పార్లమెంటులో ఆగని గందరగోళం.. వాయిదాల పర్వం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లాయి. లోక్సభను ఎలాగోలా నడిపించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు జై సమైక్యాంధ్ర నినాదాలు మొదలుపెట్టారు. సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినదించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు ససేమిరా వీల్లేదంటూ గట్టిగా పట్టుబట్టారు.
ఇంత గందరగోళం జరుగుతున్నా కూడా సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఎలాగోలా నిర్వహించేందుకు స్పీకర్ ప్రయత్నించినా మిన్నంటిన నినాదాల మధ్య అది కుదరలేదు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. తిరిగి 12 గంటల ప్రాంతంలో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అప్పటికీ నినాదాలు ఆగలేదు. రాజ్యసభలో 'మాకు న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్ను కాపాడండి' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలలోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు కొనసాగించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. ఒకపక్క దేశ భద్రత ప్రమాదంలో పడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటోందని ఆయన మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ ఎంపీలు కూడా తమ స్థానాల్లోంచి లేచి నిల్చున్నారు. లోక్సభలో స్పీకర్ మీరాకుమార్ పదే పదే వారించినా, వెల్ లోంచి సభ్యులు వెళ్లలేదు.
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. భారత భూభాగంలోకి ప్రవేశించి భారత సైనికులను హతమార్చిన పాకిస్థాన్ సైనికుల దుశ్చర్యను పలువురు సభ్యులు తీవ్రంగా ఎండగట్టారు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, ప్రధాని సభకు రావాలని బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. అక్కడి గందరగోళం నడుమ సభ వాయిదా పడింది.