
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తనకు తాను హిందువునని చెప్పుకుంటారని, వాస్తవానికి ఆయన జైన్ మతస్థుడని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్‌బబ్బర్ తాజాగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు హిందువులు కానివారు సంతకం చేసే పుస్తకంలో సంతకం చేశారంటూ బీజేపీ తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు ప్రతికారంగానే అమిత్ షాపై కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని ప్రారంభించినట్లు స్పష్టం అవుతోంది.
ఎప్పుడు తాను హిందూ కుటుంబంలో పుట్టానని, తన కుటుంబం సనాతన ధర్మాన్ని ఆచరిస్తోందని చెప్పుకునే అమిత్ షా మతంపై వార్తలు రావడం, చర్చలు జరగడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. అమిత్ షా పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్‌చంద్ర షా అని, ఆయన 1964లో అక్టోబర్‌లో ముంబైలోని ధనవంతుడైన జైనుడి కుటుంబంలో పుట్టారని, ఆయన తండ్రిపేరు అనిల్ చంద్ర షా అని, గుజరాత్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన అమిత్ షా కుటుంబం అక్కడే స్థిరపడిందని పలు పత్రికలు, వెబ్‌సైట్లు ఇదివరకే వెల్లడించాయి. దాంతో జైన మతం కూడా హిందూ మతంలో భాగమని రెండు మతాలు సనాతన ధర్మాలనే ఆచరిస్తాయంటూ ఆయన్ని వెనకేసుకొచ్చిన అజ్ఞాన మేథావులు కూడా ఎంతో మంది ఉన్నారు.
హిందూ మతంతో పోలిస్తే జైన మతం చాలా ప్రాచీనమైనది, రెండు మతాల ఆచారాల మధ్య పోలికలున్నా రెండు మతాల ధర్మాలు కూడా ఒక్కటి కాదు. జైన మతంది శ్రామన ధర్మంకాగా, హిందూ మతానిది వేద ధర్మం. ఎవరి ధర్మం ఏదైనా అది పూర్తిగా వ్యక్తిగతం. ఏ మతాన్ని నమ్మకపోవడమూ, ఆచరించకపోవడమూ వ్యక్తిగతమే. మతాన్ని ఎప్పుడూ రాజకీయం చేయరాదు. ఓట్ల కోసం మతాన్ని రాజకీయం చేయడం, మతాన్నే మార్చడం మన రాజకీయ నాయకులకు మామూలై పోయింది. తమ కుటుంబానికి ఆరాధ్య దైవం శివుడని, తన నానమ్మ ఇందిరాగాంధీ కూడా శివ పూజలు చేసేవారంటూ రాహుల్ గాంధీ చెప్పడమూ, అయినా దైవభక్తి అన్నది పూర్తిగా వ్యక్తిగత మైనదని, దాని గురించి మాట్లాడరాదంటూ రాహుల్ గాంధీ సర్దిచెప్పుకోవడమూ రాజకీయమే! రాహుల్ గాంధీకి కూడా దైవభక్తి నిజంగా వ్యక్తిగతమైనది అయినప్పుడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కనిపించిన గుడికల్లా ఎందుకు వెళుతున్నారో?!
Comments
Please login to add a commentAdd a comment