న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదు. ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవాల్సిందిపోయి కాంగీయులు పరస్పరం నిందించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓటమికి గల కారణాలను సమీక్షించుకునేందుకు జ్యోతిరాదిత్య సింధియా, రాజ్‌బబ్బర్ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో సమావేశంలో గందరగోళం తలెత్తింది. ఎన్నికల సమయంలో యూపీ బాధ్యుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియాతో రాష్ట్ర నేతలు వాదోపవాదనలకు దిగారు. ఓటమికి మీదే బాధ్యత అంటూ మండిపడ్డారు. పశ్చిమ యూపీలోని 10 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఆఫీస్ బేరర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో టిక్కెట్ల పంపకం జరగడం వల్లే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని ఘజియాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరేంద్ర కాసన ఆరోపించారు. ఘజియాబాద్ లోక్‌సభ అభ్యర్థి డోలి శర్మ, ఆమె తండ్రి నరేంద్ర భరద్వాజ్‌పై పార్టీ పెద్దలకు ఆయన ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీని సీనియర్ నాయకులు తప్పుదారి పట్టించారని వాపోయారు. సమావేశం ముగిసిన తర్వాత కూడా హరేంద్ర, నరేంద్ర మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇది తమ పార్టీ అంతర్గత వ్యవహారామని కాంగ్రెస్ నాయకుడొకరు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేదనానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment