సాక్షి, సెంట్రల్‌డెస్క్ : బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పన్నెండు లోక్‌సభ స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు హోరాహోరీ తలపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. హిందీ ప్రాంతంలోని ఈ కీలక నియోజకవర్గాల్లో ఈ బడా నేతలు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులున్నాయంటే..
యూపీ: సూపర్ సిక్స్
అమేథీ: రాహుల్‌తో స్మృతి ఢీ
కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిని నిలపడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. కిందటి ఎన్నికల్లో ఆమె రాహుల్ చేతిలో ఓడిపోయినా ఈ నియోజకవర్గంలో స్మృతి క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. అనేక సమస్యలపై పోరాడుతూ, నెహ్రూ–గాంధీ వారసుడిపై ఆమె విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. మోదీ ప్రభంజనంలో సైతం బీజేపీకి చిక్కని అమేథీ.. ఈసారైనా ఆ పార్టీ వశమవుతుందా అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఈ స్థానానికి మే 6న పోలింగ్ జరగనుంది.
ముజఫర్‌నగర్: సీటు మారిన అజిత్
రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) నేత అజిత్‌సింగ్ ఈసారి ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడు, జాట్ నేత అయిన ఈయన ఈ ఎన్నికల్లో నియోజకవర్గం మారారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు సంజీవ్ బలియాన్ కూడా జాట్ కులస్తుడే కావడంతో స్థానికంగా ఉన్న పట్టుతో మరోసారి గెలవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న అజిత్‌కు జాట్లు, ముస్లింలు, దళితులు కలిసి ఇచ్చే మద్దతును బట్టి ఆయన గెలుపు ఆధారపడి ఉంది. వచ్చే నెల 11న ముజఫర్‌నగర్ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
బాగ్‌పత్: వారసుడొచ్చాడు
అజిత్‌సింగ్ కుమారుడు, మథుర మాజీ ఎంపీ జయంత్ చౌధరీ తన కుటుంబానికి కంచుకోట అయిన బాగ్‌పత్ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ స్థానంలో ఆయన తండ్రి అజిత్‌ను బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్ ఓడించారు. తన గెలుపు ద్వారా కుటుంబ గౌరవం మళ్లీ సంపాదించడానికి జయంత్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమి మద్దతు వల్ల జాట్లతోపాటు ముస్లింలు, దళితుల ఓట్లు కూడా పడితే జయంత్ గట్టెక్కుతారు. మారిన పరిస్థితుల్లో సత్యపాల్ విజయం అంత తేలిక కాదు. ఏప్రిల్ 11న ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది.
ఆమ్రోహా: ముగ్గురిలో ఎవరు?
ఆమ్రోహా ప్రస్తుత ఎంపీ కన్వర్‌సింగ్ తన్వర్ (బీజేపీ).. ఈసారి బీఎస్పీ అభ్యర్థి దనిష్ అలీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో జేడీఎస్ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నికైన దనిష్ 20 శాతానికి పైగా ఉన్న ముస్లింలు, ఇతర సైనీలు, జాట్లు, దళితుల మద్దతుపై ఆశ పెట్టుకున్నారు. బీఎస్పీ మాజీ ఎంపీ రషీద్ అల్వీని కాంగ్రెస్ పోటీకి దింపడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ముస్లింల ఓట్లు ప్రత్యర్థుల మధ్య చీలిపోతే బీజేపీ అభ్యర్థి గెలిచే వీలుంది. (పోలింగ్: ఏప్రిల్ 18).
ఫిరోజాబాద్: దాయాదుల పోరు
ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ కుటుంబసభ్యులిద్దరి మధ్య పోరుకు ఫిరోజాబాద్ స్థానం వేదికైంది. ములాయం తమ్ముడు శివపాల్ కొత్తగా ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) స్థాపించి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు వరుసకు అన్న అయిన ఎస్పీ ఎంపీ రాంగోపాల్‌యాదవ్ కొడుకు, సిట్టింగ్ ఎంపీ అక్షయ్‌యాదవ్ (ఎస్పీ) తో ఇక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతోంది. పాత తరం ఓటర్లు, ఎస్పీ కార్యకర్తలతో ఉన్న పరిచయాలు, పలుకుబడి ఉన్నప్పటికీ శివపాల్ గెలవకున్నా.. అక్షయ్‌కు గట్టి పోటీ ఇవ్వగలరు. వచ్చే నెల 23న విజేతలెవరో తేలనుంది.
బదాయూన్: ధర్మేంద్ర వర్సెస్ సంఘమిత్ర
ఎస్పీ కంచుకోటల్లో ఒకటైన బదాయూన్‌ను గత ఆరుసార్లుగా ఈ పార్టీ గెలుచుకుంటూనే ఉంది. 15 శాతం ముస్లింలు, 15 శాతం యాదవులున్న ఈ స్థానం ఎస్పీకి అత్యంత అనుకూలమైనది. ములాయం అన్న కొడుకైన ధర్మేంద్ర ప్రస్తుత బదాయూన్ ఎంపీ. ఆయనపై యూపీ మంత్రి స్వామి ప్రసాద్‌మౌర్యా కూతురు సం ఘమిత్ర బీజేపీ అభ్యర్థిగా దిగడంతో యాదవేతర బీసీల ఓట్లు ధర్మేంద్రకు పడకపోవ చ్చు. మాజీ ఎస్పీ నేత, ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలిచిన సలీం షేర్వానీ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తున్నారు. (పోలింగ్: ఏప్రిల్ 23).
బిహార్: ‘ఫోర్’కాస్ట్
బెగూసరాయ్: తరాల అంతరాలు
బిహార్‌లో హోరాహోరీ పోటీ జరుగుతున్న స్థానాల్లో ఒకటి బెగూసరాయ్. ఇక్కడ కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ (బీజేపీ)తో విద్యార్థి నేత కన్హయ్యకుమార్ (సీపీఐ) పోటీ పడుతున్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో సీపీఐ భాగస్వామి కాకపోవడంతో సీపీఐ గెలుపు అంత తేలిక కాదు. ఒకప్పటి కమ్యూనిస్ట్ కంచుకోట అయిన ఈ స్థానాన్ని భారత లెనిన్‌గ్రాడ్‌గా పిలుస్తారు. సింగ్, కుమార్ ఇద్దరూ భూమిహార్ వర్గానికి చెందినవారే. ఈ అగ్రకులం ఓట్లలో చీలిక వస్తే మధ్యలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్‌కు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. ఏప్రిల్ 29న ఈ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.
జముయీ: బరిలో పాశ్వాన్ కుమారుడు
కేంద్రమంత్రి, ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్‌తో స్థానిక పార్టీ ఆర్‌ఎల్‌ఎస్పీ అభ్యర్థి భూదేవ్ చౌధరీ తలపడుతున్నారు. చౌధరీ 2009లో జేడీయూ టికెట్‌పై ఎన్నికయ్యారు. ఆయన ఈసారి విజయానికి దళితులు, బీసీ ఓట్లపై ఆధారపడుతున్నారు. అగ్రవర్ణాలు, దళితుల మద్దతుతో గెలవాలని చిరాగ్ ఆ«శిస్తున్నారు. వచ్చే నెల 11న ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
గయ: జీతన్‌కు పరీక్ష
బీజేపీ కిందటిసారి గెలిచిన గయ స్థానాన్ని ఈసారి పొత్తులో భాగంగా జేడీయూకు కేటాయించింది. హెచ్‌ఏఎం పార్టీ నేత, మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ ఈ ఎన్నికల్లో జేడీయూ నేత విజయ్ మాంఝీని ఎదుర్కొంటున్నారు. ఇదే సీటులో 2014లో జీతన్‌రాం జేడీయూ టికెట్‌పై పోటీచేసి మూడో స్థానంలో నిలిచారు. అయితే, ఆర్జేడీ కూటమిలో భాగస్వామి కావడంతో ప్రస్తుతం ఆయన బలమైన అభ్యర్థి. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జేడీయూ అభ్యర్థి విజయ్ మాంఝీ 1996లో ఇక్కడి నుంచి ఎన్నికైన భగవతీ దేవి కుమారుడు. ఏప్రిల్ 11న ఎన్నిక జరగనుంది.
పూర్ణియా: పప్పూతో పోటీ అంత ఈజీ కాదు
కిందటి ఎన్నికల్లో బలమైన మోదీ గాలిని తట్టుకుని జేడీయూ గెలిచిన రెండు సీట్లలో ఒకటి పూర్ణియా. అప్పుడు బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ఉదయ్‌సింగ్ అలియాస్ పప్పూసింగ్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మహాగఠ్‌బంధన్ తరఫున రంగంలోకి దిగారు. ఈ స్థానంలో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ ఓట్లు, 30 శాతం ముస్లిం ఓట్లున్న కారణంగా జేడీయూ సిటింగ్ సభ్యుడు సంతోష్‌కుమార్ సింగ్ కుష్వాహా ఎదురీదుతున్నారు. కిందటిసారి కుష్వాహాకు పెద్దసంఖ్యలో పడిన ముస్లిం ఓట్లు ఈసారి కాంగ్రెస్‌కు పడే అవకాశముంది. (పోలింగ్: ఏప్రిల్ 18).
ఉత్తరాఖండ్: ఆ రెండూ..
గఢ్‌వాల్: ఇద్దరి గురి బీసీ ఖండూరీపైనే..
ఉత్తరాఖండ్‌లోని ఈ స్థానంలో బీజేపీ మాజీ మంత్రి, ఎంపీ బీసీ ఖండూరీ కొడుకు మనీష్ ఖండూరీ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తుండగా, ఖండూరీ శిష్యుడు తీరథ్‌సింగ్ రావత్‌ను బీజేపీ తన అభ్యర్థిగా నిలిపింది. బీజేపీ టికెట్‌పై ఐదుసార్లు గఢ్‌వాల్ నుంచి బీసీ ఖండూరీ గెలిచారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయనకు ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. ఆయన కొడుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండటంతో రెండు పార్టీల మధ్య పోటీ కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు అభ్యర్థులూ తమకు బీసీ ఖండూరీ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. ఏప్రిల్ 11న భవితవ్యం తేలనుంది.
నైనిటాల్–ఉధంసింగ్ నగర్: ‘రావత్’ రాజ్?
ఇక్కడ బీజేపీ తరఫున పోటీచేస్తున్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అజయ్ భట్‌కు కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ స్థానంలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2017 ఎన్నికల్లో బీజేపీ 12 గెలుచుకున్నా రాజపుత్ర ఓటర్లలో రావత్‌కు ఉన్న పలుకుబడి కారణంగా భట్ ఎదురీదుతున్నారు. ఇదే వర్గానికి చెందిన బీజేపీ మాజీ సీఎం బీఎస్ కోషియారీకి టికెట్ ఇవ్వకపోవడంతో రాజపుత్రుల ఓట్లు, బ్రాహ్మణ వర్గానికి చెందిన భట్‌కు పడకపోవచ్చని అంచనా. వచ్చే నెల 11న ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment