తెలంగాణపై కాంగ్రెస్ డ్రామాలు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: పార్టీలో మాట్లాడుకోకుండా తెలంగాణపై కాంగ్రెస్ డ్రామాలాడుతోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఒకే రోజు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాంగ్రెసే తెలంగాణ ఇచ్చిందని సంబరాలు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ రావడానికి టీడీపీ, బీజేపీలే కారణమని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజలకు కావాల్సింది కాంగ్రెస్ కమిటీ కాదని, ప్రభుత్వం తరఫున కమిటీ వేసి సమాధానం చెప్పాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. వారి అనుమానాలను నివృత్తి చేయాలన్నారు.
రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. విభజన తీరును కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు సీమాంధ్ర ఉద్యోగులకు సంబంధించి టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు దుమారంలేపాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ వైఖరిని వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు.