ajith singh
-
అజిత్ సింగ్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి అజిత్ సింగ్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మంత్రిగా అజిత్ సింగ్ రైతులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్(82) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన కరోనా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖనాయకుడైన అజిత్ సింగ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఏప్రిల్ 20న కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. గురువారం అజిత్ సింగ్ ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించటంతో మృతి చెందినట్లు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ జయంత్ చౌదరి ట్విటర్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. -
‘ధోని-కోహ్లిలను కలిసే ధైర్యం చేయరు’
ముంబై : భారత క్రికెట్లో ఫిక్సింగ్ భూతం మరోసారి అలజడి రేపింది. గత మూడేళ్లుగా అత్యంత విజయవంతమైన టోర్నీగా పేరుగాంచిన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కొందరు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లతో పాటు ఇద్దరు కోచ్‌లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణలో తేలింది. అయితే అంతర్జాతీయ క్రికెటర్ కూడా ఈ ఫిక్సింగ్ ఉన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బుకీలు ఎప్పుడూ సులువైన మార్గాన్నే ఎంచుకుంటారు. ఎవరు ఈజీగా ట్రాప్‌లో పడతారో వారినే వెతుక్కుంటారు. అంతేకాని ధోని, కోహ్లి వంటి దిగ్గజాలను, క్రికెట్ పట్ల అంకితాభావం ఉన్నవారిని సంప్రదించే ధైర్యం చేయరు. ఎందుకంటే వారిని కలిస్తే ఏమవుతుందో బుకీలకు తెలుసు. వారిని కలిసి సమయం వృథా చేసుకోవడం కంటే డబ్బులు, మాయ మాటలకు(జాతీయ జట్టులో ఆడే అవకాశం కల్పిస్తాం) లొంగే ఆటగాళ్లను బుకీలు ఎంచుకుంటారు. ఓ స్థాయి క్రికెటర్ ఫిక్సింగ్‌కు పాల్పడి తమకున్న మంచి పేరును చెడగొట్టుకోరు. బుకీలు తమకు ఏ టోర్నీ సౌలభ్యంగా ఉంటుందో అక్కడికే వెళతారు. ఇక్కడ(భారత్‌లో) సాధ్యం కాకుంటే విదేశీ టోర్నీలపై దృష్టి పెడతారు. ఫిక్సింగ్‌లో కోచ్ పాత్ర గురించి.. గతంలో ఐపీఎల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న ఫ్రాంచైజీతో కూడా ఆ కోచ్ కలిసి పని చేశాడు. ఆ తర్వాత ఒక రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. కనీసం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కూడా ఆడని అతను ఐపీఎల్ సహాయక సిబ్బందిలో ఎలా అవకాశం దక్కించుకున్నాడో, టీఎన్‌పీఎల్‌తో ఎలా జత కలిశాడో కూడా కూడా ఆశ్చర్యకరం. ఈ వివాదంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఎవరూ లేరు’ అని అజిత్ సింగ్ స్పష్టం చేశారు. -
ఉత్తరాది.. ఏ గాలి వీచేది?
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పన్నెండు లోక్‌సభ స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు హోరాహోరీ తలపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. హిందీ ప్రాంతంలోని ఈ కీలక నియోజకవర్గాల్లో ఈ బడా నేతలు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులున్నాయంటే.. యూపీ: సూపర్ సిక్స్ అమేథీ: రాహుల్‌తో స్మృతి ఢీ కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిని నిలపడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. కిందటి ఎన్నికల్లో ఆమె రాహుల్ చేతిలో ఓడిపోయినా ఈ నియోజకవర్గంలో స్మృతి క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. అనేక సమస్యలపై పోరాడుతూ, నెహ్రూ–గాంధీ వారసుడిపై ఆమె విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. మోదీ ప్రభంజనంలో సైతం బీజేపీకి చిక్కని అమేథీ.. ఈసారైనా ఆ పార్టీ వశమవుతుందా అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఈ స్థానానికి మే 6న పోలింగ్ జరగనుంది. ముజఫర్‌నగర్: సీటు మారిన అజిత్ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) నేత అజిత్‌సింగ్ ఈసారి ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడు, జాట్ నేత అయిన ఈయన ఈ ఎన్నికల్లో నియోజకవర్గం మారారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు సంజీవ్ బలియాన్ కూడా జాట్ కులస్తుడే కావడంతో స్థానికంగా ఉన్న పట్టుతో మరోసారి గెలవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న అజిత్‌కు జాట్లు, ముస్లింలు, దళితులు కలిసి ఇచ్చే మద్దతును బట్టి ఆయన గెలుపు ఆధారపడి ఉంది. వచ్చే నెల 11న ముజఫర్‌నగర్ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. బాగ్పత్: వారసుడొచ్చాడు అజిత్‌సింగ్ కుమారుడు, మథుర మాజీ ఎంపీ జయంత్ చౌధరీ తన కుటుంబానికి కంచుకోట అయిన బాగ్పత్ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ స్థానంలో ఆయన తండ్రి అజిత్‌ను బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్ ఓడించారు. తన గెలుపు ద్వారా కుటుంబ గౌరవం మళ్లీ సంపాదించడానికి జయంత్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమి మద్దతు వల్ల జాట్లతోపాటు ముస్లింలు, దళితుల ఓట్లు కూడా పడితే జయంత్ గట్టెక్కుతారు. మారిన పరిస్థితుల్లో సత్యపాల్ విజయం అంత తేలిక కాదు. ఏప్రిల్ 11న ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆమ్రోహా: ముగ్గురిలో ఎవరు? ఆమ్రోహా ప్రస్తుత ఎంపీ కన్వర్‌సింగ్ తన్వర్ (బీజేపీ).. ఈసారి బీఎస్పీ అభ్యర్థి దనిష్ అలీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో జేడీఎస్ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నికైన దనిష్ 20 శాతానికి పైగా ఉన్న ముస్లింలు, ఇతర సైనీలు, జాట్లు, దళితుల మద్దతుపై ఆశ పెట్టుకున్నారు. బీఎస్పీ మాజీ ఎంపీ రషీద్ అల్వీని కాంగ్రెస్ పోటీకి దింపడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ముస్లింల ఓట్లు ప్రత్యర్థుల మధ్య చీలిపోతే బీజేపీ అభ్యర్థి గెలిచే వీలుంది. (పోలింగ్: ఏప్రిల్ 18). ఫిరోజాబాద్: దాయాదుల పోరు ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ కుటుంబసభ్యులిద్దరి మధ్య పోరుకు ఫిరోజాబాద్ స్థానం వేదికైంది. ములాయం తమ్ముడు శివపాల్ కొత్తగా ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) స్థాపించి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు వరుసకు అన్న అయిన ఎస్పీ ఎంపీ రాంగోపాల్‌యాదవ్ కొడుకు, సిట్టింగ్ ఎంపీ అక్షయ్‌యాదవ్ (ఎస్పీ) తో ఇక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతోంది. పాత తరం ఓటర్లు, ఎస్పీ కార్యకర్తలతో ఉన్న పరిచయాలు, పలుకుబడి ఉన్నప్పటికీ శివపాల్ గెలవకున్నా.. అక్షయ్‌కు గట్టి పోటీ ఇవ్వగలరు. వచ్చే నెల 23న విజేతలెవరో తేలనుంది. బదాయూన్: ధర్మేంద్ర వర్సెస్ సంఘమిత్ర ఎస్పీ కంచుకోటల్లో ఒకటైన బదాయూన్ను గత ఆరుసార్లుగా ఈ పార్టీ గెలుచుకుంటూనే ఉంది. 15 శాతం ముస్లింలు, 15 శాతం యాదవులున్న ఈ స్థానం ఎస్పీకి అత్యంత అనుకూలమైనది. ములాయం అన్న కొడుకైన ధర్మేంద్ర ప్రస్తుత బదాయూన్ ఎంపీ. ఆయనపై యూపీ మంత్రి స్వామి ప్రసాద్మౌర్యా కూతురు సం ఘమిత్ర బీజేపీ అభ్యర్థిగా దిగడంతో యాదవేతర బీసీల ఓట్లు ధర్మేంద్రకు పడకపోవ చ్చు. మాజీ ఎస్పీ నేత, ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలిచిన సలీం షేర్వానీ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తున్నారు. (పోలింగ్: ఏప్రిల్ 23). బిహార్: ‘ఫోర్’కాస్ట్ బెగూసరాయ్: తరాల అంతరాలు బిహార్‌లో హోరాహోరీ పోటీ జరుగుతున్న స్థానాల్లో ఒకటి బెగూసరాయ్. ఇక్కడ కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ (బీజేపీ)తో విద్యార్థి నేత కన్హయ్యకుమార్ (సీపీఐ) పోటీ పడుతున్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో సీపీఐ భాగస్వామి కాకపోవడంతో సీపీఐ గెలుపు అంత తేలిక కాదు. ఒకప్పటి కమ్యూనిస్ట్ కంచుకోట అయిన ఈ స్థానాన్ని భారత లెనిన్‌గ్రాడ్‌గా పిలుస్తారు. సింగ్, కుమార్ ఇద్దరూ భూమిహార్ వర్గానికి చెందినవారే. ఈ అగ్రకులం ఓట్లలో చీలిక వస్తే మధ్యలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్‌కు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. ఏప్రిల్ 29న ఈ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. జముయీ: బరిలో పాశ్వాన్ కుమారుడు కేంద్రమంత్రి, ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్‌తో స్థానిక పార్టీ ఆర్ఎల్ఎస్పీ అభ్యర్థి భూదేవ్ చౌధరీ తలపడుతున్నారు. చౌధరీ 2009లో జేడీయూ టికెట్‌పై ఎన్నికయ్యారు. ఆయన ఈసారి విజయానికి దళితులు, బీసీ ఓట్లపై ఆధారపడుతున్నారు. అగ్రవర్ణాలు, దళితుల మద్దతుతో గెలవాలని చిరాగ్ ఆ«శిస్తున్నారు. వచ్చే నెల 11న ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. గయ: జీతన్‌కు పరీక్ష బీజేపీ కిందటిసారి గెలిచిన గయ స్థానాన్ని ఈసారి పొత్తులో భాగంగా జేడీయూకు కేటాయించింది. హెచ్ఏఎం పార్టీ నేత, మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ ఈ ఎన్నికల్లో జేడీయూ నేత విజయ్ మాంఝీని ఎదుర్కొంటున్నారు. ఇదే సీటులో 2014లో జీతన్‌రాం జేడీయూ టికెట్‌పై పోటీచేసి మూడో స్థానంలో నిలిచారు. అయితే, ఆర్జేడీ కూటమిలో భాగస్వామి కావడంతో ప్రస్తుతం ఆయన బలమైన అభ్యర్థి. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జేడీయూ అభ్యర్థి విజయ్ మాంఝీ 1996లో ఇక్కడి నుంచి ఎన్నికైన భగవతీ దేవి కుమారుడు. ఏప్రిల్ 11న ఎన్నిక జరగనుంది. పూర్ణియా: పప్పూతో పోటీ అంత ఈజీ కాదు కిందటి ఎన్నికల్లో బలమైన మోదీ గాలిని తట్టుకుని జేడీయూ గెలిచిన రెండు సీట్లలో ఒకటి పూర్ణియా. అప్పుడు బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ఉదయ్‌సింగ్ అలియాస్ పప్పూసింగ్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మహాగఠ్‌బంధన్ తరఫున రంగంలోకి దిగారు. ఈ స్థానంలో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ ఓట్లు, 30 శాతం ముస్లిం ఓట్లున్న కారణంగా జేడీయూ సిటింగ్ సభ్యుడు సంతోష్‌కుమార్ సింగ్ కుష్వాహా ఎదురీదుతున్నారు. కిందటిసారి కుష్వాహాకు పెద్దసంఖ్యలో పడిన ముస్లిం ఓట్లు ఈసారి కాంగ్రెస్‌కు పడే అవకాశముంది. (పోలింగ్: ఏప్రిల్ 18). ఉత్తరాఖండ్: ఆ రెండూ.. గఢ్వాల్: ఇద్దరి గురి బీసీ ఖండూరీపైనే.. ఉత్తరాఖండ్‌లోని ఈ స్థానంలో బీజేపీ మాజీ మంత్రి, ఎంపీ బీసీ ఖండూరీ కొడుకు మనీష్ ఖండూరీ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తుండగా, ఖండూరీ శిష్యుడు తీరథ్సింగ్ రావత్‌ను బీజేపీ తన అభ్యర్థిగా నిలిపింది. బీజేపీ టికెట్‌పై ఐదుసార్లు గఢ్వాల్ నుంచి బీసీ ఖండూరీ గెలిచారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయనకు ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. ఆయన కొడుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండటంతో రెండు పార్టీల మధ్య పోటీ కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు అభ్యర్థులూ తమకు బీసీ ఖండూరీ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. ఏప్రిల్ 11న భవితవ్యం తేలనుంది. నైనిటాల్–ఉధంసింగ్ నగర్: ‘రావత్’ రాజ్? ఇక్కడ బీజేపీ తరఫున పోటీచేస్తున్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అజయ్ భట్‌కు కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ స్థానంలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2017 ఎన్నికల్లో బీజేపీ 12 గెలుచుకున్నా రాజపుత్ర ఓటర్లలో రావత్‌కు ఉన్న పలుకుబడి కారణంగా భట్ ఎదురీదుతున్నారు. ఇదే వర్గానికి చెందిన బీజేపీ మాజీ సీఎం బీఎస్ కోషియారీకి టికెట్ ఇవ్వకపోవడంతో రాజపుత్రుల ఓట్లు, బ్రాహ్మణ వర్గానికి చెందిన భట్‌కు పడకపోవచ్చని అంచనా. వచ్చే నెల 11న ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
‘ముజాఫర్‌నగర్’ ఓటు ఎవరికి?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో 2013లో ముస్లింలు, జాట్ల మధ్య అల్లర్లు చెలరేగి 60 మంది మరణించడం, వేలాది మంది ముస్లింలు ఇల్లు వాకిలి వదిలి పెట్టి వలస పోవడం తెల్సిందే. ఇప్పుడు ముజాఫర్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ సంజీవ్ బలియాన్, ఆయనపై మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు, ఆర్ఎల్డీ నాయకుడు అజిత్ సింగ్ (80) పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు వారు సహజంగా అజిత్ సింగ్‌కు ఓటేయాలి. ఆయన కూడా జాట్ కులస్థుడు అవడం వల్ల ఆయనకు ఎలా ఓటేయాలని అక్కడి ముస్లింలు తర్జనభర్జన పడుతున్నారు. వారంతా నగర ప్రముఖుడు, మర్యాదస్తుడు ముఫ్తీ జుల్ఫికర్ అభిప్రాయాన్ని కోరుతున్నారు. నాడు జాట్ కులస్థులే తమ మీద దాడులు జరిపారని, ఇల్లు తగులబెట్టారని మండిపోతున్న ముస్లింలకు ఈ సంశయం రావడం సబబేనని జుల్ఫికర్ తనను కలిసిన మీడియా ప్రతినిధితో అన్నారు. ‘పాము కాటుకు గురైన వ్యక్తుల చికిత్సకు విరుగుడుగా మళ్లీ విషాన్నే ఇస్తారు. నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ నేతల పాలనలో మేము నిర్లక్ష్యానికి గురవుతున్నాం. ముందు పెద్ద శత్రువును ఓడించాలి. వారిని ఓడించడానికి జాట్లతో జరిగిన గొడవను పూర్తిగా మరచిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ తన సలహాను అడిగిన ప్రతి ముస్లింకు తాను ఇదే విశయం చెబుతున్నానని ఆయన చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా ముస్లింలు, జాట్లు కలిసిమెలసి ఉంటున్న ముజాఫర్‌నగర్‌లో 2014లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలోనే 2013లో అల్లర్లు చెలరేగాయి. అనేక మంది ముస్లింలు చనిపోవడంతోపాటు పదుల సంఖ్యలో మహిళలు గ్యాంగ్ రేప్‌లకు గురయ్యారు. ఇప్పటికీ ఆ కేసుల్లో ఎవరికి శిక్ష పడలేదు. నాటి అల్లర్లలో నిందితుడైన సంజీవ్ బల్యాన్ ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మళ్లీ ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. ఆయనపై అజిత్ సింగ్, బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా నిలబడ్డారు. అజిత్ సింగ్‌కు మద్దతుకు కాంగ్రెస్ పార్టీ ఎవరినీ పోటీకి పెట్టడం లేదు. -
మోదీ ఓ ఎద్దు.. స్మృతి బలిష్టమైన ఆవు
మథుర: రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని ఆయన ఎద్దు–దూడ–బలిష్టమైన ఆవుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని కోసీకలాన్‌లో రైతులతో చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘తప్పుడు వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే ఐదేళ్ల తర్వాత మార్చగలిగే హక్కు ప్రజలకు ఉండటం నిజంగా ప్రజాస్వామ్యం గొప్పతనమే. మీ ఆవులు, ఎద్దులు, దూడలు ఈ మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వార్తాపత్రికల్లో చూస్తున్నాను. వాటిని మీరు స్కూళ్లు, కాలేజీ భవనాల్లో కట్టేస్తున్నారు. ప్రజలేమో వాటిని మోదీ–యోగి అని పిలుస్తున్నారు. మరికొందరేమో బాగా బలిష్టమైన ఆవు ఒకటి వచ్చిందని చెబుతున్నారు. స్మృతీ ఇరానీ కూడా ఈ మధ్య బాగా తిరుగుతున్నారు’ అని అజిత్ సింగ్ వ్యాఖ్యానించారు. -
‘ఉద్యమ ఆకాంక్షలను వమ్ముచేసిన కేసీఆర్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోరా టాలకు ఎన్నోసార్లు అం డగా ఉన్నానని, రాష్ట్రం వస్తే ఎంతో సంతోషపడ్డానని కేంద్ర మాజీమం త్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా అజిత్‌సింగ్‌ను టీజేఎస్ అధ్యక్షుడు ఎం.కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ నేతలు కె.దిలీప్‌కుమార్, విద్యాధర్‌రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అజిత్‌సింగ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు బలిదానాలు చేశారని, సబ్బండ వర్గాలు ఉద్యమించాయన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నో సభల్లోనూ, పోరాటాల్లోనూ పాల్గొన్నట్టుగా గుర్తుచేశారు. తెలంగాణ బిల్లును ఆమోదించాలని కేంద్రమంత్రిగా ఒత్తిడి చేశానని, పార్లమెంటులోనూ మద్దతును ఇచ్చానని చెప్పారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో సుదీర్ఘకాలంపాటు పోరాడి సాధించుకున్నారని, రాష్ట్రం ఏర్పాటైతే ఎంతో సంతోషపడ్డానని అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నీరుగార్చారని విమర్శించారు. ప్రజల ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటుకావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో మహాకూటమిని అధికారంలో తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రాష్ట్రంలో పర్యటిస్తానని, సభల్లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు. -
పాలమూరు ఆగమైంది: ప్రొఫెసర్ కోదండరాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కేసీఆర్ పాలనలో పాలమూరు అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాలను విభజించి పాలమూరు ముఖచిత్రాన్ని మార్చేశారని, ఫలితంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కలెక్టర్ కార్యాలయాలు ఎక్కడో తెలియక పనులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో వ్యవసాయానికి నీళ్లొస్తాయని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీమైదానంలో తెలంగాణ జనసమితి(టీజేఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో కృష్ణానది జూరాల వద్ద ప్రవేశించి శ్రీశైలం వద్ద బయటకు వెళ్తుందని, జిల్లాకు నీళ్లు రావాలంటే జూరాల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయాల్సి ఉందన్నారు. కానీ శ్రీశైలం నుంచి లిఫ్టుల ద్వారా ఎత్తిపోస్తే దిగువకుపోయిన నీళ్లు పైకి ఎలా వస్తాయని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే తప్పుడు నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని విమర్శించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని కోదండరాం విమర్శించారు. గ్రామాల్లో 144 సెక్షణ్ విధించి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌కు ఎంపీగా అవకాశమిచ్చి ఉద్యమ నాయకుడిగా తయారుచేస్తే ఇక్కడి ప్రజలను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. హామీలను గాలికొదిలారు ప్రభుత్వం భర్తీచేస్తామన్న లక్షన్నర ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో యువత ఆగమైందన్నారు. రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవన్నారు. ఇన్నేళ్లు చదివినా ఉద్యోగం రాలేదని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ముఖం చూపించే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు జీఓ నం.68, 90 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, ఎస్టీలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందన్నారు. మన వాళ్లు పరాయి వాళ్లయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి ప్రజాసమస్యలను విన్నవించే పరిస్థితి లేదన్నారు. ప్రశ్నిస్తే నిర్బంధాలు, బెదింపులకు పాల్పడుతుందన్నారు. చివరికి నిరసన తెలిపేందుకు లేకుండా చేసి ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు సీఎంను కలిసేందుకు వెళ్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతం చెబుతున్నారని, రాష్ట్ర ప్రజలు పోతే గుర్తుపట్టే నాయకులు లేరన్నారు. అందుకే మనవాళ్లు ప్రభుత్వానికి పరాయివాళ్లు అయ్యారని విమర్శించారు. చెక్కుల పంపిణీలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పూర్తిన్యాయం జరగాలంటే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్నిపార్టీలతో కలిపి మహాకూటమిని ఏర్పాటు చేశామని వివరించారు. పాలమూరు అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో వ్యవసాయానికి నీళ్లొస్తాయని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత నైరాశ్యంతో ఉంది. ప్రజలకు పూర్తి న్యాయం జరగాలంటే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్నిపార్టీలతో కలిపి మహాకూటమి ఏర్పాటు చేశాం. – టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ప్రజల కష్టాలు చూసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాం. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు మరిచిపోయి ప్రజలను మోసం చేశారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం.. – ఆర్ఎల్డీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్ గెలుపు కోసం ఉమ్మడిగా కృషిచేద్దాం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాకూటమి నుంచి ఎవరికి టికెట్ వచ్చినా అభ్యర్థుల గెలుపు కోసం ఉమ్మడిగా కృషిచేస్తామని, తెలంగాణలో నియంతృత్వ పాలన అంతం చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, రైతుబిడ్డగా తనకు కష్టాలు తెలుసన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అంతకుముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఇటీవల కొండగ ట్టు బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మశాంతికి మౌనం పాటించా రు. టీజే ఎస్ రాష్ట్ర నాయకులు దిలీప్‌కుమార్, బబ్రూది న్, నాయకులు నర్సింహయ్య, బాల్కిషన్, సాజిదాసికింద్, దేవ రాజ్‌తో పాటు మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచి భారీసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ మాట తప్పారు అంతుకుముందు రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి అజిత్‌సింగ్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగా ణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు అనేక ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను చూసే పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. రెండో దశ తెలంగాణ ఉద్యమం పాలమూరు నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు న్యాయం జరగాలంటే కోదండరాం నేతృత్వంలో ప్రజలు నడవాలని, జనసమితి పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. -
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తానన్న థర్డ్ ఫ్రంట్ ఏమైందని రాష్ట్రీయ లోక్‌దళ్ పార్జీ (ఆర్ఎల్డీ) జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్ ప్రశ్నించారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఏర్పాటు చేస్తామని, 2 నెలల పాటు దేశం లోని పలు రాష్ట్రాలు తిరిగి నేతలను కలసి చివరకు దాని ఊసేలేకుండా పోయిందని ఎద్దేశా చేశారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించి తర్వాత ఫ్రంట్ ప్రస్తావనే లేకుండా పోయిందని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) నిర్వహించిన ‘పాలమూరు ప్రజాగర్జన’సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ కోసం 1,200 మంది యువత బలిదానం చేసుకున్నారని, ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్ష కోసమే పార్లమెంటులో బిల్లు సందర్భంగా మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ లాంటి ఉద్యమం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుకాలేదని, తెలంగాణ బిడ్డలు దోపిడీకి గురయ్యార న్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండో దశ పోరాటం కోదండరాం నేతృత్వంలో పాలమూరు నుంచే ప్రారంభం కావాలన్నారు. ‘పాలమూరును దగా చేశారు’ పాలమూరు ప్రాంతాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దగా చేశారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లాడని ఇక్కడి ప్రజలు కేసీఆర్‌కు పూర్తి మద్దతిచ్చి ఎంపీగా గెలిపించారని, తర్వాత సీఎంగా అవకాశం కల్పిస్తే వారిని దగా చేశారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌లో మార్పుల వల్ల రూ.5 వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నారు. ఇక్కడి ప్రజలకు నీళ్లు రాలేదని, ఉపాధి లేక ముంబైకి వలస వెళ్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం పాజెక్టు నిర్వాసితులకు ఏపీలో ఉద్యోగాలిచ్చారని, జీవో నం.68, 90 ప్రకారం ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిం చారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ప్రశ్నిస్తే నిర్బంధాలు కొనసాగిస్తున్నారని, ధర్నాచౌక్‌లు బంద్ చేశార న్నారు. ఈ ఎన్నికల్లో పాలమూరు ప్రజల పూర్తి మద్దతు టీజేఎస్‌కు ఇవ్వాలని సామాజిక తెలంగా ణ రూపకల్పనకు కృషిచేస్తామని హామీనిచ్చారు. మహబూబ్‌నగర్ టీజేఎస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్‌లు పాల్గొన్నారు. -
విమానాశ్రయాలకు ఇంకా భూమి ఇవ్వలేదు
ఏపీ ఎయిర్‌పోర్టుల విస్తరణపై కేంద్ర మంత్రి వివరణ న్యూఢిల్లీ: తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల నవీకరణ పనులు కొనసాగుతున్నాయని, అయితే ఇందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నవీకరించేందుకు అవసరమైన అధ్యయనాన్ని జరిపించాలని గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖను కోరారు. దీనిపై ప్రస్తుత స్థితిని తెలుపుతూ ఆ శాఖ మంత్రి అజిత్‌సింగ్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జె.డి.శీలంకు జవాబు పంపారు. ఇందులో ఆయా విమానాశ్రయాల స్థితిగతులను వివరించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో కొత్త రన్‌వే, పార్కింగ్ స్టాండ్, రెండు ఏరో బ్రిడ్జిలతో కూడిన కొత్త టర్మినల్ భవన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. వరద నియంత్రణకు సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. రద్దీవేళల్లో 700 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కూడిన టర్మినల్‌ను 1,400 మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టుగా విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఇక తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించామని, అయితే అన్ని వసతులు సమకూరిన తర్వాతే అది అమల్లో వస్తుందని వివరించారు. 701.96 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇప్పటివరకు కేవలం 293.05 ఎకరాలను మాత్రమే ఇచ్చిందని తెలిపారు. సమీకృత టర్మినల్ నిర్మాణం గత ఫిబ్రవరి నాటికి 36 శాతం పూర్తయిందని, వచ్చే ఏప్రిల్ నాటికి వంద శాతం పూర్తవుతుందని వివరించారు. ఇది రద్దీవేళలో 500 దేశీయ, 200 అంతర్జాతీయ ప్రయాణికులకు సరిపడా సామర్థ్యంతో ఉంటుందని వివరించారు. ఇక విజయవాడ విమానాశ్రయానికి సంబంధించి రద్దీవేళల్లో 700 మంది ప్రయాణికులకు సరిపడా సామర్థ్యంతో టర్మినల్ నిర్మాణానికి ప్రణాళిక ఉందని, ఇందుకు ఏఏఐకి చెందిన 536.19 ఎకరాల స్థలాన్ని వినియోగిస్తామని తెలిపారు. ఇందులో రన్‌వేను తొలివిడతలో 7,500 అడుగుల నుంచి 9 వేల అడుగలకు విస్తరించడానికి, రెండో విడతలో 9 వేల అడుగుల నుంచి 10,500 అడుగులకు విస్తరించడానికి ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. అయితే తొలివిడత రన్‌వే విస్తరణకు 361 ఎకరాలు, రెండో విడతకు 101 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉందని తెలిపారు. స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్ ఒకటో తేదీనే జీవో విడుదల చేసినప్పటికీ, ఇంతవరకు స్థలాన్ని అప్పగించలేదని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. -
25 నుంచి తెలంగాణలో అజిత్‌సింగ్ ప్రచారం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు అజిత్‌సింగ్ ఈ నెల 25 నుంచి తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో రోడ్‌షోలలో, బహిరంగ సభల్లో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శేషగిరిరావు బుధవారం తెలిపారు. 25న నల్లగొండ జిల్లా మునుగోడులో సాయంత్రం 3 గంటల నుంచి 4గంటల వరకు రోడ్‌షో, వరంగల్‌లో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. 26వ తేదీన ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఆలేరులో రోడ్‌షో, బహిరంగసభలో అజిత్‌సింగ్‌తో పాటు అమర్‌సింగ్, జయప్రదలు పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 5:30 వరకు హన్మకొండలో రోడ్ షో ఉంటుంది. 27న తుంగతుర్తి, నకిరేకల్‌లలో రోడ్‌షో ఉంటుంది. -
యూటర్న్ వార్తలు ఊహాగానాలే: కేసీఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మా పార్టీ మొదట్నుంచి మద్దతు తెలుపుతుందని రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్‌సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు కూడగట్టడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ నాయకులతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఆర్ ఎల్ డీ నేత అజిత్ సింగ్ తో సమావేశమయ్యారు. ఈ భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు జాతీయ స్థాయిలో కూడా మద్దతు ఉంటుంది అని అన్నారు. 'ఎన్నికల సమయంలో తెలంగాణపై ఎవరూ వెనక్కు వెళ్లరు. తెలంగాణపై ఎవరైనా వెనక్కి వెళితే వారికే నష్టం' అని అజిత్‌సింగ్ అన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ యూటర్న్ తీసుకుంటుందని వస్తున్న వార్తలన్ని ఊహాగానాలే అని అన్నారు. ఈ దశలో బీజేపీ వెనక్కు తగ్గుతుందని అనుకోను అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ బిల్లు కచ్చితంగా పాస్ అవుతుంది అని కేసీఆర్ విశ్వాసం ప్రకటించారు. -
ముందుకు కదలని నవీముంబై విమానాశ్రయ ప్రాజెక్ట్
సాక్షి, ముంబై: నవీముంబైలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ముందుకు కదిలేలాలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీలో సోమవారం జరగాల్సిన ఉన్నతస్థాయి సమావేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు రద్దు చేశాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు హాజరు కావల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా ఈ సమావేశం రద్దు కావడంవల్ల ఎటూ తేలలేదు. దీంతో ఎంతోకాలంగా పెండింగులో ఉండిపోయిన ప్రతిపాదిత విమానాశ్రయం పనులు మరింత జాప్యం జరిగే అవకాశం ఏర్పడింది. 15 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు నిర్మించాలనే అంశం తెరమీదకు వచ్చింది. 1998లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.నాలుగు వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడది తడిసి మోపెడైంది. దాదాపు వ్యయం నాలుగు రెట్లు పెరిగిపోయింది. అంటే రూ.15 వేల కోట్లకుపైగా చేరుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) 4,500 ఎకరాల స్థలం కావాలని సర్కార్‌ను డిమాండ్ చేసింది. అయితే స్థలం కోల్పోతున్న రైతులు నష్టపరిహారంగా అదనంగా 20 శాతం మంచి భూమి అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకారం రైతులకు స్థలం అందజేయాలంటే 290 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. అప్పుడే ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయి. కానీ ఇది సాధ్యం కాకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశం ఆకస్మాత్తుగా రద్దు కావడంతో మరింత జాప్యానికి దారి తీసింది. ఈ ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మంత్రి శరద్ పవార్ కూడా అభిప్రాయపడ్డారు. కానీ స్థలంపై రైతులు చేస్తున్న డిమాండ్ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచే విధంగా ఉందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అంటున్నారు. బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించే విషయమై ఈ నెల 20న రైతులతో చవాన్ చర్చలు జరిపారు. అయినా సఫలం కాలేదు. కాగా, ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పనున్నట్లు వార్తలు గుప్పుమనడంతో చుట్టుపక్క గ్రామస్తులు, రైతులు తమ స్థలాల రేట్లు ఒక్కసారిగా పెంచేశారు. దీంతో ఇప్పుడు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలంటే రైతులు చేస్తున్న డిమాండ్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈ ప్రాజెక్టు భవితవ్యం అంధకారంలో పడే ప్రమాదం ఉంది.