ఏపీ ఎయిర్‌పోర్టుల విస్తరణపై కేంద్ర మంత్రి వివరణ
న్యూఢిల్లీ: తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల నవీకరణ పనులు కొనసాగుతున్నాయని, అయితే ఇందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నవీకరించేందుకు అవసరమైన అధ్యయనాన్ని జరిపించాలని గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖను కోరారు. దీనిపై ప్రస్తుత స్థితిని తెలుపుతూ ఆ శాఖ మంత్రి అజిత్‌సింగ్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జె.డి.శీలంకు జవాబు పంపారు. ఇందులో ఆయా విమానాశ్రయాల స్థితిగతులను వివరించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో కొత్త రన్‌వే, పార్కింగ్ స్టాండ్, రెండు ఏరో బ్రిడ్జిలతో కూడిన కొత్త టర్మినల్ భవన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. వరద నియంత్రణకు సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. రద్దీవేళల్లో 700 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కూడిన టర్మినల్‌ను 1,400 మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టుగా విస్తరిస్తున్నట్టు చెప్పారు.
ఇక తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించామని, అయితే అన్ని వసతులు సమకూరిన తర్వాతే అది అమల్లో వస్తుందని వివరించారు. 701.96 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇప్పటివరకు కేవలం 293.05 ఎకరాలను మాత్రమే ఇచ్చిందని తెలిపారు. సమీకృత టర్మినల్ నిర్మాణం గత ఫిబ్రవరి నాటికి 36 శాతం పూర్తయిందని, వచ్చే ఏప్రిల్ నాటికి వంద శాతం పూర్తవుతుందని వివరించారు. ఇది రద్దీవేళలో 500 దేశీయ, 200 అంతర్జాతీయ ప్రయాణికులకు సరిపడా సామర్థ్యంతో ఉంటుందని వివరించారు. ఇక విజయవాడ విమానాశ్రయానికి సంబంధించి రద్దీవేళల్లో 700 మంది ప్రయాణికులకు సరిపడా సామర్థ్యంతో టర్మినల్ నిర్మాణానికి ప్రణాళిక ఉందని, ఇందుకు ఏఏఐకి చెందిన 536.19 ఎకరాల స్థలాన్ని వినియోగిస్తామని తెలిపారు. ఇందులో రన్‌వేను తొలివిడతలో 7,500 అడుగుల నుంచి 9 వేల అడుగలకు విస్తరించడానికి, రెండో విడతలో 9 వేల అడుగుల నుంచి 10,500 అడుగులకు విస్తరించడానికి ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. అయితే తొలివిడత రన్‌వే విస్తరణకు 361 ఎకరాలు, రెండో విడతకు 101 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉందని తెలిపారు. స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్ ఒకటో తేదీనే జీవో విడుదల చేసినప్పటికీ, ఇంతవరకు స్థలాన్ని అప్పగించలేదని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.
విమానాశ్రయాలకు ఇంకా భూమి ఇవ్వలేదు
Published Wed, May 14 2014 12:34 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement