
వాషింగ్టన్: కేవలం పది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాటు అక్కడే ఉండిపోయిన భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఈ నెల 19న తిరుగు పయనం కానున్నారు. ఇందుకు సన్నాహకంగా ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) కమాండ్ బాధ్యతలను శనివారం రష్యా వ్యోమగామి అలెక్సీ ఒవ్‌చినిన్‌కు అధికారికంగా అప్పగించారు. ఈ నెల 12 లేదా 13వ తేదీన ప్రయోగించే స్పేస్ ఎక్స్ క్రూ–10 మిషన్‌లో నాసా (NASA) వ్యోమగాములు అన్నె మెక్ క్లయిన్, నికోల్ అయెర్స్‌తోపాటు జపాన్‌కు చెందిన టకుయా ఒనిషి, రష్యా వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉంటారు.
ఐఎస్‌ఎస్‌లో కొత్త వారికి బాధ్యతలను అప్పగించే కార్యక్రమం మరో వారంపాటు కొనసాగనుంది. మార్చి 19వ తేదీన సునీతతోపాటు నాసాకే చెందిన బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గొర్బునోవ్‌లు స్పేస్ ఎక్స్ క్రూ–10 మిషన్‌లో భూమికి తిరిగి రానున్నారు. నూతనంగా ఐఎస్‌ఎస్ కమాండ్ బాధ్యతలు చేపట్టిన ఒవ్‌చినిన్ ఏప్రిల్ వరకు అక్కడే ఉంటారు. గతేడాది జూన్‌లో బుచ్ విల్మోర్‌తో కలిసి సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడం, స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఇన్నాళ్లూ చిక్కుకుపోవడం తెలిసిందే.
కొలంబియా వర్సిటీపై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ షాకుల పరంపర తన, పర అనే తేడా లేకుండా కొనసాగుతోంది. క్యాంపస్‌లో యూదు వివక్షను, యూదు విద్యార్థులపై వేధింపులు, దాడులను అడ్డుకోవడంలో విఫలమైందంటూ న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీపై అధ్యక్షుడు తాజాగా కన్నెర్రజేశారు. అందుకు శిక్షగా వర్సిటీకి అందుతున్న ప్రభుత్వ నిధుల్లో ఏకంగా 40 కోట్ల డాలర్ల మేరకు కోత పెడుతున్నట్టు ప్రకటించారు! గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు నేపథ్యంలో గతేడాది పాలస్తీనా అనుకూల నిరసనలు, ఆందోళనలతో వర్సిటీ అట్టుడికిపోవడం తెలిసిందే.
చదవండి: స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!
ఇలాంటి చట్టవిరుద్ధ నిరసనలకు వేదికలుగా మారే విద్యా సంస్థలు, వర్సిటీలకు నిధులు నిలిపేస్తానని గత వారమే ట్రంప్ హెచ్చరించారు. క్యాంపస్‌లో యూదు విద్యార్థులు నిరంతర వేధింపులు, వివక్ష, హింస ఎదుర్కొంటున్నా వర్సిటీ పాలక వర్గం చేష్టలుడిగిందని అమెరికా విద్యా శాఖ మంత్రి లిండా మెక్‌మోహన్ ఆరోపించారు. ‘‘దీన్ని సహించేది లేదు. కొలంబియాతో పాటు ఇతర వర్సిటీలకూ ఇదో హెచ్చరిక’’అని ఆమె చెప్పారు. పరిశోధనలు తదితరాలను ఈ నిధుల కోత తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వర్సిటీ తాత్కాలిక ప్రెసిడెంట్ కత్రీనా ఆర్మ్‌స్ట్రాంగ్ ఆందోళన వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment