సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేక భావనను నోట్ల కట్టలతో మేనేజ్ చేసేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ప్రధానంగా ఒకస్థాయి నేతలతో పాటు డ్వాక్రా సంఘాలను లక్ష్యంగా చేసుకుని డబ్బుల వరద పారించాలని నిర్ణయించింది. కర్నూలు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఏకంగా రూ.100 కోట్ల మేర వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. వైరిపక్షంలోని ఒక స్థాయి నేతలను లక్షలకు లక్షలు పోసి కొనుగోలు చేస్తుండగా.. ఇక గ్రూపుగా ఉన్న వారికి వేలల్లో ఆఫర్లు ఇస్తున్నారు.
డ్వాక్రా సంఘాల లీడర్లకు రూ.50 వేల చొప్పున అందజేస్తున్నారు. అంటే సంఘంలో ఉండే పది మంది సభ్యులకు తలా రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తూ గాలం వేస్తున్నారన్న మాట. చిన్న చిన్న కాలనీలు, గ్రామాల్లో చీరలు, ముక్కెర్లను కూడా పంపిణీ చేస్తూ మహిళలను ప్రలోభపెడుతున్నారు. కర్నూలులో ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థి టీజీ భరత్ డ్వాక్రా సంఘాలతో మూడు రోజులుగా సమావేశాలు నిర్వహించి.. డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక పత్తికొండలో ప్రతిపక్ష పార్టీలోని నేతలకు లక్షలతో గాలం వేస్తున్నారు. ఇందుకు అంగీకరించకపోతే... బెదిరింపులకూ దిగుతున్నారు. రెండు గ్రూపులు ఒక్కటయ్యాయని.. మీరు అటువైపు ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కర్నూలులో కోట్ల వరద..
కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఏకంగా రూ.100 కోట్ల వ్యయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక స్థాయి నేతలకు కూడా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక ఒక్కో బూత్‌లో రోజువారీ ఖర్చుల కోసం రూ.25 వేల చొప్పున వారం రోజులుగా పంపిణీ చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు గ్రూపునకు రూ.50 వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. నగరంలోని కొన్ని వాడల్లో చీరల వ్యాపారుల ద్వారా చీరలను కూడా మహిళలకు పంపిణీ చేయిస్తున్నారు. ముక్కుపుడకల పంపిణీకి సైతం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
పత్తికొండలోనూ అదే తీరు.. కర్నూలుతో సమానంగా పత్తికొండలోనూ రూ.100 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం తన కుమారుడిని గెలిపించుకోవడం అనివార్యంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తమ కుటుంబ రాజకీయ జీవితం పరిసమాప్తం అవుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అయితే, చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఆరోపణలతో పాటు ప్రజల పట్ల కనీస మర్యాదగా ప్రవర్తించలేదనే చెడ్డపేరు కూడా ఉంది.
ఇక నియోజకవర్గంలో గత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని పరిస్థితి. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో గ్రామాల్లో ఒక స్థాయి నాయకులకు కూడా రూ.లక్షలు ఇచ్చి తమ వైపునకు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల బడ్జెట్ రూ.50 కోట్ల మేర ఉంటోంది. ప్రజా బలాన్ని సంపాదించలేని అధికార పార్టీ నేతలు.. ఈ విధంగా కోట్లతో ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment