ఢిల్లీ: కాంగ్రెస్ హైలెవల్ కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో మంత్రులు సమావేశమైయ్యారు. రాష్ట్ర విభజన, హైదరాబాద్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రాంత నేతల అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేస్తారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన వెంటనే సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. బంద్లు - రాస్తారోకోలు - వాహనాలు తగులబెట్టటం - దిష్టి బొమ్మల దగ్ధం - జవర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసం ........ ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేయని వారిని ప్రజలు నిలదీస్తున్నారు. వారి ఇళ్లపై దాడులు కూడా చేస్తున్నారు. రాజీనామాలు చేయని వారు తమతమ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
సీమాంధ్రలో ఉద్యమ పరిస్థితి కేంద్రం దృష్టికి వెళ్లింది. దానికి తోడు ఈరోజు పార్లమెంటులో సీమాంధ్ర ఎంపిలు ఆందోళన చేశారు. దాంతో కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో మంత్రుల బృందం సీమాంధ్ర ప్రాంత నేతల భయాలు, అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకోనుంది.
ఇదిలా ఉండగా, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియ మొదలైందని రాజ్యసభలో ఈరోజు కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అభ్యంతరాలు తెలుసుకోనున్న హైలెవల్ కమిటీ
Published Mon, Aug 5 2013 4:44 PM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement