ఎప్పటికీ ‘మేధావులు’ అవసరమే! | Sakshi Guest Column On Intellectuals | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ ‘మేధావులు’ అవసరమే!

Published Tue, May 16 2023 12:36 AM | Last Updated on Tue, May 16 2023 12:36 AM

Sakshi Guest Column On Intellectuals

ఫ్రెంచ్‌ సమాజంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ‘మేధావులు’ ఆవిర్భవించారు. అయితే ఈ మేధావులు అనే మాటను వామపక్షీయులను ఉద్దేశించి వాడింది సంప్రదాయవాదులు (రైట్‌వింగ్‌), కాకపోతే నిందాపూర్వకంగా! వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్‌లో కూడా అదే పరి స్థితి ఉండటం గమనార్హం.

అయితే మేధావులు ఈ దాడులను మొదటినుంచీ తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. సమాజంలో జరిగే వ్యవహారాలకు మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకుని ఉండలేరు. కానీ మునుపటిలా శక్తిమంతంగా వారు పోరాడుతున్నారా అన్నది సందేహం.

1993లో ‘బీబీసీ రీత్‌ ప్రసంగం’ చేస్తూ పాలస్తీనియన్ –అమెరికన్  ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ సెడ్‌ ఇలా ప్రశ్నించారు: ‘‘సృజనాత్మకతకూ, దౌర్బల్యుల పట్ల నిబద్ధ తకూ మధ్య సమతౌల్యత సాధించడం ఎలా?’’ ఇంకా ఆయన ఇలా కొనసాగించారు: ‘‘అదిభౌతికమైన ఉద్వేగాలు, ఆసక్తి ఉండని న్యాయం, సత్యం వంటి సూత్రాలు కదిలించినప్పుడల్లా అసలైన మేధావులు ఎన్నడూ లేనంత తాముగా ఉన్నారు. వారు అక్రమాలను నిరసించారు, బలహీనుల పక్షాన నిలిచారు, అధికారాన్ని ప్రశ్నించారు.’’

ప్రజా మేధావి అన్న భావన మొట్టమొదట 1894 డిసెంబరులో ఫ్రాన్ ్సలో పుట్టుకొచ్చింది. ఆర్మీ కెప్టెన్  ఆల్ఫ్రెడ్‌ డ్రేఫస్‌పై దేశద్రోహం ఆరోపణలు వచ్చాయి. జర్మన్లకు మిలటరీ రహస్యాలు అమ్మేశాడన్నది ఆయనపై ఆరోపణ. ఇదే అదనుగా యూదు వ్యతిరేక సంస్థలు చెల రేగాయి. ఉదాహరణకు ఎడువార్డ్‌ డ్రూమాంట్‌ సంపాదకత్వంలో నడిచిన ‘లా లిబ్రే’ ఫ్రెంచ్‌ యూదులు విశ్వాస ఘాతకులన్నట్టుగా కథనాలు ప్రచురించింది.

కొంతమంది డ్రేఫస్‌కు మద్దతుగా నిలిచారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం బలహీనంగా ఉంది. ఫెర్డినాండ్‌ వాల్సిన్  ఈస్టర్‌హేజీ అనే మరో అధికారిపై ఇలానే దేశద్రోహ ఆరోప ణలు వస్తే మిలటరీ కోర్టు వాటిని కొట్టివేసింది.

జరిగిన అన్యాయం గురించి అందరికీ స్పష్టంగా అర్థమైంది. జాతి వివక్ష కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ నేపథ్యంలో మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకు ఉండలేని పరిస్థితి. విఖ్యాత నవలా రచయిత ఎమిలీ జోలా ‘జా అక్యూస్‌’ పేరుతో రాసిన బహి రంగ లేఖ ‘లా అరోర్‌’ పత్రికలో ప్రచురితమైంది. డ్రేఫస్‌ను అక్రమంగా దోషిగా నిర్ధారించి ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఎమిలీ ఆ లేఖలో సైన్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

ఇది మరో వివాదానికి దారితీసింది. జోలా మద్దతుదారులు సైన్యాన్ని కించ పరచడం ద్వారా దేశాన్ని బలహీన పరిచారని సంప్రదాయవాదులు (రైట్‌ వింగ్‌) విరుచుకుపడ్డారు. మండించే స్వభావం గల అలంకార ప్రాయమైన దేశభక్తి కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ఉదారవాద వామ పక్షీయులు మద్దతిచ్చారు. సంప్రదాయవాదులు వారిని ‘మేధావులు’ అని నిందాపూర్వకంగా పిలిచారు. వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్‌లో కూడా అదే జరుగుతోంది.

అయితే మేధావులు ఎప్పుడూ ఈ దాడులను తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. తత్వవేత్త, రచయిత జా పాల్‌ సార్త్ర్‌ 1980లో మరణించినప్పుడు సుమారు యాభై వేల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

వివాదానికి దూరంగా ఉండే హక్కు మేధావికి లేదనే వారు సార్త్ర్‌. అన్నింటికీ అతీతంగా ఉంటామనే సౌలభ్యం కూడా వారికి నాస్తి అంటారాయన. సమాజాన్ని మార్చేందుకు ప్రజా మేధావి అనేవాడు తన సొంత విషయాలను పక్కనబెట్టాలనీ, వ్యక్తిగత జీవితం వంటివి అతడు లేదా ఆమెకు ఉండవనీ అంటారు. 

1935లో ఫ్రెంచ్‌ మేధావులు అంతర్జాతీయ రచయితల సంఘం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ప్యారిస్‌ సంస్కృతి పరిరక్షణ దీని ఉద్దేశం. ఈ సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో ఫాసిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఏకమయ్యారు. జూన్  నెలలో జరిగిన ఈ సదస్సుకు సజ్జాద్‌ జహీర్, ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ వంటివారూ హాజరయ్యారు.

తరువాతి కాలంలో వీరిద్దరూ భారతీయ సాహిత్యం, ఉర్దూ కవిత్వంలో మార్పునకు కృషి చేశారు. ఆల్డస్‌ హక్స్‌లీ, ఈఎం ఫార్‌స్టర్, బోరిస్‌ ప్యాస్టర్‌నాక్, బెర్తోల్ట్‌ బ్రెష్ట్, ఇంకా ఇతర దిగ్గజ రచయితలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో తలెత్తిన వివాదాలు కాస్తా ప్యారిస్‌ వీధుల వరకూ విస్తరించాయి. 

సోవియట్‌ యూనియన్  చరిత్రకారుడు ఇల్యా ఎహ్రెన్ బర్గ్‌ ‘దోపిడిదారులను దునుమాడేందుకు ఆయుధంగా మారని ఏ కళ అయినా నిష్ప్రయోజనమైంది!’ అన్నారు ఇల్యా మీద ఆండ్రే బ్రెటన్   లాంటివారు బహిరంగంగానే విమర్శించారు. చివరకు ఆ సదస్సు ఫాసిస్టులకు వ్యతిరేకంగా ఒక సమాఖ్యనైతే ఏర్పాటు చేయలేకపోయింది. సదస్సుకు హాజరైన వారందరూ ఫాసిజాన్ని ద్వేషించారు.

కానీ సోవియట్‌ యూనియన్  తరహా పరి ష్కారం ఉండాలన్న ఆకాంక్షపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. అధివాస్తవికులు, కమ్యూనిస్టుల మధ్య సయోధ్య కోసం రెనె క్రేవెల్‌ (అధివాస్తవికుడు) విఫలయత్నం చేశారు. ఆ నిస్పృహలో రెనె తన ఇంటికొచ్చేసి గ్యాస్‌ కనెక్షన్  ఆన్  చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ఏవగింపు’ అని రాసి ఉన్న నోట్‌ అతడి కోటు జేబుకు అతికించి ఉండింది!

ప్రగతిశీల రచయితల బాధ్యత
రచయితలు, కవుల సామాజిక బాధ్యతలపై అదే కాలంలో భారత్‌లో కూడా ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కవులు, రచయితలు సామాన్యులతో కలిసిపోవాలంటే వారు తమ వ్యక్తిగత ఆనందాలు, కోరికలు, ఉద్వేగాలు, నిస్పృహలకు అతీతంగా తమ రచనలు, కవితలను తీసుకెళ్లాలన్న నమ్మకంతో 1936లో ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్ (అఖిల భారతీయ ప్రగతిశీల రచయితల సంఘం) ఏర్పడింది. మతం, జాతీయత రాజకీయాల నుంచి పేద రికం, వివక్ష, వర్గం వైపు కవులను మళ్లించిన ఘనత దీనిదే.

ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్  సభ్యులు ఇటలీ కాలమిస్ట్‌ ఆంటోనియో గ్రాంసీ రచనలను అప్పటికి చదివి ఉండేందుకు అవకాశం లేదు. ఆయన ‘ప్రిజన్‌ నోట్‌బుక్‌’ 1970లలో ఆంగ్లంలో ప్రచురితమైంది. కానీ ముస్సోలిని అపఖ్యాతి జైలు వ్యవస్థలో మగ్గిన గ్రాంసీ రాసినదానిలో ఈ ప్రగతిశీల రచయితలు నమ్మకం ఉన్నవారే. అదేమిటంటే... మేధావి అనేవాడు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు అవసర మైన వాతావరణాన్ని సృష్టించాలి. ఉదారవాదులు రాజకీయ జీవితంలోకి ప్రవేశించాలి!

ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్  సభ్యుడు, ఇండియన్  పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్  సభ్యుడైన కె.ఏ. అబ్బాస్‌ తన ఆత్మకథలో ‘నేనేమీ ఓ ద్వీపాన్ని కాదు’ అన్న వాక్యం ఉంటుంది. 1946 నాటి బాంబే గురించి ఈ వ్యాఖ్య. అప్పట్లో హిందూ, ముస్లింల మధ్య బాంబే రెండుగా విడిపోయి ఉండేది. ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్ , ఇండియన్  పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్  ఓ శాంతి ప్రదర్శన ఏర్పాటు చేశాయి. పృథ్వీరాజ్‌ కపూర్‌కు చెందిన పృథ్వీ థియేటర్స్‌తో పాటు సుమారు 52 సాంస్కృతిక సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొ న్నాయి.

కపూర్లు(పృథ్వీరాజ్, రాజ్, షమ్మీ), దేవానంద్, బల్‌రాజ్‌ సహానీ, అభ్యుదయ ఉర్దూ కవులు, రచయితలు సజ్జాద్‌ జహీర్, మజ్రూహ్‌ సుల్తాన్ పూరి, అలీ సర్దార్‌ జాఫ్రీ, కైఫీ అజ్మీ, సాహిర్‌ లూధి యాన్వీతో పాటు మరాఠీ, గుజరాతీ రచయితలు కూడా బోరిబందర్‌ నుంచి బాంద్రా వరకూ సాగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. శాంతి, సామరస్యాలు, సౌభ్రాతృత్వాలను సూచించే పాటలు పాడుతూ సాగిందా ఊరేగింపు. తద్వారా మత ఘర్షణల గాయాలకు మందు పూసే ప్రయత్నం జరిగింది. 

ప్రస్తుతానికి వస్తే... మన నటులను అధికార పక్షంపై ప్రశంసలు కురిపించేలా బలవంతం చేస్తున్నారు. జైలుకెళ్లాల్సి వస్తుందని రచ యితలు భయపడుతున్నారు. విప్లవాత్మక ఆలోచనలున్న నాటక రంగం కనుమరుగైంది. కవులు రాస్తున్నారు కానీ వారి వారి ఏకాంతాల్లో! విద్యావేత్తలు తమ ఉపకులపతుల ఆగ్రహానికి గురి కాకుడ దన్న రంధిలో ఉన్నారు.

ఏతావాతా... సమాజపు చేతన కాస్తా నిశ్శబ్దంలో అంగలారుస్తోంది. ఇది ఉపమాలంకారమే కావొచ్చుగానీ, మేధావుల చుట్టూ సంకెళ్ల శృంఖలాలు చుట్టుకుపోయి ఉన్నాయి. దశాబ్దాలపాటు ఫాసిస్టు వ్యతిరేక కూటమి కట్టిన శక్తులు మమ్మల్ని మళ్లీ ఆవహిస్తే బాగుండు. సామాజిక మేధావులు లేని సమాజం నశించిపోతుందనీ, అది కూడా చాలా నెమ్మదిగా కానీ కచ్చితంగా జరుగు తుందనీ ఆ శక్తులు గుర్తుచేస్తున్నాయి.

నీరా చంఢోక్‌ 
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement