విభజన వివాదం రోజుకో కొత్త మలుపు
ఢిల్లీ: రాష్ట్ర విభజన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. రాయల్-తెలంగాణ అంశం వెనక్కు వెళ్లిపోయింది. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం - మరో పక్క హైదరాబాద్ అంశంపై చర్చ - ఇంకోవైపు సీమాంధ్ర కావాలన్న వాదం ... ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లా నేతలు తమ జిల్లాను తెలంగాణలో కలపమని కోరుతున్నారు.
ఈ విషయమై కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, ఎంపి ఎస్పివై రెడ్డి, రాభూపాల్ రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి, మురళీ కృష్ణ, లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు పార్టీ రాష్ట్ర వ్యవహరాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపాలని వారు కోరారు.
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా వారు కోరారు. తమ జిల్లాను తెలంగాణలో కలపమని ఆమెను కూడా వారు కోరనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తమ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి రేపు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఇది ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం అని సమైక్యాంధ్రవాదులు విమర్శిస్తున్నారు. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చిన సమయంలో ఒక్క కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపమని కోరడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తీరును వారు తప్పుపడుతున్నారు.