేస్తే విపక్షాలు మరింత పుంజుకుంటాయన్న భయంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment