
సభావేదికపై నినాదాలు చేస్తున్న విరసం సభ్యులు, చిత్రంలో వీరసాథేదార్, కళ్యాణరావు, సియాసత్ ఎడిటర్ జహీర్ అలీఖాన్, ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావు తదితరులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పార్లమెంటరీ ఎన్నికలను బహిష్కరించి నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాల్లో ప్రజలను సమీకరణం చేయాలని విరసం నేత వరవరరావు పిలుపునిచ్చారు. పార్లమెంటరీ ఎన్నికల ద్వారా అణగారిన వర్గాలకు ఒనగూరేదేమీలేదని చెప్పారు. 2019 ఎన్నికలు ఫాసిజానికి పరిష్కారం చూపుతాయని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లో విరసం రాష్ట్ర మహాసభల ముగింపుసభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ కూడా పార్లమెంటరీ ఎన్నికల వల్ల విధ్వంసంతో కూడిన దోపిడే తప్ప పేదలకు ఒనగూరిందేమీ లేదన్నారు. దేశంలో నరేంద్రమోదీతో మొదలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరకు అందరిదీ ఒకే విధానమని చెప్పారు.
పార్లమెంటరీ ఎన్నికల ద్వారా ప్రజలను కులం పేరుతో చీల్చి, మతం పేరుతో కలుపుతున్నారని పేర్కొన్నారు. బ్రాహ్మణ భావజాలం దేశానికి ఎంత శత్రువో.. పార్లమెంటరీ రాజకీయాలూ అంతే శత్రువులన్నారు. పార్లమెంటరీ పద్ధతిలో ఎన్నికైన నెహ్రూతో మొదలుకుని ఇందిరాగాంధీ, రాజీవ్ తదితరులంతా చేసిందేమిటని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా 3 వేల మంది కమ్యూనిస్టులను పొట్టన బెట్టుకున్నారని, అదే సమయంలో రజాకార్ల పేరుతో 40 వేల మంది ముస్లింలను ఊచకోత కోశారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు నక్సల్బరీ ఒక్కటే మార్గం కాదని వరవరరావు పేర్కొన్నారు.
1930లో మార్క్సిజం ఎలాగైతే ఫాసిజాన్ని ఓడించిందో అలాంటి సమీక్ష జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గొప్ప విప్లవం దేశంలో మళ్లీ వస్తుందని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం నల్లమలలో విప్లవకారులు లేకపోవచ్చు.. ఖాళీ అయిన నల్లమల విప్లవం భవిష్యత్‌లో వస్తోందన్నారు. విరసం అంటరానితనం అయ్యిందని, ఎన్‌కౌంటర్ల పేరుతో రాజ్యహింసకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ముంబైలో ఏడుగురిని బందీ చేశారని, వారిపై మావోయి స్టు ముద్రవేసి హతం చేసేందుకు రాజ్యం కుట్ర చేస్తోందని వరవరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా వారి అరెస్టును వెంటనే ప్రకటించాలని, వారి ప్రాణాలకు హాని తలపెట్టవద్దని ఆయన కోరారు.
పాలకులు భయపడుతున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్
సభలు, సమావేశాలు జరుపుతామంటే పాలకులు భయపడుతూనే ప్రజలను భయపెట్టిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో పాలక, ప్రతిపక్షాలన్నీ కూడా భయంతో సతమతమవుతున్నాయని చెప్పారు. ఈడీ, సీబీఐ, సిట్ ఇలా తమ మీద ఎలాంటి ఆరోపణలు వస్తాయో.. ఎప్పుడు జైలుకు వెళ్తామోననే ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కల నెరవేరిన మరుసటి రోజు నుంచే సభలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. భయానక పరిస్థితుల్లో కూడా మాట్లాడగలిగే సాహసం చేసేది ఒక్క విరసం మాత్రమేనన్నది గుర్తుం చుకోవాలన్నారు. ప్రస్తుతం దేశభక్తి అంటే రామభక్తిగా మారిందని.. రాముడిని కొలవకపోతే దేశద్రోహం చేసినట్లుగా చిత్రీకరిస్తున్నారని విరసం నేత కల్యాణ రావు దుయ్యబట్టారు. దేశంలో బ్రాహ్మణీయ ఫాసిజం పెరుగుతుందని, దీనికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని నాగపూర్‌కు చెందిన వీరసాథెదార్ అన్నారు.
విరసం రాష్ట్ర కార్యదర్శిగా పాణి
విరసం రాష్ట్ర కార్యదర్శిగా పాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర మహాసభల్లో ముగింపు సందర్భంగా ఆదివారం ఈ ప్రకటన చేశారు. విరసం సభ్యులు వరలక్ష్మి, కాశీం, రాంకి, అరసవెల్లి కృష్ణ, జగన్, చిన్నయ్య, బాసిత్, రివేరా, క్రాంతి, వెంకన్న, రాము, గీతాంజలి, ఉదయబాను, ఉజ్వల్, కిరణ్ తదితరులు ఏకగ్రీవంగా పాణిని ఎన్నుకున్నారు.