సత్తెనపల్లి: ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఒక్కటే చేసిందనే అపవాదు వేస్తున్నారని, చంద్రబాబు రెండుసార్లు రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖలు ఇచ్చిన విషయాన్ని జేడీ శీలం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ తప్పుకాదని అందరూ కలిసి చేసిందే అని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాపై తిరుపతిలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా నరేంద్ర మోదీ హమీ ఇచ్చి మాటమార్చడం దురదష్టకరమన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని దూషిస్తూ ప్రధానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.... సిగ్గు లేకుండా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని జేడీ శీలం విమర్శించారు.
చంద్రబాబు తన చర్యల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ భూములు పంపిణీ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ బ్యాంకులు జాతీయకరణ చేస్తే మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. మోదీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడును ఓడించేందుకు ఇప్పటినుంచే సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.