1,500కు పైగా అభ్యర్థుల మార్కులపై పునఃసమీక్ష
ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరగలేదన్న ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులున్నారు. అందుకే నీట్–2024ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో 1,500 మందికిపైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేసు మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర విద్యా శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబో«ద్‌కుమార్ సింగ్ శనివారం వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని అన్నారు.
గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు.
ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపరు లీక్ కాలేదన్నారు. నీట్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేసు మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలామందికి ఫస్టు ర్యాంకు వచి్చందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం తెలిసిందే.
ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్‌గఢ్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్‌లోని సూరత్‌తోపాటు చండీగఢ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment