Rahulgandi
-
'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి. టిక్కెట్స్ ఆరు నెలల ముందే ప్రకటిస్తామని చెప్పినా.. ఎప్పటిలాగే నామినేషన్ల చివరి రోజు వరకు ప్రహసనం సాగింది. కొన్ని చోట్ల సీనియర్లకే పార్టీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. 20 మందికి పైగా అప్పటికప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి టిక్కెట్లు తీసేసుకున్నారు. ఇలా ఉంటది కాంగ్రెస్‌తోని.. సీట్ల గందరగోళం ఎలా ఉందో ఓసారి చూద్దాం.' ఆశావహుల్లో టెన్షన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా మందే అభ్యర్థులను ఖరారు చేసేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎప్పుడూ చేసే విధంగానే చివరి నిమిషం వరకు ఆశావహుల్లో టెన్షన్ పెంచింది. నల్గొండ జిల్లా మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల్లో మైనంపల్లి హనుమంతరావు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి వంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అతి విచిత్రంగా జరిగింది. వీరంతా అప్పటికప్పుడు పార్టీలో చేరి అభ్యర్థులైపోయారు. ఇలాంటి నాయకులు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారే. పార్టీ అధికారంలో లేనపుడు బయటకు వెళ్ళిపోయి.. ఇప్పుడు అధికారం వస్తుందన్న ఆశతో మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన నేతలు ఇటువంటి వారిని చూసి హతావులవుతున్నారు. మొత్తానికి నాలుగు విడతలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జాబితాల ప్రకటించడానికి ముందు పదుల సంఖ్యలో ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగాయి. ఆశావాహుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్దం అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్‌లో మూడు సార్లు కూర్చోని ఆశావహుల జాబితాను ఫిల్టర్ చేసింది. ఇక ఆ తర్వాత కథ అంతా ఢిల్లీలోనే నడిచింది. టిక్కెట్లు ఆశించిన నేతలు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. టిక్కెట్ దక్కినవారు సంబరాలు చేసుకుంటూ తిరిగివచ్చారు. ఆశాభంగం పొందినవారు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ చేరాక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. కొత్తగా వారికే ఎక్కువగా అవకాశం.. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చాలా మంది సీనియర్లకు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. ఇక రెండో జాబితా ప్రకటించాక మాత్రం టిక్కెట్ రాని నేతలు నానా యాగీ చేసారు. చాలా మంది నేతలు గాంధీ భవన్ ముందే తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చివరికి గాంధీ భవన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీలో టాక్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల పేర్లను సునీల్ సిఫార్సు చేసారట. దీంతో చాలా సెగ్మెంట్లలో నేతల మధ్య గొడవలకు దారితీసాయని చెబుతున్నారు. దీంతో పాటు అసలు దరఖాస్తు చేయని నేతలకు టిక్కెట్ ఇవ్వడం పట్ల పార్టీ నేతల్లో వ్యతిరేకత వచ్చింది. చాలా మంది కొత్తగా వచ్చిన వారికి వెంటనే టిక్కెట్లు ఇవ్వడం పార్టీలో అశాంతికి కారణం అయింది. పార్టీలో టిక్కెట్లు అమ్ముకున్నారనే తీవ్ర ఆరోపణలు, దానిపై చర్చకు అప్పటికప్పుడు వచ్చినవారికి సీట్లు ఇవ్వడమే కారణం కావచ్చు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ..! ఇక అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చడంతో పెద్ద దుమారమే రేపింది. వనపర్తి, బోధ్, పటాన్చెరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చారు. ఇలా మార్చడానికి సునీల్ కనుగోలు ఒక కారణం అయితే.. నేతల ఒత్తిడి మరో కారణం అంటున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో మూడు స్థానాల అభ్యర్థులను చివరి రోజు వరకు సాగదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. సూర్యాపేట విషయంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించడంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌ను కాదని మందుల సామ్యూల్కి టిక్కెట్ దక్కేలా చేయడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తన మనుషులకు ఇప్పించుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. నల్లగొండలో మాత్రం ఫెయిలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, ఓబీసీ, ఎస్టి సెల్‌లకు టిక్కెట్లు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 119 సీట్లలో కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించగా మిగిలిన 118 సీట్ల లో 22 స్థానాలు బీసీలకు, 31 స్థానలు ఎస్సీ, ఎస్టిలకు, 65 స్థానాలు ఓసిలకు ఇచ్చారు. బీసీలకు 30 కి పైగా ఇవ్వాలని కాంగ్రెస్ మొదట భావించినప్పటికీ టిక్కెట్ల కేటాయింపులో అది సాధ్యం కాలేదు. -
Rahul Gandhi: ప్రజలు అడిగే ప్రశ్నలను కాదు..కరోనాను ఆపండి
న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఉంటే దేశం ప్రస్తుతం ఇలాంటి బాధాకరమైన పరిస్థితులను చవి చూడాల్సి వచ్చేది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. చిన్నారుల కోసం కరోనా వైరస్ వ్యాక్సిన్– ట్రీట్మెంట్ ప్రోటోకాల్‌ను అమల్లోకి తేవాలన్నారు. ‘ప్రధాని మోదీని ప్రశ్నించినందుకు ఎంత సులువుగా అరెస్టులు చేశారో, అంతే తేలిగ్గా అందరికీ అందుబాటులోకి టీకా తీసుకు వచ్చినట్లయితే దేశంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు దాపురించేవి కాదు. ప్రజలు అడిగే ప్రశ్నలను కాదు, కరోనాను ఆపండి’అని రాహుల్ మంగళవారం ట్విట్టర్లో ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘రానున్న రోజుల్లో, చిన్నారులకు కరోనా నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పీడియాట్రిక్ సేవలు, వ్యాక్సిన్– ట్రీట్మెంట్ ప్రోటోకాల్‌ను ముందుగానే సిద్ధం చేయాలి’అని కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. దేశ భవిష్యత్తుకు ప్రస్తుత మోదీ వ్యవస్థను నిద్ర నుంచి మేల్కొలపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. (చదవండి: నా భర్తకు ఇంజెక్షన్లు ఇవ్వండి.. లేకపోతే చస్తా!) -
వనపర్తిలో రాహుల్ ఎన్నికల సభ
సాక్షి, వనపర్తి: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ నేడు తొలిసారిగా వనపర్తికి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగవరానికి చేరుకుంటారు.నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్ సెగ్మెంట్లనుంచి ఈ ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులను తరలించేందుకు మాజీ మంత్రి డాక్టర్ జి. చిన్నారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 16 గ్యాలరీలు ఏర్పాటు చేయగా వీఐపీ, ప్రెస్ గ్యాలరీ మినహాయిస్తే మిగతా 14 గ్యాలరీల్లో సాధారణ కార్యకర్తలు, నాయకులకు కెటాయించారు. రాహుల్ గాంధీ వెంట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, రాష్ట్రస్థాయి నాయకులు సభకు హాజరు కానున్నారు. ఎస్పీజీ పర్యవేక్షణలో నిఘా రాహుల్‌గాంధీ ప్రచారసభ భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజులుగా స్పెషల్‌పార్టీ దళాలు వనపర్తిలో మకాం వేశాయి. సభావేదిక, ఇతర ప్రాంతాలు, హెలీ ప్యాడ్ వద్ద డాగ్స్క్వాడ్లతో తనిఖీలు చేయించారు. అలా గే కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లక్ష మందికి ఏర్పాట్లు : చిన్నారెడ్డి రాహుల్ గాంధీ సభకు నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి లక్ష మందిని జన సమీకరణ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని మాజి మంత్రి డాక్టర్ జి. చిన్నారెడ్డి తెలిపారు. అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ బాద్యులతో పాటు మండలాల, పట్టణ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలను తరలిస్తున్నాము. హెలీప్యాడ్ సిద్ధం రాహుల్ గాంధి ఆకాశ మార్గాన హెలిక్యాప్టర్‌లో సోమవారం మధ్యహ్నాం రెండు గంటలకు వనపర్తికి చేరుకుంటారు. ఇక్కడ హెలిక్యాప్టర్ ల్యాండ్ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఆదివారం హెలిక్యాప్టర్ ట్రాయల్ రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఉత్తరాది.. ఏ గాలి వీచేది?
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పన్నెండు లోక్‌సభ స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు హోరాహోరీ తలపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. హిందీ ప్రాంతంలోని ఈ కీలక నియోజకవర్గాల్లో ఈ బడా నేతలు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులున్నాయంటే.. యూపీ: సూపర్ సిక్స్ అమేథీ: రాహుల్‌తో స్మృతి ఢీ కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిని నిలపడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. కిందటి ఎన్నికల్లో ఆమె రాహుల్ చేతిలో ఓడిపోయినా ఈ నియోజకవర్గంలో స్మృతి క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. అనేక సమస్యలపై పోరాడుతూ, నెహ్రూ–గాంధీ వారసుడిపై ఆమె విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. మోదీ ప్రభంజనంలో సైతం బీజేపీకి చిక్కని అమేథీ.. ఈసారైనా ఆ పార్టీ వశమవుతుందా అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఈ స్థానానికి మే 6న పోలింగ్ జరగనుంది. ముజఫర్‌నగర్: సీటు మారిన అజిత్ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) నేత అజిత్‌సింగ్ ఈసారి ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడు, జాట్ నేత అయిన ఈయన ఈ ఎన్నికల్లో నియోజకవర్గం మారారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు సంజీవ్ బలియాన్ కూడా జాట్ కులస్తుడే కావడంతో స్థానికంగా ఉన్న పట్టుతో మరోసారి గెలవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న అజిత్‌కు జాట్లు, ముస్లింలు, దళితులు కలిసి ఇచ్చే మద్దతును బట్టి ఆయన గెలుపు ఆధారపడి ఉంది. వచ్చే నెల 11న ముజఫర్‌నగర్ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. బాగ్పత్: వారసుడొచ్చాడు అజిత్‌సింగ్ కుమారుడు, మథుర మాజీ ఎంపీ జయంత్ చౌధరీ తన కుటుంబానికి కంచుకోట అయిన బాగ్పత్ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ స్థానంలో ఆయన తండ్రి అజిత్‌ను బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్ ఓడించారు. తన గెలుపు ద్వారా కుటుంబ గౌరవం మళ్లీ సంపాదించడానికి జయంత్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమి మద్దతు వల్ల జాట్లతోపాటు ముస్లింలు, దళితుల ఓట్లు కూడా పడితే జయంత్ గట్టెక్కుతారు. మారిన పరిస్థితుల్లో సత్యపాల్ విజయం అంత తేలిక కాదు. ఏప్రిల్ 11న ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆమ్రోహా: ముగ్గురిలో ఎవరు? ఆమ్రోహా ప్రస్తుత ఎంపీ కన్వర్‌సింగ్ తన్వర్ (బీజేపీ).. ఈసారి బీఎస్పీ అభ్యర్థి దనిష్ అలీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో జేడీఎస్ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నికైన దనిష్ 20 శాతానికి పైగా ఉన్న ముస్లింలు, ఇతర సైనీలు, జాట్లు, దళితుల మద్దతుపై ఆశ పెట్టుకున్నారు. బీఎస్పీ మాజీ ఎంపీ రషీద్ అల్వీని కాంగ్రెస్ పోటీకి దింపడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ముస్లింల ఓట్లు ప్రత్యర్థుల మధ్య చీలిపోతే బీజేపీ అభ్యర్థి గెలిచే వీలుంది. (పోలింగ్: ఏప్రిల్ 18). ఫిరోజాబాద్: దాయాదుల పోరు ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ కుటుంబసభ్యులిద్దరి మధ్య పోరుకు ఫిరోజాబాద్ స్థానం వేదికైంది. ములాయం తమ్ముడు శివపాల్ కొత్తగా ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) స్థాపించి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు వరుసకు అన్న అయిన ఎస్పీ ఎంపీ రాంగోపాల్‌యాదవ్ కొడుకు, సిట్టింగ్ ఎంపీ అక్షయ్‌యాదవ్ (ఎస్పీ) తో ఇక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతోంది. పాత తరం ఓటర్లు, ఎస్పీ కార్యకర్తలతో ఉన్న పరిచయాలు, పలుకుబడి ఉన్నప్పటికీ శివపాల్ గెలవకున్నా.. అక్షయ్‌కు గట్టి పోటీ ఇవ్వగలరు. వచ్చే నెల 23న విజేతలెవరో తేలనుంది. బదాయూన్: ధర్మేంద్ర వర్సెస్ సంఘమిత్ర ఎస్పీ కంచుకోటల్లో ఒకటైన బదాయూన్ను గత ఆరుసార్లుగా ఈ పార్టీ గెలుచుకుంటూనే ఉంది. 15 శాతం ముస్లింలు, 15 శాతం యాదవులున్న ఈ స్థానం ఎస్పీకి అత్యంత అనుకూలమైనది. ములాయం అన్న కొడుకైన ధర్మేంద్ర ప్రస్తుత బదాయూన్ ఎంపీ. ఆయనపై యూపీ మంత్రి స్వామి ప్రసాద్మౌర్యా కూతురు సం ఘమిత్ర బీజేపీ అభ్యర్థిగా దిగడంతో యాదవేతర బీసీల ఓట్లు ధర్మేంద్రకు పడకపోవ చ్చు. మాజీ ఎస్పీ నేత, ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలిచిన సలీం షేర్వానీ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తున్నారు. (పోలింగ్: ఏప్రిల్ 23). బిహార్: ‘ఫోర్’కాస్ట్ బెగూసరాయ్: తరాల అంతరాలు బిహార్‌లో హోరాహోరీ పోటీ జరుగుతున్న స్థానాల్లో ఒకటి బెగూసరాయ్. ఇక్కడ కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ (బీజేపీ)తో విద్యార్థి నేత కన్హయ్యకుమార్ (సీపీఐ) పోటీ పడుతున్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో సీపీఐ భాగస్వామి కాకపోవడంతో సీపీఐ గెలుపు అంత తేలిక కాదు. ఒకప్పటి కమ్యూనిస్ట్ కంచుకోట అయిన ఈ స్థానాన్ని భారత లెనిన్‌గ్రాడ్‌గా పిలుస్తారు. సింగ్, కుమార్ ఇద్దరూ భూమిహార్ వర్గానికి చెందినవారే. ఈ అగ్రకులం ఓట్లలో చీలిక వస్తే మధ్యలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్‌కు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. ఏప్రిల్ 29న ఈ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. జముయీ: బరిలో పాశ్వాన్ కుమారుడు కేంద్రమంత్రి, ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్‌తో స్థానిక పార్టీ ఆర్ఎల్ఎస్పీ అభ్యర్థి భూదేవ్ చౌధరీ తలపడుతున్నారు. చౌధరీ 2009లో జేడీయూ టికెట్‌పై ఎన్నికయ్యారు. ఆయన ఈసారి విజయానికి దళితులు, బీసీ ఓట్లపై ఆధారపడుతున్నారు. అగ్రవర్ణాలు, దళితుల మద్దతుతో గెలవాలని చిరాగ్ ఆ«శిస్తున్నారు. వచ్చే నెల 11న ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. గయ: జీతన్‌కు పరీక్ష బీజేపీ కిందటిసారి గెలిచిన గయ స్థానాన్ని ఈసారి పొత్తులో భాగంగా జేడీయూకు కేటాయించింది. హెచ్ఏఎం పార్టీ నేత, మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ ఈ ఎన్నికల్లో జేడీయూ నేత విజయ్ మాంఝీని ఎదుర్కొంటున్నారు. ఇదే సీటులో 2014లో జీతన్‌రాం జేడీయూ టికెట్‌పై పోటీచేసి మూడో స్థానంలో నిలిచారు. అయితే, ఆర్జేడీ కూటమిలో భాగస్వామి కావడంతో ప్రస్తుతం ఆయన బలమైన అభ్యర్థి. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జేడీయూ అభ్యర్థి విజయ్ మాంఝీ 1996లో ఇక్కడి నుంచి ఎన్నికైన భగవతీ దేవి కుమారుడు. ఏప్రిల్ 11న ఎన్నిక జరగనుంది. పూర్ణియా: పప్పూతో పోటీ అంత ఈజీ కాదు కిందటి ఎన్నికల్లో బలమైన మోదీ గాలిని తట్టుకుని జేడీయూ గెలిచిన రెండు సీట్లలో ఒకటి పూర్ణియా. అప్పుడు బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ఉదయ్‌సింగ్ అలియాస్ పప్పూసింగ్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మహాగఠ్‌బంధన్ తరఫున రంగంలోకి దిగారు. ఈ స్థానంలో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ ఓట్లు, 30 శాతం ముస్లిం ఓట్లున్న కారణంగా జేడీయూ సిటింగ్ సభ్యుడు సంతోష్‌కుమార్ సింగ్ కుష్వాహా ఎదురీదుతున్నారు. కిందటిసారి కుష్వాహాకు పెద్దసంఖ్యలో పడిన ముస్లిం ఓట్లు ఈసారి కాంగ్రెస్‌కు పడే అవకాశముంది. (పోలింగ్: ఏప్రిల్ 18). ఉత్తరాఖండ్: ఆ రెండూ.. గఢ్వాల్: ఇద్దరి గురి బీసీ ఖండూరీపైనే.. ఉత్తరాఖండ్‌లోని ఈ స్థానంలో బీజేపీ మాజీ మంత్రి, ఎంపీ బీసీ ఖండూరీ కొడుకు మనీష్ ఖండూరీ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తుండగా, ఖండూరీ శిష్యుడు తీరథ్సింగ్ రావత్‌ను బీజేపీ తన అభ్యర్థిగా నిలిపింది. బీజేపీ టికెట్‌పై ఐదుసార్లు గఢ్వాల్ నుంచి బీసీ ఖండూరీ గెలిచారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయనకు ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. ఆయన కొడుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండటంతో రెండు పార్టీల మధ్య పోటీ కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు అభ్యర్థులూ తమకు బీసీ ఖండూరీ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. ఏప్రిల్ 11న భవితవ్యం తేలనుంది. నైనిటాల్–ఉధంసింగ్ నగర్: ‘రావత్’ రాజ్? ఇక్కడ బీజేపీ తరఫున పోటీచేస్తున్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అజయ్ భట్‌కు కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ స్థానంలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2017 ఎన్నికల్లో బీజేపీ 12 గెలుచుకున్నా రాజపుత్ర ఓటర్లలో రావత్‌కు ఉన్న పలుకుబడి కారణంగా భట్ ఎదురీదుతున్నారు. ఇదే వర్గానికి చెందిన బీజేపీ మాజీ సీఎం బీఎస్ కోషియారీకి టికెట్ ఇవ్వకపోవడంతో రాజపుత్రుల ఓట్లు, బ్రాహ్మణ వర్గానికి చెందిన భట్‌కు పడకపోవచ్చని అంచనా. వచ్చే నెల 11న ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
ఆ దొంగల పేరు చివర మోదీ
డెహ్రాడూన్: ప్రధాని మోదీ దేశంలోని మిగతా మోదీలకు కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రచార కార్యక్రమాన్ని శనివారం ఉత్తరాఖండ్‌లో రాహుల్ ప్రారంభించారు. ఈ దొంగలందరికీ పేరు చివర మోదీ అనిఉండటం ఒక ఎత్తు అయితే అందులో నుంచి ఒక మోదీ మిగతా మోదీలకు ఎందుకు దోచిపెడుతున్నారని ప్రశ్నించారు. తన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో నిందితుడు నీరవ్ మోదీ, ఐపీఎల్ స్కామ్ నిందితుడు లలిత్ మోదీలు ఉన్నారన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకుని వారు తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. కాపలాదారే దొంగ అయ్యాడని (చౌకీదార్ చోర్ హై) రాహుల్ విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 15–20 మందికి మాత్రమే కోట్ల రూపాయలు ఇచ్చారని, రైతులు, నిరుద్యోగుల సంక్షేమానికి ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో అదానీ గ్రూప్ వ్యాపార సంస్థలకు భూమిని దోచిపెట్టారని విమర్శించారు. పేదలకు ఆర్థిక భరోసా.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదలకు ఆర్థిక భద్రత కల్పనలో భాగంగా కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెడతామని రాహుల్ గాంధీ హామీనిచ్చారు. ఇందులోభాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన మొదటి దేశంగా భారత్ నిలుస్తుందన్నారు. అప్పుడు కెమెరాలకు పోజ్‌లిస్తున్నారు... జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కెమెరాలకు పోజ్‌లిస్తున్నారని విమర్శించారు. పుల్వామా దాడి జరిగిన వెంటనే తాను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నానని, కానీ మోదీ మాత్రం మూడున్నర గంటలపాటు నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ షూటింగ్లో ఫొటోలకు పోజులిచ్చారని పేర్కొన్నారు. -
కేసీఆర్ అప్పులు పెంచారు
సాక్షి, వికారాబాద్: రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాండూరులో సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాటాడారు. తెలంగాణ ప్రజల కలలను టీఆర్ఎస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని వదిలేసిన కేసీఆర్ రీ డిజైన్లకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఈ ప్రాంతానికి సాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఖర్చు మొదట్లో రూ.10 వేల కోట్లు ఉంటే.. రీడిజైన్ చేసి.. రూ.60 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తా మని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులు రూ.17 వేల కోట్లు ఉండగా, ప్రస్తుతం ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షల అప్పు ఉందని తెలిపారు. కానీ కేటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బంగారుమయమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ రూ.300 కోట్ల బంగళాలో విశ్రాంతి తీసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. చార్మినార్‌లో కలుపుతాం... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తాండూరు ప్రాంత ప్రజల, నిరుద్యోగుల ఆకాంక్షలను విరుద్ధంగా జిల్లాను జోగులాంబ జోన్లో కలిపి అన్యాయం చేశారన్నారు. ఈ ప్రాంతం కంది సాగుకు ప్రసిద్ధి పొందిందని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్న కంది బోర్డు ఏర్పాటు కలను తీరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ టౌన్ మంజూరుచేయగా, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శాటిలైట్ టౌన్‌కు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. తాండూరుకు బైపాస్ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయిందని విమర్శించారు. స్టోన్ పరిశ్రమ కారణంగా వెలువడుతున్న కాలుష్య నియత్రంణకు చర్చలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తాండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రులను కూడా అప్‌గ్రేడ్ చేసి, ఈఎస్ఐ దవాఖానా సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాత తాండూరులో ఫ్లైఓవర్ లేదా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పారు. నాపరాతి పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి వ్యాపారాన్ని దివాలాతీసే విధంగా మోదీ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. జిల్లాలోని కోట్‌పల్లి, శివసాగర్, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని వివరించా దొరల పాలన అంతం కావాలి రాష్ట్రంలో దొరల పాలన అంతం కావాలంటే ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. మన భూములు, నీళ్లు, నిధులు మనకు దక్కాలన్నారు. చండీయాగాలు చేస్తే ప్రజలు అభివృద్ధి చెందరని, ప్రజారంజకమైన పాలన సాగించాలని తెలిపారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... పాటనై వస్తున్నానమ్మో అంటూ గద్దర్ తాను రాసిన పాటలను ఆలపించి సభికులను ఉత్తేజపరిచారు. ఆయన పాట పాడుతున్న సమయంలో రాహుల్‌గాంధీ ఆసక్తిగా గమనించడం విశేషం. కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి కమీషన్లు.. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో పైసలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి, కమీషన్లు మాత్రం కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి వెళ్తున్నాయని టీజేఎస్ అధినేత, ఫ్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఏ ఒక్కడివల్లనో తెలంగాణ రాష్ట్రం రాలేదని, ఎంతోమంది త్యాగాలు, బలిదానాల కారణంగానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏడాదిలోగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగావకాశాల కోసం నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. -
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దళిత వ్యతిరేకులు
న్యూఢిల్లీ: దళిత వ్యతిరేక ఆలోచనా ధోరణి కలిగిన బీజేపీ – ఆర్ఎస్ఎస్లు.. సమాజంలో దళితులు అట్టడుగునే కొనసాగాలన్న ఫాసిస్ట్ భావజాలంతో ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన .. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ల నేతల వ్యాఖ్యలు, కొన్ని ఘటనలతో కూడిన వీడియోను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. రెండు నిమిషాల నిడివున్న ఆ వీడియోలో 2016లో గుజరాత్లో జరిగిన ఉనా ఘటన, మధ్యప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక సందర్భంగా అభ్యర్థుల చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాయటం వంటివి ఉన్నాయి. మోదీ పాలనలో దళితులు లెక్కలేనన్ని దురాగతాలకు బలవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా ఆయన కాపాడలేక పోయారని ఆరోపించారు. దేశంలో ప్రతి 12 నిమిషాలకో దళితుడు వేధింపులకు, రోజుకు ఆరుగురు దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారన్నారు. -
మీ చుట్టూనే అవినీతిపరులు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది నేరస్తులకు బీజేపీ టికెట్లు ఇచ్చిందన్నారు. కర్ణాటకలో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని చుట్టూ పెట్టుకుని తమపై అవినీతి ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మోదీ ఇక్కడకు వచ్చి అవినీతి గురించి మాట్లాడతారని, కానీ బ్యాంకులకు రూ.30 వేల కోట్లు మోసగించి పరారైన నీరవ్‌మోదీ గురించి ఆయన మాట్లాడరని చెప్పారు. మోదీ ప్రచారం సందర్భంగా ఏదైనా వేదికపై నిలబడితే ఆయనకు ఒకవైపు యడ్యూరప్ప, మరోవైపు జైలు జీవితం గడిపిన మరో నలుగురు కనిపిస్తారన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఉద్దేశించి 10 శాతం కమిషన్ ప్రభుత్వం అని మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్‌కు తప్పిన ముప్పు రాహుల్‌కి పెనుప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రాహుల్ గురువారం ఓ విమానంలో బయలుదేరారు. ఉదయం 10.45 గంటలకు విమానంలోని ఆటోపైలెట్ మోడ్ ఒక్కసారిగా ఆగింది. దీంతో విమానం ఒక్కసారిగా గాల్లో పక్కకు ఒరిగిపోయి వేగంగా కిందకు జారిపోయింది. వెంటనే స్పందించిన పైలెట్ విమానాన్ని మాన్యువల్ మోడ్‌లోకి తీసుకొచ్చి హుబ్బలి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
అమిత్ షా నిజంగా జైనుడా ?
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తనకు తాను హిందువునని చెప్పుకుంటారని, వాస్తవానికి ఆయన జైన్ మతస్థుడని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్‌బబ్బర్ తాజాగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు హిందువులు కానివారు సంతకం చేసే పుస్తకంలో సంతకం చేశారంటూ బీజేపీ తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు ప్రతికారంగానే అమిత్ షాపై కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని ప్రారంభించినట్లు స్పష్టం అవుతోంది. ఎప్పుడు తాను హిందూ కుటుంబంలో పుట్టానని, తన కుటుంబం సనాతన ధర్మాన్ని ఆచరిస్తోందని చెప్పుకునే అమిత్ షా మతంపై వార్తలు రావడం, చర్చలు జరగడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. అమిత్ షా పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్‌చంద్ర షా అని, ఆయన 1964లో అక్టోబర్‌లో ముంబైలోని ధనవంతుడైన జైనుడి కుటుంబంలో పుట్టారని, ఆయన తండ్రిపేరు అనిల్ చంద్ర షా అని, గుజరాత్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన అమిత్ షా కుటుంబం అక్కడే స్థిరపడిందని పలు పత్రికలు, వెబ్సైట్లు ఇదివరకే వెల్లడించాయి. దాంతో జైన మతం కూడా హిందూ మతంలో భాగమని రెండు మతాలు సనాతన ధర్మాలనే ఆచరిస్తాయంటూ ఆయన్ని వెనకేసుకొచ్చిన అజ్ఞాన మేథావులు కూడా ఎంతో మంది ఉన్నారు. హిందూ మతంతో పోలిస్తే జైన మతం చాలా ప్రాచీనమైనది, రెండు మతాల ఆచారాల మధ్య పోలికలున్నా రెండు మతాల ధర్మాలు కూడా ఒక్కటి కాదు. జైన మతంది శ్రామన ధర్మంకాగా, హిందూ మతానిది వేద ధర్మం. ఎవరి ధర్మం ఏదైనా అది పూర్తిగా వ్యక్తిగతం. ఏ మతాన్ని నమ్మకపోవడమూ, ఆచరించకపోవడమూ వ్యక్తిగతమే. మతాన్ని ఎప్పుడూ రాజకీయం చేయరాదు. ఓట్ల కోసం మతాన్ని రాజకీయం చేయడం, మతాన్నే మార్చడం మన రాజకీయ నాయకులకు మామూలై పోయింది. తమ కుటుంబానికి ఆరాధ్య దైవం శివుడని, తన నానమ్మ ఇందిరాగాంధీ కూడా శివ పూజలు చేసేవారంటూ రాహుల్ గాంధీ చెప్పడమూ, అయినా దైవభక్తి అన్నది పూర్తిగా వ్యక్తిగత మైనదని, దాని గురించి మాట్లాడరాదంటూ రాహుల్ గాంధీ సర్దిచెప్పుకోవడమూ రాజకీయమే! రాహుల్ గాంధీకి కూడా దైవభక్తి నిజంగా వ్యక్తిగతమైనది అయినప్పుడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కనిపించిన గుడికల్లా ఎందుకు వెళుతున్నారో?! -
వారిని ఆదుకుంటాం..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఐఐటీలో ర్యాంకులు దక్కించుకుని ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు సాయం చేయడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. ఐఐటీలో 167, 410 ర్యాంకులతో టాప్ -500 లో వారు స్థానం దక్కించుకున్న రాజు, బ్రిజేష్ లకు శనివారం ఆయన ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. కష్టాలను అధిగమించి ఐఐటీ ప్రవేశ పరీక్షలో అద్భుతమైన విజయం సాధించిన వారిద్దరికీ తన ట్విట్టర్లో విషెస్ చెప్పారు. మరో ట్వీట్లో జవహర్ నవోదయ విద్యాలయాన్ని కూడా అభినందించారు. ఇలాంటి గ్రామీణ ప్రాంతంలోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి, వారిని తీర్చిదిద్దడం గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు రాజు, బ్రిజేషలతో ఉదయం రాహుల్ గాంధీ మాట్లాడారని కాంగ్రెస వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ ఆయన కుమార్తె ఎమ్మెల్యే ఆరాధన సహా, స్థానిక పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపాయి. వారికి తగిన సహాయం చేయాల్సిన బాధ్యతను తివారీకి అప్పగించినట్టు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గఢ్ జిల్లాలోని రెహువా లాల్ గంజ్ గ్రామస్తుడైన ధర్మరాజ్ సరోజ్ కుమారులైన రాజు, బ్రిజేష ఐఐటీ ప్రవేశ పరీక్షలో 167, 410 ర్యాంకులు తెచ్చుకున్నారు. ఇద్దరూ స్థానిక జవహర్ నవోదయలో చదువుకుంటూ ఈ ఘనతను సాధించారు. అయితే వాళ్ల తండ్రి ఓ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ ఏడుగురు సభ్యులతో ఉన్న కుటుంబాన్ని నెట్టుకొస్తుండటంతో పిల్లల చదువు ఆ కుటుంబానికి పెనుభారంగా మారింది. జూన్ 25 లోపు దాదాపు లక్షరూపాయల పీజు కట్టాల్సి ఉంది. ఈ విషయం మీడియాలో విశేషంగా వచ్చింది. Congratulations to all those who cracked the IIT. Spoke to Brijesh &Raju from Pratapgarh on their tremendous success against all odds (1/2) — Office of RG (@OfficeOfRG) June 20, 2015 Proud of the Jawahar Navodaya Vidyalayas for discovering talent from rural areas &giving them such a wonderful springboard:Rahul Gandhi(2/2) — Office of RG (@OfficeOfRG) June 20, 2015