rajbabbar
-
మారని కాంగ్రెస్ నేతల తీరు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదు. ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవాల్సిందిపోయి కాంగీయులు పరస్పరం నిందించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓటమికి గల కారణాలను సమీక్షించుకునేందుకు జ్యోతిరాదిత్య సింధియా, రాజ్‌బబ్బర్ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో సమావేశంలో గందరగోళం తలెత్తింది. ఎన్నికల సమయంలో యూపీ బాధ్యుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియాతో రాష్ట్ర నేతలు వాదోపవాదనలకు దిగారు. ఓటమికి మీదే బాధ్యత అంటూ మండిపడ్డారు. పశ్చిమ యూపీలోని 10 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఆఫీస్ బేరర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో టిక్కెట్ల పంపకం జరగడం వల్లే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని ఘజియాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరేంద్ర కాసన ఆరోపించారు. ఘజియాబాద్ లోక్‌సభ అభ్యర్థి డోలి శర్మ, ఆమె తండ్రి నరేంద్ర భరద్వాజ్‌పై పార్టీ పెద్దలకు ఆయన ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీని సీనియర్ నాయకులు తప్పుదారి పట్టించారని వాపోయారు. సమావేశం ముగిసిన తర్వాత కూడా హరేంద్ర, నరేంద్ర మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇది తమ పార్టీ అంతర్గత వ్యవహారామని కాంగ్రెస్ నాయకుడొకరు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేదనానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అమిత్ షా నిజంగా జైనుడా ?
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తనకు తాను హిందువునని చెప్పుకుంటారని, వాస్తవానికి ఆయన జైన్ మతస్థుడని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్‌బబ్బర్ తాజాగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు హిందువులు కానివారు సంతకం చేసే పుస్తకంలో సంతకం చేశారంటూ బీజేపీ తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు ప్రతికారంగానే అమిత్ షాపై కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని ప్రారంభించినట్లు స్పష్టం అవుతోంది. ఎప్పుడు తాను హిందూ కుటుంబంలో పుట్టానని, తన కుటుంబం సనాతన ధర్మాన్ని ఆచరిస్తోందని చెప్పుకునే అమిత్ షా మతంపై వార్తలు రావడం, చర్చలు జరగడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. అమిత్ షా పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్‌చంద్ర షా అని, ఆయన 1964లో అక్టోబర్‌లో ముంబైలోని ధనవంతుడైన జైనుడి కుటుంబంలో పుట్టారని, ఆయన తండ్రిపేరు అనిల్ చంద్ర షా అని, గుజరాత్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన అమిత్ షా కుటుంబం అక్కడే స్థిరపడిందని పలు పత్రికలు, వెబ్సైట్లు ఇదివరకే వెల్లడించాయి. దాంతో జైన మతం కూడా హిందూ మతంలో భాగమని రెండు మతాలు సనాతన ధర్మాలనే ఆచరిస్తాయంటూ ఆయన్ని వెనకేసుకొచ్చిన అజ్ఞాన మేథావులు కూడా ఎంతో మంది ఉన్నారు. హిందూ మతంతో పోలిస్తే జైన మతం చాలా ప్రాచీనమైనది, రెండు మతాల ఆచారాల మధ్య పోలికలున్నా రెండు మతాల ధర్మాలు కూడా ఒక్కటి కాదు. జైన మతంది శ్రామన ధర్మంకాగా, హిందూ మతానిది వేద ధర్మం. ఎవరి ధర్మం ఏదైనా అది పూర్తిగా వ్యక్తిగతం. ఏ మతాన్ని నమ్మకపోవడమూ, ఆచరించకపోవడమూ వ్యక్తిగతమే. మతాన్ని ఎప్పుడూ రాజకీయం చేయరాదు. ఓట్ల కోసం మతాన్ని రాజకీయం చేయడం, మతాన్నే మార్చడం మన రాజకీయ నాయకులకు మామూలై పోయింది. తమ కుటుంబానికి ఆరాధ్య దైవం శివుడని, తన నానమ్మ ఇందిరాగాంధీ కూడా శివ పూజలు చేసేవారంటూ రాహుల్ గాంధీ చెప్పడమూ, అయినా దైవభక్తి అన్నది పూర్తిగా వ్యక్తిగత మైనదని, దాని గురించి మాట్లాడరాదంటూ రాహుల్ గాంధీ సర్దిచెప్పుకోవడమూ రాజకీయమే! రాహుల్ గాంధీకి కూడా దైవభక్తి నిజంగా వ్యక్తిగతమైనది అయినప్పుడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కనిపించిన గుడికల్లా ఎందుకు వెళుతున్నారో?! -
ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది..
-
పొత్తు కుదిరింది..
► ఎస్పీ, కాంగ్రెస్ మధ్య కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు ► 298 స్థానాల్లో ఎస్పీ, 105 సీట్లలో కాంగ్రెస్ పోటీ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య కొంతకాలంగా నడుస్తున్న సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగానూ 298 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ, మిగిలిన 105 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు నరేశ్‌ఉత్తమ్, యూపీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ ఆదివారం లక్నోలో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తాయని, ఈ ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జోక్యం చేసుకోవడంతో ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితా యూపీ ఎన్నికలకోసం బీజేపీ 155 మందితో తొలిజాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా 44 మందితో తొలి జాబితా విడుదల చేసింది.