సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో 2013లో ముస్లింలు, జాట్ల మధ్య అల్లర్లు చెలరేగి 60 మంది మరణించడం, వేలాది మంది ముస్లింలు ఇల్లు వాకిలి వదిలి పెట్టి వలస పోవడం తెల్సిందే. ఇప్పుడు ముజాఫర్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ సంజీవ్ బలియాన్, ఆయనపై మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు, ఆర్‌ఎల్‌డీ నాయకుడు అజిత్ సింగ్ (80) పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు వారు సహజంగా అజిత్ సింగ్‌కు ఓటేయాలి. ఆయన కూడా జాట్ కులస్థుడు అవడం వల్ల ఆయనకు ఎలా ఓటేయాలని అక్కడి ముస్లింలు తర్జనభర్జన పడుతున్నారు. వారంతా నగర ప్రముఖుడు, మర్యాదస్తుడు ముఫ్తీ జుల్ఫికర్ అభిప్రాయాన్ని కోరుతున్నారు.
నాడు జాట్ కులస్థులే తమ మీద దాడులు జరిపారని, ఇల్లు తగులబెట్టారని మండిపోతున్న ముస్లింలకు ఈ సంశయం రావడం సబబేనని జుల్ఫికర్ తనను కలిసిన మీడియా ప్రతినిధితో అన్నారు. ‘పాము కాటుకు గురైన వ్యక్తుల చికిత్సకు విరుగుడుగా మళ్లీ విషాన్నే ఇస్తారు. నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ నేతల పాలనలో మేము నిర్లక్ష్యానికి గురవుతున్నాం. ముందు పెద్ద శత్రువును ఓడించాలి. వారిని ఓడించడానికి జాట్లతో జరిగిన గొడవను పూర్తిగా మరచిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ తన సలహాను అడిగిన ప్రతి ముస్లింకు తాను ఇదే విశయం చెబుతున్నానని ఆయన చెప్పారు.
ఎన్నో దశాబ్దాలుగా ముస్లింలు, జాట్లు కలిసిమెలసి ఉంటున్న ముజాఫర్‌నగర్‌లో 2014లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలోనే 2013లో అల్లర్లు చెలరేగాయి. అనేక మంది ముస్లింలు చనిపోవడంతోపాటు పదుల సంఖ్యలో మహిళలు గ్యాంగ్ రేప్‌లకు గురయ్యారు. ఇప్పటికీ ఆ కేసుల్లో ఎవరికి శిక్ష పడలేదు. నాటి అల్లర్లలో నిందితుడైన సంజీవ్ బల్యాన్ ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మళ్లీ ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. ఆయనపై అజిత్ సింగ్, బీఎస్పీ, ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమి అభ్యర్థిగా నిలబడ్డారు. అజిత్ సింగ్‌కు మద్దతుకు కాంగ్రెస్ పార్టీ ఎవరినీ పోటీకి పెట్టడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment