మెజారిటీ కోల్పోయిన అధికార కూటమి
ప్రధానిగా కొనసాగుతా
షిగెరు ఇషిబా ప్రకటన
టోక్యో: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా నేతృత్వంలోని అధికార కూటమి ఆదివారం జరిగిన కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీని కోల్పోయింది. 465 స్థానాలున్న దిగువ సభలో కూటమి బలం 279 స్థానాల నుంచి 215కు పడిపోయింది. మెజారిటీకి కనీసం 233 స్థానాలు అవసరం. కూటమి సారథి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ)కి 2009 తర్వాత అత్యంత దారుణమైన ఫలితాలివే.
జపాన్‌ను దాదాపుగా 1955 నుంచీ ఎల్‌డీపీయే పాలిస్తూ వస్తోంది. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అనిశ్చితి దెబ్బకు జపాన్ కరెన్సీ యెన్ మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చాయని ఇషిబా సోమవారం అంగీకరించారు. ‘‘ప్రజా తీర్పును అంగీకరిస్తున్నా. అయితే ప్రధానిగా నేనే కొనసాగుతాం’’ అని స్పష్టం చేశారు.
‘‘అధికార కూటమికి మా ఎల్‌డీపీయే సారథ్యం వహిస్తుంది. కీలక విధానాలతో ప్రణాళికాబద్ధమైన బడ్జెట్‌ను రూపొందిస్తాం. రాజకీయ సంస్కరణలు కొనసాగిస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటే ప్రతిపక్షాలకు సహకరించడానికి మా పార్టీ సిద్ధం’’ అన్నారు. డిసెంబర్ నెలాఖరులో కీలకమైన బడ్జెట్ ప్రణాళికలను పాలకవర్గం ఆమోదించేదాకా ఇషిబా కొనసాగే అవకాశముంది. ఫ్యూమియో కిషిడా నుంచి ఇషిబా అక్టోబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ఆ వెంటనే సాధారణ ఎన్నికలకు వెళ్లారు.
చిన్న పార్టీలే కీలకం
సెంట్రిస్ట్ నేత యోషిహికో నోడా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం కాన్‌స్టిట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సీడీపీజే) 148 స్థానాలు గెలుచుకుంది. ఇది గతంలో కంటే 50 స్థానాలు అధికం. ‘‘అధికార కూటమికి మెజారిటీ రాకుండా చూడాలన్న లక్ష్యాన్ని సాధించాం. ఇది గొప్ప విజయం’’ అని నోడా అన్నారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి సంకీర్ణానికి నాయకత్వం వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు 30 రోజుల సమయముంది. ఎక్కవ సీట్లు సాధించిన చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారనుంది. ఇషిబాతో చేయి కలిపేందుకు డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ది పీపుల్, కన్జర్వేటివ్ జపాన్ ఇన్నోవేషన్ పార్టీ సిద్ధంగా ఉన్నాయి. పాక్షిక పొత్తుకు సిద్ధమని డీపీపీ అధినేత యుచిరో తమాకీ కూడా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment