ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తాం: సోనియా
Published Wed, Aug 7 2013 2:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రాష్ట్ర విభజన నిర్ణయంతో రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో నెలకొని ఉన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను వివరించి రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరేందుకు ఏడుగురు కేంద్ర మంత్రులు- ఎం.ఎం.పల్లంరాజు, చిరంజీవి, కావూరి సాంబశివరావు, జె.డి.శీలం, పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురందేశ్వరి, కిల్లి కృపారాణి, మంగళవారం ఢిల్లీలో సోనియాగాంధీని కలిసి మాట్లాడారు. విభజన నిర్ణయం ఏకపక్షంగా జరిగిందనే భావన సీమాంధ్ర ప్రజల్లో ఉందని.. నిర్ణయం వెలువడిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో వారిలో తీవ్ర అభద్రతా భావం నెలకొన్నదని ఆమెకు వివరించినట్లు సమాచారం.
రాజధాని నగర ప్రతిపత్తి, నదీజలాల పంపిణీ, నిధులు తదితర కీలకాంశాలపై ఎలాంటి స్పష్టత లేకుండా నిర్ణయాన్ని ప్రకటించటం వల్ల సీమాంధ్ర ప్రాంతం అగ్నిగుండంలా మారిందని వారు పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని.. లేనిపక్షంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా ప్రత్యామ్నాయ పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేయాలని సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్ర విభజనపై సోమవారం రాజ్యసభలో ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ కాకుండా ఆర్థికమంత్రి చిదంబరం ప్రకటన చేయటమేమిటని కూడా మంత్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులతో దాదాపు అరగంట సేపు సమావేశమైన కాంగ్రెస్ అధ్యక్షురాలు రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించే విషయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా పార్టీ త్వరలో ఏర్పాటు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీకి వాదనలు వినిపించమని సలహా ఇచ్చారని తెలిసింది.
విభజన ప్రక్రియ ఆగుతుంది: పల్లంరాజు
‘తెలంగాణ నిర్ణయంతో మీరు ఒక ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి న్యాయం చేకూర్చారు.. ఇతర ప్రాంతాల ప్రజల సమస్యలను కూడా పరిష్కరించి న్యాయం చేయాలని కోరామ’ని ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన మంత్రి పల్లంరాజు, చిరంజీవి, శీలం వెల్లడించారు. సోనియాగాంధీతో అన్ని విషయాలను కూలంకషంగా చర్చించిన తర్వాత రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ ఎలాంటి అన్యాయం జరగదనే విశ్వాసం కలిగిందని పల్లంరాజు పేర్కొన్నారు. ఉన్నతస్థాయి కమిటీ తన పనిని పూర్తిచేసేంతవరకూ రాష్ట్ర విభజన ప్రక్రియ కచ్చితంగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉండేది, కమిటీ పరిశీలనాంశాలేమిటి అన్న విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ త్వరలోనే ప్రకటిస్తారని అధ్యక్షురాలు తెలియజేసినట్లు ఆయన చెప్పారు. రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు కానున్నదని భావిస్తున్న ఈ కమిటీ ముందు తమ వాదనలు ఉంచుతామని, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులందరి అభిప్రాయాలను ఈ కమిటీ సేకరించి తగిన నిర్ణయాలు చేస్తుందని కేంద్ర మంత్రులు తెలిపారు.
లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు: లగడపాటి, అనంత
రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తామని కాంగ్రెస్ అధిష్టానం తమకు హామీ ఇచ్చిందని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. విభజనపై సీమాంధ్ర ప్రజల అభ్యర్థనలు, సూచనలను వినేందుకు ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, దిగ్విజయ్‌సింగ్, అహ్మద్ పటేల్‌లతో అధిష్టానం ఒక కమిటీని వేసిందని.. ఆ కమిటీ ముందు తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని వారు తెలిపారు. మరోవైపు.. రాష్ట్ర విభజన అంశంపై బుధవారం లోక్‌సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తామని స్పీకర్ మీరాకుమార్ తమకు హామీ ఇచ్చారని, వీలైనంత ఎక్కువ సమయం కేటాయించి చర్చకు అనుమతిస్తామని చెప్పారని ఎంపీలు పేర్కొన్నారు. స్పీకర్ హామీ దృష్ట్యా సభలో నిరసనలు కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై బుధవారం ఉదయం ఎంపీలందరం సమావేశమై నిర్ణయిస్తామన్నారు.
సోనియాతో కాసు, తెలంగాణ ఎంపీల భేటీ
రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించటం పార్టీకి, దేశానికి కూడా శ్రేయస్కరమని, వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరినట్లు ఆయన ఆ తర్వాత మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, ఎం.ఎ.ఖాన్ తదితరులు కూడా మంగళవారం సోనియాగాంధీని కలుసుకొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు వెల్లడించారు.
చిదంబరాన్ని కలిసిన సీమాంధ్ర మంత్రులు
సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతమవుతున్న ఆందోళనలను సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దృష్టికి తీసుకెళ్లారు. విభజనకు సీమాంధ్రలో మద్దతు లభించడం లేదని, చాలా అంశాలపై స్పష్టతలేని కారణంగా ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, వారంతా అభద్రతాభావంతో ఉన్నారని వివరించారు. వారి అభద్రతను తొలగించకుండా విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టడం తగదని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ అంశం, దానితో ముడిపడి ఉన్న ఇతర అంశాలతో పాటు, ఇటీవల సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చిదంబరం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యంతరాలను పార్టీ కమిటీ పరిశీలించే వరకు ప్రభుత్వంలో తెలంగాణ ప్రక్రియను ఆపాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రులు ఆర్థిక శాఖ కార్యాలయంలో చిదంబరాన్ని కలిశారు.
Advertisement