తాండూరు సభలో అభివాదం చేస్తున్న రాహుల్‌గాంధీ, సభకు అధికంగా హాజరైన మహిళలు, మోదీ ప్రభుత్వం నాపరాతి పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి వ్యాపారాన్ని దివాలాతీసేలా చేసింది.
సాక్షి, వికారాబాద్: రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాండూరులో సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాటాడారు. తెలంగాణ ప్రజల కలలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని వదిలేసిన కేసీఆర్ రీ డిజైన్లకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఈ ప్రాంతానికి సాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఖర్చు మొదట్లో రూ.10 వేల కోట్లు ఉంటే.. రీడిజైన్ చేసి.. రూ.60 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు.
తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తా మని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులు రూ.17 వేల కోట్లు ఉండగా, ప్రస్తుతం ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షల అప్పు ఉందని తెలిపారు. కానీ కేటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బంగారుమయమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ రూ.300 కోట్ల బంగళాలో విశ్రాంతి తీసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
చార్మినార్‌లో కలుపుతాం...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో విలీనం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తాండూరు ప్రాంత ప్రజల, నిరుద్యోగుల ఆకాంక్షలను విరుద్ధంగా జిల్లాను జోగులాంబ జోన్‌లో కలిపి అన్యాయం చేశారన్నారు. ఈ ప్రాంతం కంది సాగుకు ప్రసిద్ధి పొందిందని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్న కంది బోర్డు ఏర్పాటు కలను తీరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ టౌన్ మంజూరుచేయగా, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శాటిలైట్ టౌన్‌కు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
తాండూరుకు బైపాస్ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయిందని విమర్శించారు. స్టోన్ పరిశ్రమ కారణంగా వెలువడుతున్న కాలుష్య నియత్రంణకు చర్చలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తాండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రులను కూడా అప్‌గ్రేడ్ చేసి, ఈఎస్‌ఐ దవాఖానా సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాత తాండూరులో ఫ్లైఓవర్ లేదా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పారు. నాపరాతి పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి వ్యాపారాన్ని దివాలాతీసే విధంగా మోదీ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. జిల్లాలోని కోట్‌పల్లి, శివసాగర్, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని వివరించా
దొరల పాలన అంతం కావాలి
రాష్ట్రంలో దొరల పాలన అంతం కావాలంటే ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. మన భూములు, నీళ్లు, నిధులు మనకు దక్కాలన్నారు. చండీయాగాలు చేస్తే ప్రజలు అభివృద్ధి చెందరని, ప్రజారంజకమైన పాలన సాగించాలని తెలిపారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... పాటనై వస్తున్నానమ్మో అంటూ గద్దర్ తాను రాసిన పాటలను ఆలపించి సభికులను ఉత్తేజపరిచారు. ఆయన పాట పాడుతున్న సమయంలో రాహుల్‌గాంధీ ఆసక్తిగా గమనించడం విశేషం.
కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి కమీషన్లు..
రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో పైసలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి, కమీషన్లు మాత్రం కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి వెళ్తున్నాయని టీజేఎస్ అధినేత, ఫ్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఏ ఒక్కడివల్లనో తెలంగాణ రాష్ట్రం రాలేదని, ఎంతోమంది త్యాగాలు, బలిదానాల కారణంగానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏడాదిలోగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగావకాశాల కోసం నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment