వినబడలేదా ప్రమాద ఘంటిక? | Sakshi Editorial On Electronic voting in India | Sakshi
Sakshi News home page

వినబడలేదా ప్రమాద ఘంటిక?

Published Sat, Oct 12 2024 2:39 AM | Last Updated on Sat, Oct 12 2024 2:39 AM

Sakshi Editorial On Electronic voting in India

జనతంత్రం

భారతదేశంలో తొలితరం సెఫాలజిస్టుల్లో అగ్రగణ్యుడు ప్రణయ్‌రాయ్‌. తొలి 24 గంటల జాతీయ ఛానల్‌ (ఎన్‌డీటీవీ) వ్యవస్థాపకుడు కూడా ఆయనే! ఇప్పుడా ఛానల్‌ ఆయన చేతిలో లేదు. నరేంద్ర మోదీ జిగ్రీ దోస్త్‌ ఆధీనంలో ఉన్నది.ఎందుకలా జరిగిందో విజ్ఞులైన దేశవాసులందరికీ తెలుసు. సొంత ఛానల్‌ లేదు కనుక ఓ వెబ్‌ ఛానల్‌ కోసం మొన్నటి హరి యాణా, జమ్ము–కశ్మీర్‌ ఫలితాలను ఆయన విశ్లేషించారు.

హరియాణాలో విజేతగా అవతరించిన బీజేపీకి కాంగ్రెస్‌ కంటే కేవలం పాయింట్‌ ఆరు శాతం (0.6) ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 30 శాతం ఎక్కు వొచ్చాయి. ఇది తన సెఫాలజిస్టు అనుభవంలో ఒక అసా ధారణ విషయంగా ఆయన ప్రకటించారు. అయితే ఈ ఫలి తాన్ని సాధారణ మెజారిటీ ఎన్నికల విధానానికి (జజీటట్టp్చట్ట్టజ్ఛిఞౌట్ట టyట్ట్ఛఝ) ఆయన ఆపాదించారు. ఉత్తర అమె రికా, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉన్నది. ఈ అంశం ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రణయ్‌రాయ్‌ వ్యాఖ్యానంలో నర్మ గర్భత ఏమైనా ఉన్నదా అనేదే ఆసక్తికరమైన మీమాంస.

సెంట్రల్‌ హరియాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఐదు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం చెరో ఇరవై చొప్పున వచ్చాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి కాంగ్రెస్‌ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తేడాతో వారు 28 సీట్లు గెలిస్తే కాంగ్రెస్‌ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మొన్నటి లోక్‌సభ ఎన్నికల నాటికి హరియాణాలో బీజేపీకే రమారమి 12 శాతం ఓట్లు తగ్గాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఈ డౌన్‌ ట్రెండ్‌ కొన సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ (2024) ఎన్నికల కంటే మరో 6.2 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. ఈ రకమైన గాలి వీస్తున్నప్పుడు అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం అసాధ్యం. పైగా హరియాణా వంటి భౌగోళికంగా చిన్న రాష్ట్రాల్లో అది అసంభవం.

కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన సీట్లలో మంచి మెజారిటీలు వచ్చాయి. దాదాపు డజన్‌ సీట్లలో బీజేపీకి అతి స్వల్ప మెజా రిటీలు వచ్చాయి. ఫిరోజ్‌పూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి అత్యధికంగా 98 వేల మెజారిటీ వస్తే అత్యల్పంగా కేవలం 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దేవేందర్‌ చతుర్భుజ్‌ గెలిచాడు. ఈ గణాంకాలు ఏరకమైన ట్రెండ్‌ను సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. నూటికి నూరు శాతం ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా కాంగ్రెస్‌ గెలుపునే సూచించాయి. వాటి అంచ నాల సగటు ప్రకారం కాంగ్రెస్‌ 55 చోట్ల, బీజేపీ 27 చోట్ల గెలవాలి. ఈ అంచనాలు తప్పడం వెనుక ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్‌ జరిగిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈవీఎమ్‌లను హ్యాక్‌ చేయడమనే ఆరోపణ కొత్తదేమీ కాదు. 2019లో తొలిదశ పోలింగ్‌ ముగిసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆరోపణ చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో కలిసి మీడియాను అడ్రస్‌ చేస్తూ ఈవీఎమ్‌లను హ్యాక్‌ చేయడం సాధ్యమైన పనేనని ఆయన వెల్లడించారు. ఎలా చేయవచ్చో మీడియాకు వివరిస్తూఆయన అనుచరుడు వేమూరి హరిప్రసాద్‌ మరో సందర్భంలో ఒక ఈవీఎమ్‌ను ప్రదర్శించి చూపెట్టారు. హరిప్రసాద్‌ ఈవీఎమ్‌ను ఎత్తుకొచ్చాడని ఆయనపై కేసు కూడా నమోదైంది. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి మన ఈవీఎమ్‌ల హ్యాకింగ్‌లో రష్యన్‌ హ్యాకర్ల పాత్ర ఉన్నదని కూడా సెలవిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో సుశీల్‌కుమార్‌ షిండే, శరద్‌ పవార్‌ల సమక్షంలోనే ఆయన ఈ ఆరోపణ చేశారు.

ఈవీఎమ్‌ల హ్యాకింగ్‌ ఎలా చేయవచ్చో ఆయనకు ఐదేళ్ల కిందటే తెలుసనుకోవాలి. అంతేకాదు, ఈ హ్యాకింగ్‌ చేసి పెట్టే కిరాయి మనుషులెవరో, వారు ఏ దేశాల్లో ఉంటారో కూడా ఆయనకు అప్పటికే తెలుసు. హరియాణాలో అటూ ఇటుగా పదిహేను నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్‌ జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ బలంగా నమ్ముతున్నది. ఈమేరకు ఆ  పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. ఈ తతంగంపై సిటింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.

పలు పోలింగ్‌ కేంద్రాల్లో తాము ఎంత విజ్ఞప్తి చేసినా వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించలేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్నది. ఎన్నికల సంఘానికి మొత్తం 20 ఫిర్యాదులను ఆ పార్టీబృందం అందజేసింది. పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించినప్పుడు 65 చోట్ల ఆధిక్యతలో ఉన్న పార్టీ ఈవీఎమ్‌ల లెక్కింపులో 37 స్థానా లకు ఎలా పడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హూడా ప్రశ్నించారు. పోలింగ్‌ ముగిసినా కూడా ఈవీఎమ్‌ల బ్యాటరీలు కొన్నిచోట్ల 99 శాతం ఛార్జింగ్‌తో ఉన్నా యని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆరోపించారు. 

ఈవీఎమ్‌లు 90 శాతానికి పైగా బ్యాటరీ ఛార్జింగ్‌తో ఉన్న ప్రతిచోటా బీజేపీ గెలిచిందనీ, 60 నుంచి 70 శాతానికి ఛార్జింగ్‌ పడిపోయిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గెలిచిందని ఆ పార్టీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆధారాలతోనే ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్‌ జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది.

హరియాణా ఎన్నికల తర్వాతనే కాంగ్రెస్‌ పార్టీకి జ్ఞానో దయం కలిగినట్టున్నది. కానీ ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలే పెద్ద ప్రహసనంలా జరిగాయని కొన్ని స్వతంత్ర సంస్థలు నెత్తీనోరూ బాదుకొని గత మూడు నెలలుగా ఘోషిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ కిమ్మ న్నాస్తిగా మిన్నకుండిపోయింది. స్వచ్ఛంద సంస్థలైన ‘వోట్‌ ఫర్‌ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ), ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌’ (ఏడీఆర్‌) వంటి సంస్థలు ఎన్నికల ఫార్సును విడమర్చి చెప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియో జకవర్గాలపై సమగ్ర పరిశీలన చేసిన వీఎఫ్‌డీ 200కు పైగా పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేసింది. ఈ ఎన్నికల తతంగంపై ఒక షాకింగ్‌ పరిశీలనను అది దేశం ముందుకుతెచ్చింది.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా సాయంత్రం 5 గంటలకో, 6 గంటలకో పోలింగ్‌ సమయం ముగియగానే పోలింగ్‌ శాతంపై ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. తర్వాత పూర్తి వివరాలను క్రోడీకరించి రాత్రి 8 లేదా 9 గంటలకల్లా తుది గణాంకాలను విడుదల చేస్తుంది. పోలింగ్‌ శాతంపై ఇదే ఫైనల్‌! అరుదుగా మాత్రం మరుసటిరోజున సవరించిన శాతాన్ని ప్రకటిస్తుంది. ఈ సవరణ గతంలో ఎన్నడూ కూడా ఒక శాతం ఓట్ల పెరుగుదల లేదా తరుగుదలను దాటలేదని వీఎఫ్‌డీ ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల శాతంపై వెలువడిన తుది ప్రకటనలను సవరిస్తూ వారం రోజుల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్‌ శాతాలను విడుదలచేసింది. ఈ సవరణకు ఇంత సమయం తీసుకోవడమే అసా ధారణ విషయమైతే, పెరిగినట్లు చెప్పిన పోలింగ్‌ శాతాలు మరింత అసాధారణం.

ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకు పెరిగినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే ఈ పెరిగిన ఓట్లు 12.54 శాతం. ఒడిషాలో 12.48 శాతం. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసిన రాత్రి చేసిన తుది ప్రకటన ప్రకారం 68 శాతం ఓట్లు పోలయ్యాయి. వారం రోజుల తర్వాత దాన్ని 81 శాతంగా ఈసీ ప్రకటించింది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? జరగదు కనుకనే ఈ ‘పెరిగిన’ ఓట్లను డంపింగ్‌ ఓట్లుగా వీఎఫ్‌డీ అభివర్ణించింది. డంపింగ్‌ ఓట్లు లేనట్లయితే అధికార ఎన్డీఏ కూటమి 79 లోక్‌సభ సీట్లను కోల్పోయి ఉండేదని లెక్క కట్టింది. దేశ వ్యాప్తంగా ఈ డంపింగ్‌ ఓట్లు 4 కోట్ల 65 లక్షలయితే ఒక్కఆంధ్రప్రదేశ్‌లోనే అవి 49 లక్షల పైచిలుకున్నట్టు వీఎఫ్‌డీ తేల్చింది.

ఈవీఎమ్‌లను హ్యాకింగ్‌ చేయడం, లేదా ట్యాంపరింగ్‌ చేయడం ఎలానో బాగా తెలిసిన వ్యక్తి, ఆ పనులు చేసే నిపుణులు ఏయే దేశాల్లో ఉంటారో ఆనుపానులు తెలిసిన వ్యక్తి ఏపీలో కూటమి నేతగా ఉన్నందువల్ల మిగతా రాష్ట్రాలకు భిన్నంగా విస్తృత స్థాయిలో ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్‌ లేదా హ్యాకింగ్‌ జరిగి ఉండొచ్చని ఒక అభిప్రాయం. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్యాంపరింగ్‌ జరిగినట్లయితే పెద్దగా అనుమానాలు రాకుండానే బయటపడిపోవచ్చు. మొదటి మూడు దశల పోలింగ్‌లో ఈ మార్గాన్నే అనుసరించినట్టు వీఎఫ్‌డీ నివేదిక ద్వారా అర్థమవుతున్నది. కానీ,  ఆ తర్వాత టార్గెట్‌పై అనుమానం రావడంతో నాలుగో దశలో ఉన్న ఏపీలో ‘నిపుణుడైన’చంద్రబాబు సహకారంతో ఏపీతోపాటు ఒడిషాలో కూడా ఈవీఎమ్‌ల ఆపరేషన్‌ను విస్తృతంగా చేసి ఉండవచ్చు.

ఇందుకు పూర్వరంగంలో కూటమి నేతల కోరిక మేరకు అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చేసి ఎన్నికల సంఘం సహకరించింది.వీఎఫ్‌డీ నివేదిక ఆధారంగా ఏడీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి అనేక కీలక ప్రశ్నలను సంధించింది. ఈ సంస్థల సందేహాలకు ఇప్పటివరకూ స్పందించకుండా ఉండిపోవడం ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు గౌరవప్రదమేనా? ఈవిధంగా ఎన్నికలసంఘాన్ని దొడ్లో కట్టేసుకొని వోటింగ్‌ యంత్రాలతో మాయా జూదం గెలవడానికి అలవాటు పడితే ఇక ముందు అధికార పార్టీ ఓడిపోవడం జరిగే పనేనా? ఈ ధోరణి నియంతృత్వానికి దారి తీయదా? ...అటువంటి నిరంకుశ అధికారులనే బీజేపీ అధినాయత్వం కోరుకుంటుండవచ్చు. దాని రహస్య ఎజెండాను అమలు చేయడానికి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగం అడ్డంకిగా ఉన్న సంగతి జగద్విదితం. వీటిని మార్చడానికి ఇప్పు డున్న బలం సరిపోదు. అందుకే జమిలి ఎన్నికల నినాదాన్ని బలంగా ముందుకు తోస్తున్నారు.

ఇంకో ఏడాదిన్నరలోగా నియోజకవర్గాల పునర్విభజనను ముగించి రెండేళ్లలోగా జమిలి ఎన్నికలు జరపాలనే ఆలోచన ఢిల్లీ అధికార వర్గాల్లో ఉన్నట్టు సమాచారం. ఇతర పార్టీల సహకారానికి సామ దాన భేద దండోపాయ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈవీఎమ్‌ల సహకారంతో ఒక్క సారి జమిలి ఎన్నికల్లో గట్టెక్కితే అది చాలు. భవిష్యత్తు అధ్యక్ష తరహా పాలనకు అదే తొలిమెట్టని అధికార పరివారం ఆలోచన. ఇక దాని వెన్నంటే ఆ పరివారం రహస్య ఎజెండా ముందుకు వస్తుంది. అప్పుడిక మనం ఏం తినాలి? ఏం చదవాలి? ఏం రాయాలి? ఏం ఆలోచించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వగైరా దైనందిన జీవితాన్ని గైడ్‌ చేయడం కోసం వీధివీధిన మోరల్‌ పోలీసింగ్‌ను ఎదుర్కోవలసి రావచ్చు.

తొంభయ్యేళ్ల పోరాట ఫలితం మన స్వాతంత్య్రం. లక్షలాదిమంది త్యాగధనుల బలిదానం మన స్వాతంత్య్రం. అటువంటి స్వాతంత్య్రం ఈ దేశంలో పుట్టబోయే ప్రతి బిడ్డనూ సాధికార శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన తొలి తరం జాతీయ నేతలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. స్వాతంత్య్ర పోరాట వారసత్వం లేని శక్తులు ఇప్పుడు మత విద్వేషాలతో, మాయోపాయాలతో ఆ ప్రజా స్వామ్య వ్యవస్థను కబళించాలని చూస్తే మిన్నకుండటం ఆత్మహత్యా సదృశం.

ఏమాత్రం పారదర్శకత లేని, ఎంతమాత్రం జవాబు దారీతనం లేని ‘ఈవీఎమ్‌ ఎలక్షన్‌’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం చూరగొన్న ‘బ్యాలెట్‌ పద్ధతి’ని మళ్లీ తెచ్చుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. అభివృద్ధిచెందిన అన్ని దేశాల్లో, జనాభా సంపూర్ణంగా విద్యావంతులైన ప్రతి దేశంలోనూ బ్యాలెట్‌ పత్రాల ఓటింగ్‌ పద్ధతి మాత్రమే అమలులో ఉన్నది. ప్రస్తుతం భారత్‌తోపాటు వెనిజులా, ఫిలిప్పీన్స్,  శ్రీలంక వగైరా నాలుగైదు దేశాల్లోనే సంపూర్ణంగా ఈవీఎమ్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్, మెక్సికో, పాకి స్తాన్‌ వంటి దేశాల్లో పాక్షికంగా ఉపయోగిస్తున్నారు. 

ఇవన్నీ కలిపినా ఇరవై కంటే ఎక్కువ దేశాలు లేవు. జర్మనీలో ఈవీఎమ్‌ల వినియోగాన్ని ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసింది. ఈ విధానంలో పారదర్శకత లేదని కోర్టు అభిప్రాయపడింది. నెదర్లాండ్స్, ఐర్లండ్, కెనడా వగైరా దేశాలు కొంతకాలం ఈవీఎమ్‌లను ఉపయోగించిన తర్వాత ఇందులో విశ్వస నీయత లేదనే నిర్ధారణకు వచ్చి రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పయనించవలసిన అవసరం సెక్యులర్, సోష లిస్టు భారత రిపబ్లిక్‌కు ఉన్నది. లేకపోతే ఈవీఎమ్‌ల  బాట లోనే పయనిస్తే మనకు తెలియని మరో భారత్‌లో మనం ప్రవేశించవలసి రావచ్చు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement