సోనియాకు కర్నూలు జిల్లా నేతల వినతి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో రాయలసీమ మరింత వెనకబాటుకు గురవుతుందని కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల బృందం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్ద ఆందోళన వెలిబుచ్చింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని.. అలా వీలుకాని పక్షంలో రాయలసీమ నాలుగు జిల్లాలతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు బృంద సభ్యులు చెప్పారు. కర్నూలు జిల్లా నేతలు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం సోనియాగాంధీని పార్లమెంటు ప్రాంగణంలో కలిశారు.
ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రాంరెడ్డి, మురళీకృష్ణలు ఈ బృందంలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగితే తమ జిల్లాకు ఆ ప్రాంతంతో నదీ జలాల వివాదం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు సోనియాకు వివరించామని చెప్పారు. ‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగులు దాటితే కానీ నీరు కిందకు రాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ వారు పై నుంచి నీటిని కిందకు రానిచ్చే అవకాశాలు తక్కువ. అక్కడ విద్యుత్ ఉత్పత్తిని సైతం మొదలుపెడితే నీటి వినియోగం పెరిగితే ప్రాజెక్టులో నీరే ఉండదు. అదీగాక తెలంగాణలో ఆయకట్టు ప్రాంతం ఎక్కువ. దాంతో వారికే ఎక్కువ నీరు అవసరం. వారి అవసరాలు తీరేవరకూ కిందకు నీరు వదలకుంటే మా ప్రాంతం అర తా ఎడారిగా మారటం ఖాయం’ అని నేతలు సోనియా వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రపతితోనూ భేటీ: కర్నూలు జిల్లా నేతలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కూడా కలిశారు. విభజనతో తమ ప్రాంతానికి జరిగే నష్టాన్ని ఆయనకు వివరించి రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని లేకుంటే 3 రాష్ట్రాలుగా విభజించాలని కోరారు.
రాయల తెలంగాణ అనలేదు..కోట్ల: రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని తాను కోరలేదని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. సమైక్యమే తన తొలి ప్రాధాన్యం అని.. అలా వీలుకాని పక్షంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. మంగళవారం సోనియాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. విభజనతో కర్నూలుకు తాగు, సాగు నీటి విషయంలో వచ్చే సమస్యలను సోనియా దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.
సమైక్యం కాకుంటే.. గ్రేటర్ సీమ ఇవ్వండి
Published Wed, Aug 7 2013 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement