Rangareddy dist
-
సెల్ టవర్ ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ నిరసన
సాక్షి, కడ్తాల్: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్‌లో వెంకటేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తమ డిమాండ్లు నెరవేరేవరకు సెల్ టవర్ దిగబోనని అతను భీష్మించుకొని కూర్చున్నాడు. దాదాపు గంటసేపు టవర్‌పైన ఉండి నిరసన తెలిపిన వెంకటేశ్‌ను పోలీసులు, స్థానికుల నచ్చజెప్పి కిందకు దించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు రెండో రోజు ఆదివారం కూడా సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం అటు కార్మిక సంఘాలు పట్టువిడవడం లేదు. సమ్మె ఎన్నిరోజులు కొనసాగినా కార్మికులతో చర్చలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేయగా.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా కార్మికులంతా సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. -
సింధు హరితహారం
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతివనంలో రామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ డీ పాటిల్ జన్మదినం సందర్భంగా శనివారం హరితహారం నిర్వహించారు. ఆశ్రమంలో కమ్లేష్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మొక్కలు నాటారు. శాంతివనం నర్సరీ నిర్వాహకులు శరవణన్ మాట్లాడుతూ.. గురూజీ జన్మదినం సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా 64 నగరాల్లో 64 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. -
రాఖీ పండుగ వచ్చిందంటే.. రాజన్నే గుర్తొస్తడు
సాక్షి, మహేశ్వరం: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని చాటేది రాఖీ పండుగ. అన్ని పండుగలకంటే రాఖీ నాకు ఎంతో ఇష్టం. దివంగత నేత, అన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదటి రాఖీ నేనే కట్టేదానిని. నాకు ఒక తమ్ముడు నర్సింహారెడ్డి ఉన్నాడు. రాజశేఖరరెడ్డి అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాతే మా తమ్ముడికి కట్టేదానిని. రాజన్న కూడా నన్ను సొంత చెల్లెలుగా చూసుకునేవారు. రాఖీ పండుగ వచ్చిందంటే రాజశేఖరరెడ్డి అన్నే గుర్తొస్తడు. నేను చదువుకునే రోజుల్లో రాఖీ పండుగ రోజున మా తమ్ముడికి రాఖీని పోస్టులో పంపించేదాన్ని. ఇప్పుడు రాఖీ పండుగ రోజున మా తమ్ముడి ఇంటికి వెళ్తున్నానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. -
చిన్నారిపై లైంగిక దాడి
సాక్షి, పూడూరు(రంగారెడ్డి): సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు ఓ 55 ఏళ్ల వ్యక్తి. తన మనవరాలి వయసుండే బాలికకు చాకెట్ల ఆశ చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామానికి చెందిన జాండ్ర రాయకోటి(55) కొంతకాలం క్రితం గ్రామం నుంచి వెళ్లి పోయాడు. ఆయనను భార్య, కుటుంబీకులు వదిలేశారు. ఈనేపథ్యంలో రెండేళ్ల క్రితం ఆయన తిరిగి స్వగ్రామం పెద్ద ఉమ్మెంతాల్‌కు వచ్చాడు. స్థానికంగా టీవీలు, ఫ్యాన్ల రిపేరింగ్తోపాటు ఎలక్రీషియన్‌గా పని చేస్తున్నాడు. తన ఇంటికి సమీపంలోని ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి(5)కి తరచూ చాక్లెట్ల ఆశ చూపించి సెల్ఫోన్లో బొమ్మలు చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మరోమారు రాయకోటి తన ఇంట్లో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడగా తీవ్రరక్తస్రావం అయింది. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. బాధితురాలి కుటుంబీకులు జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పడంతో రాయికోటిపై దాడి చేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు చన్గోముల్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని పరిగి ఠాణాకు తరలించి విచారణ జరిపారు. సోమవారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ హఫీజ్, సీఐ మొగులయ్య తెలిపారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన రాయకోటిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
అయ్యో మల్లికార్జునా!.. ఎంత పనిచేశావయ్యా!
సాక్షి, కాజీపేట: దైవదర్శనం చేసుకుని... మొక్కలు చెల్లించుకున్నారు.. కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఇళ్లకు బయలుదేరారు.. మధ్యలో కాసేపు విరామం తీసుకుని భోజనం పూర్తిచేశా రు.. ఆ తర్వాత వాహనంలో బయలుదేరిన వారికి అదే చివరి ప్రయాణం అవుతుందని తెలియదు.. ఒక్కసారి మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న పగడాల దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన భార్య, చిన్నకుమారుడు, అక్కా, బావలు కన్నుమూశారు.. రెప్పపాటులో జరిగిన ఈ ఘోరంతో ఆ కుటుంబంలో దుర్గాప్రసాద్ తల్లి, మరో కుమారుడు మాత్రమే మిగలడం విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ వద్ద జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన దుర్గాప్రసాద్ కాజీపేట వాసి కాగా.. మట్టెవాడ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన దుర్గాప్రసాద్ మట్టెవాడ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భార్య, కుమారుడు, అక్కాబావలతో కలిసి ఆదివారం వెళ్లాడు.. దైవదర్శనం అనంతరం అక్కడే బస చేసిన వారు సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు.. అయితే, అదే చివరి ప్రయాణమవుతుందని వారికి తెలియదు.. మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా అమనగల్లు వద్ద భోజనం చేసి వస్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైకి లారీ దూసుకొచ్చింది. ఆ లారీని వీరు వెళ్తున్న ఇన్నోవా వేగంగా ఢీకొట్టింది.. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, ఆయన భార్య, విజయలక్ష్మి, కుమారుడు శంతన్కుమార్తో పాటు అక్కాబావలు పద్మ, రాజు సైతం మృతి చెందారు.. వీరు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు అందులో చిక్కుకుపోయాయి.. ప్రమాదంలో దుర్గాప్రసాద్, ఆయన సతీమణి, కుమారుడు మృతి చెందగా అనారోగ్యంతో ఇక్కడే ఉండిపోయిన తల్లి, ఆస్ట్రేలియాలో ఉంటున్న మరో కుమారుడు శ్రయాజ్ మాత్రం కుటుంబంలో మిగిలినట్లయింది.. విషయం తెలియగానే ఆయన నివాసముండే రహమత్నగర్తో పాటు పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లన్న దర్శనం కోసం.. కాజీపేట 52వ డివిజన్ రహమత్‌నగర్ కాలనీకి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పగడాల దుర్గాప్రసాద్ (50) తన భార్య విజయలక్ష్మి(46), చిన్నకొడుకు శంతన్‌కుమార్(25), హైదరాబాద్ కు చెందిన బావ రాజు, అక్క పద్మతో కలిసి ఆదివారం ఉదయం కర్నూల్ జిల్లా శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లారు. రాత్రి అక్కడే బసచేసిన వారు దైవదర్శనం అనంతరం సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఓ హోటల్లో భోజ నం చేశారు. ఈమేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగ ల్లు మండలం మేడిగడ్డతండా గేటు వద్ద హైదరా బాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న లారీ కుడివైపున ఉన్న శ్రీలక్ష్మీ గణపతి వే బ్రిడ్జి వద్దకు ఒక్కసారిగా మళ్లింది. దీంతో వేగంగా వస్తున్న ఇన్నోవా లారీ ముందు భాగంలోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, శంతన్, రాజు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మి, పద్మజ ఆమనగల్లు ప్రభుత్వాçస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారం భించేలోపే కన్నుమూశారు. ఇన్నోవా డ్రైవర్ ఖలీల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పోలీసు అధికారుల పర్యవేక్షణ ఆమన్‌గల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్గప్రసాద్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కాజీపేటకు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లను సీపీ డాక్టర్ విశ్వనా«థ్ రవీందర్ పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించి సోమవారం రాత్రిలోగా పోస్టుమార్టం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ మేరకు మృతదేహాలు మంగళవారం తెల్లవారుజాము వరకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిసింది. కాజీపేట సీఐ అజయ్‌తోపాటు పోలీసు సిబ్బంది మృతుడి ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. దుర్గాప్రసాద్ పెద్దకుమారుడు శ్రయా జ్ ఆస్ట్రేలియా నుంచి బయలుదేరగా మంగళవారం మధ్యాహ్నంలోగా హైదరాబాద్ చేరుకుంటాడని తెలిసింది. ఆయన కాజీపేటకు రాగానే పోలీసులాంఛనలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కేసుల ఛేదనలో దిట్ట ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు పోలీసు స్టేషన్లలో పనిచేసిన దుర్గాప్రసాద్‌కు ఉన్నతాధికారుల వద్ద మంచి పేరు ఉంది. ఎక్కువగా క్రైం విభాగంలో పనిచేసిన ఆయన కేసుల ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించేవాడని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పనితీరును మెచ్చిన అధికారులు ఎక్కువగా నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇచ్చేవారని తెలిసింది ఇదీ కుటుంబ నేపథ్యం రైల్వేలో లోకో ఇన్స్పెక్టర్గా పనిచేసే పుల్లయ్య 1971లో రహమత్‌నగర్‌లో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. పుల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆమన్‌గల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూతురు పద్మ, అల్లుడు రాజు, కొడుకు దుర్గాప్రసాద్, కోడలు విజయలక్ష్మి, మనవడు శంతన్‌కుమార్ మృతి చెందారు. కొద్దికాలం క్రితం పుల్లయ్య మరణించడంతో తల్లి పూలమ్మ వృద్ధాప్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఇక దుర్గాప్రసాద్ కుమారుడు శంతన్‌కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా దుర్గాప్రసాద్ మట్టెవాడ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పెద్దకుమారుడు శ్రయాజ్ ఆస్ట్రేలియాలో ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. దైవభక్తి ఎక్కువ దుర్గా ప్రసాద్‌కు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ. 2018లో పదోన్నతి వచ్చిన తరక్వాత పలు దేవాలయాలకు వస్తానని మొక్కుకున్నట్లు సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇటీవలే వేములవాడ, కొండగట్లు ఆలయాలను కుటుంబ సభ్యులతో సందర్శించుకోని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిసింది. శనివారం విధులు నిర్వర్తించిన దుర్గాప్రసాద్ ఆది, సోమవారం రెండు రోజుల పాటు సెలవు పెట్టి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ దైవ దర్శనం చేసుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడం అందరినీ కలిచివేసింది. అధికారుల సంతాపం వరంగల్ క్రైం/రామన్నపేట: హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ మృతి పట్ల వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ నరసింహ, ఏసీపీ నర్సయ్య, మట్టెవాడ ఇన్స్పెక్టర్ జీవన్‌రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, దీపక్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్ తదితరులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి ప్రకటించి సంతాపం తెలిపారు. ఉద్యోగుల దిగ్భ్రాంతి వరంగల్ క్రైం: మట్టెవాడ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న దుర్గాప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియగానే సహచర ఉద్యోగులు, పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాం తికి గురయ్యారు. 1990 బ్యాచ్‌కి చెందిన దుర్గాప్రసాద్ మొగుళ్లపల్లి, మడికొండ, స్టేషన్ఘున్పూర్, సుబేదారి, మట్టెవాడ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2014 డిసెంబర్లో జరిగిన బదిలీల్లో మట్టెవాడ వెళ్లారు. అక్కడే ఆయనకు 2018 ఫిబ్రవరిలో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి వచ్చింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి తీర్ధయాత్రలకు వెళ్లిన తన కొడుకు, కుమార్తెల కుటుంబాలు కన్నుమూశాయన్న విషయం తెలుసుకున్న దుర్గప్రసాద్ తల్లి పూలమ్మ బోరున విలపిస్తున్నారు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు, పెద్దకూతురు, అల్లుడితో పాటు భార్య, కోడలు ప్రమాదంలో చనిపోయారని ఇంటి పక్కల వారు చెప్పడంతో తల్లి ఆచేతనంగా మారిపోయింది. మాట రాకుండా మంచంలోనే పడిపోవడం చూపరులను కలిచివేసింది. ఉన్నతాధికారుల పరిశీలన ఆమనగల్లు:ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆమనగల్లు ఎస్ఐ మల్లీశ్వర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్నోవా వాహనంలో చిక్కుకున్న మతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీశారు. ఇక ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఘటన స్థలాన్ని సోమవారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ ప్రసాద్‌రావ్, షాద్‌నగర్ ట్రాఫిక్ సీఐ సునీల్, ఆమనగల్లు సీఐ నర్సింహారెడ్డి పరిశీలించారు. అందరితో కలివిడిగా.. రోడ్డు ప్రమాదంలో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబం రహమత్‌నగర్‌లో అందరితో కలివిడిగా ఉండేవారు. పండుగలు, పబ్బలకు హాజరవుతూ చిన్నాపెద్ద తేడా లేకుండా కలిసిపోయే వారు. వినాయక చవితి, శ్రీరామనవమి, ఉగాది వేడుకలను కాలనీవాసులతో కలిసి ఘనంగా రుపుకోవడానికి ప్రాధాన్యతనివ్వడమే కాకుండా నిర్వహణకు చేయూతనిచ్చేవారు. సహచర మిత్రుల్లో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి పరిష్కరించేవాడనే పేరుంది. -
ఒకే రోజు ఇద్దరు అగ్రనేతల పర్యటన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభావం చవిచూసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాకు తొలిసారిగా వస్తున్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని శంషాబాద్ నుంచి పూరించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9న క్లాసిక్ కన్వెన్షన్–3 పక్కన ఉన్న మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలను అధిక సంఖ్యలో తరలించాలని భావిస్తున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి నుంచి 50 వేలకుపైగా పార్టీ శ్రేణులను సమీకరించాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. ఈ బాధ్యతలను ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్చార్జులకు అప్పగించారు. ఈ సభా వ్యవహారాలను మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందటంతో ఇక్కడ విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలవడం కలిసొచ్చే అంశమని పరిగణనిస్తున్నాయి. మరోసారి ఉనికి చాటేలా.. మరోపక్క టీఆర్ఎస్ పార్టీ తన ప్రాబల్యాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని 9న చేవెళ్లలోని ఫరా కళాశాల మైదానంలో నిర్వహించ తలపెట్టింది. కొన్ని రోజులుగా పార్టీ వర్గాలు ఏర్పాట్లలో మునిగిపోయాయి. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు హాజరవుతున్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టాన తర్వాత తొలిసారి కేటీఆర్ జిల్లాకు వస్తుండడంతో ఆయన ఘనంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సన్నాహక సభకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి దాదాపు 20 వేల మందిని తరలించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా సభలు నిర్వహిస్తుండడంతో రాజకీయాలు వేడెక్కాయి. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి కలిసొచ్చేనో..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ పోటెత్తింది. గతంతో పోలిస్తే ఈసారి భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన రాజకీయపక్షాలు.. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా ప్రోత్సహించాయి. ఓటు విలువను తెలుపుతూ ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించిన ప్రచారం కూడా పోలింగ్ పెరగడానికి దోహదపడింది. 2014 శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుతం ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 65.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 67.34 శాతం నమోదైంది. గ్రామీణుల హుషారు! పట్టణ నియోజకవర్గాలతో పోలిస్తే ఈసారి గ్రామీణ సెగ్మెంట్లలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. షాద్‌నగర్, కల్వకుర్తి స్థానాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి షాద్‌నగర్‌లో 7.63 శాతం, కల్వకుర్తిలో 6.01 శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నియోజకవర్గాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొనడం.. ప్రతి ఓటు విలువైనదే కావడంతో ధన ప్రవాహం కూడా భారీగానే జరిగింది. దీంతో వలస ఓటర్లకు గాలం వేసిన పార్టీలు ఓటర్లను తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాయి. కొందరు అభ్యర్థులు ఏకంగా రోజువారీ కూలీని పంపిణీ చేశారు. మందు, విందు షరా మామూలే. ఈ నేపథ్యంలోనే ఓట్లేసేందుకు గ్రామీణులు పల్లెబాట పట్టారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ఇలా ఓటెత్తిన చైతన్యం ఎవరిని గెలిపిస్తుందోనని చర్చించుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరగడం అభ్యర్థుల్లో దడ పుట్టిస్తోంది. శివార్లలో స్వల్పమే అయినా.. శివారు నియోజకవర్గాల్లోనూ ఓటింగ్‌శాతం పెరిగింది. వాస్తవానికి ఈ సెగ్మెంట్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో పోలింగ్ జరగకపోయినా గత ఎన్నికలతో పోలిస్తే అధికంగా నమోదు కావడం సానుకూల పరిణామం. శేరిలింగంపల్లి స్థానంలో 2014లో 47.9 శాతం నమోదు కాగా.. ఈ సారి 48.51 శాతం నమోదైంది. అంటే 0.61శాతం పోలింగ్ పెరిగిందన్నమాట. అలాగే ఎల్బీనగర్లో 2.07 శాతం, మహేశ్వరంలో 1.03 శాతం పోలింగ్ ఈ సారి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ప్రజలు ఎక్కువగా ఈ నియోజకవర్గాల పరిధిలో స్థిరపడ్డారు. వీరందరికి అటు గ్రామాల్లో.. ఇటు నగరంలోనూ ఓట్లు ఉన్నాయి. దీంతో తమ స్వస్థలాల్లో ఓటేసేందుకే వీరు ప్రాధాన్యం ఇస్తుండడంతో శివారు సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం తరుగుదలకు కారణమవుతోంది. ఎప్పటికప్పుడు పలుచోట్ల నమోదైన ఓట్లను ఏరివేస్తున్నామని ప్రకటిస్తున్నా అది ఆచరణలో కనిపించడం లేదు. దీనికితోడు శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు నివసిస్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో ఓటేయడానికి ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. దీంతో గ్రామీణ సెగ్మెంట్ల కంటే చాలా తక్కువగా ఇక్కడ ఓటింగ్‌శాతం నమోదైంది. మరోవైపు నువ్వా..నేనా అన్నట్లు పోరు సాగిన చేవెళ్లలో 0.14శాతం పోలింగ్ పెరిగింది. పట్నంలో తగ్గిన పోలింగ్ ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తక్కువగా పోలింగ్ జరిగింది. ఈ రెండింటిలోనూ 2శాతం కంటే తక్కువ పోలింగ్ జరగడంతో ఏ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతీస్తుందో అంతుచిక్కడం లేదు. హోరాహోరీగా పోరు సాగిన నేపథ్యంలో ప్రజానాడి ఏమిటో అంచనా వేయడం క్లిష్టంగా మారింది. మరోవైపు పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు గెలుపోటములను విశ్లేషించుకుంటున్నారు. ఓటింగ్ సరళిని మదింపు చేస్తూ బూత్‌లవారీగా తమ ఖాతాలో పడే ఓట్లను లెక్కిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో నమోదైన ఓటింగ్ శాతానికి అనుగుణంగా ఎవరికెన్ని ఓట్లు పోలవుతాయనేదానిపై అంచనాకొస్తున్నారు. -
మహేశ్వరం..ఎవరికో వరం
మహేశ్వరం: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇబ్రíహీంపట్నం, మలక్‌పేట్ నియోజకవర్గాల నుంచి విడిపోయి 2009లో మహేశ్వరం ఏర్పడింది. కందుకూరు, సరూర్‌నగర్, బాలాపూర్, మహేశ్వరం మండలాలతోపాటు ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లతో ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్ కేబినెట్లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి మహిళా హోశాఖ మంత్రిగా చరిత్ర సృష్టించారు. 2014లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకొని ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి కారు గుర్తుతో పోటీకి దిగారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మొత్తం 17 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ప్రధానంగా ముగ్గురి మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మహాకూటమి భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఎమ్మార్పీఎస్ సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన అందెల శ్రీరాములుయాదవ్ గట్టిపోటీ ఇస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈనేపథ్యంలో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పవచ్చు. అభివృద్ధిని ప్రచారం చేస్తూ.. తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి మరోమారు విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తాను ప్రత్యేక చొరవతో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం చేశారు. గొర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతుబీమా పథకాలే తన గెలుపుకు తోడ్పడుతాయని భావిస్తున్నారు. అన్ని గ్రామాలు, తండాల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ సర్కారు పథకాలే తనను మరోమారు గెలిపిస్తాయనే ధీమాతో తీగల ఉన్నారు. సర్కారు వైఫల్యమే అస్త్రంగా.. మహాకూటమి అభ్యర్థి (కాంగ్రెస్) సబితారెడ్డి తెలంగాణ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను అస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ఆమె ఎండగడుతున్నారు. దీంతోపాటు తాజా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై ఉన్న వ్యతిరేకతను, ఆయన అసమర్థతతో నియోజకవర్గం వెనుకబడిందని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలను ప్రచారం చేస్తూ విరివిగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అన్నివర్గాల ప్రజలకు తెలియజేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తామని అంటున్నారు. తనను గెలిపిస్తే మహేశ్వరాన్ని మరో హైటెక్ సిటీగా మారుస్తానని సబితారెడ్డి ప్రచారం చేస్తున్నారు. బీసీ వాదంతో ముందుకు మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ చాపకింద నీరులా దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తనను గెలిపిస్తే మహేశ్వరం నియోజకవర్గ రూపురేఖలను మార్చేస్తానని ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్ర సర్కారు సాయంతో అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇస్తున్నారు. బీసీవాదంతో ముందుకెళ్లి కుల సంఘాలను ఏకం చేసి వారిని ఆకర్షిస్తున్నారు. దీంతోపాటు ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ అనుబంధ సంస్థల మద్దతుతో ముందుకెళ్తున్నారు. ఇటీవల మహేశ్వరంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సరూర్‌నగర్‌లో అమిత్‌షా సభలు విజయవంతం కావడంతో కేడర్‌లో జోష్ నెలకొంది. మహేశ్వరం గడ్డపై కాషాయం జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. ఓటర్ల సంఖ్య ఇలా.. మొత్తం: 40,23,212 పురుషులు: 2,19,014 స్త్రీలు: 2,04,147 ఇతరులు: 50 ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు : 17 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు టీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి ప్రజాకూటమి అభ్యర్థి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి కమలం నుంచి అందెల శ్రీరాములు యాదవ్ పోటీ -
ఇక.. ప్రలోభాల జాతర
నోళ్లకు తాళం పడింది. మైకుల మోత ఆగిపోయింది. మూడు నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి బుధవారం బ్రేక్ పడింది. మరో 24 గంటల్లో తుదిపోరు ప్రారంభం కానుంది. కీలకఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. చివరి నిమిషంలో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఓటర్లకు నగదు ఆశ జూపుతున్నారు. ఇప్పటికే మందు, విందులతో నిండిపోయిన పల్లెలు.. రాజకీయం క్లైమాక్స్ చేరడంతో మరింత హాట్‌హాట్‌గా మారాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 163 మంది బరిలో నిలిచారు. కేవలం ప్రధాన పార్టీలేగాకుండా తొలిసారి చిన్నా చితక పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గెలుపే ధ్యేయంగా జట్టుకట్టిన టీడీపీ–కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కూటమి ఒకవైపు.. మరోసారి విజయం సాధించాలని ముందస్తు సమరానికి సై అన్న టీఆర్ఎస్ మరోవైపు.. మెరుగైన ఫలితాలను సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇంకోవైపు.. పోటాపోటీగా సమరక్షేత్రంలోకి దిగాయి. మొదటి రోజే అభ్యర్థులను ప్రకటించి శంఖారావం పూరించిన గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాలోని రాజేంద్రనగర్, మహేశ్వరం మినహా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల ఆశీర్వాదాన్ని కోరారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సైతం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలుపెరగకుండా.. శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అతిరథ మహారథులతో ప్రచారపర్వం కొనసాగించిన ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ మునుపెన్నడూలేని రీతిలో బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ముందస్తు సంకేతాలు రావడమే తరువాయి రాజేంద్రనగర్‌లో దాదాపు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్లో పర్యటించారు. అగ్రనేతలు గులాంనబీ అజాద్, అజారుద్దీన్, సినీ తారలు విజయశాంతి, నగ్మా, కుష్బూ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. చంద్రబాబు సైతం.. ప్రజాకూటమి అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, మహేశ్వరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సినీ నటుడు బాలకృష్ణ ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. హోరెత్తించిన కమలదళం బీజేపీ అధినేత అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, హాన్స్‌రాజ్, గంగ్వార్, స్మృతి ఇరానీ, పురందేశ్వరి, స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానంద తదితరులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కమలం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధాన పార్టీలకు దీటుగా ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ టికెట్లు దక్కకపోవడంతో ఏనుగెక్కిన మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్లు ప్రజాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థులకు తీసిపోని రీతిలో ప్రచారం హోరెత్తించారు. ఉరుకులు పరుగులకు తెర ఉరుకులు పరుగులకు తెరపడింది. ఇక ఉత్కంఠ మిగిలింది. ఎన్నికల క్రతువులో కీలక రోజుగా భావించే ఈ కొన్ని గంటల్లో ఫలితాన్ని తారు మారు చేసేందుకు అభ్యర్థులు తెర వెనుక రాయ‘బేరాలు’ కొనసాగిస్తున్నారు. ఓటరును బుట్టలో వేసుకునేందుకు ఎత్తులు.. చీకట్లో చిత్తులు చేసే కార్యక్రమం మొదలు కానుంది. వీరి భవితవ్యం 11న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది. -
కొడంగల్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరాహోరీ
కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఒకవైపు.. గెలుపే లక్ష్యంగా టీర్ఎస్ ఎంచుకున్ననరేందర్‌రెడ్డి మరో వైపు బరిలో ఉన్నారు. ఇద్దరు ఉద్దండుల రాజకీయ రణరంగంలో కొడంగల్ ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారనే అంశంపై ఉత్కంఠ సాగుతోంది. కొడంగల్: కొడంగల్‌లో పోరాటం నువ్వా.. నేనా అనేలా సాగుతోంది నియోజకవర్గంలోని సెకండ్ కేడర్ నాయకులు చాలా మంది ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. కుల సంఘాల ప్రతినిధులను నరేందర్‌రెడ్డి తన వైపునకు తిప్పుకొన్నారు. కొడంగల్ ప్రజల ఆత్మగౌరవమే తనకు ముఖ్యమని రేవంత్ ప్రచారం చేస్తున్నారు. 7న జరిగే ఎన్నికల్లో గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. నేతలిద్దరూ గెలుపు తమదేనని చెబుతున్నా.. చివరికి ఏం జరుగుతుందోననే భయం వీరి లో కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కొడంగల్‌పై దృష్టిసారించి రేవంత్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించు కుంటున్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం తనకు 30 వేల మెజారిటీ వస్తుందని, ప్రజలు మళ్లీ తననే ఆదరిస్తారని పేర్కొంటున్నారు. కొడంగల్ నియోజకవర్గం చుట్టూ హై టెన్షన్ వైరులా తాను కాపాలా ఉన్నానని.. తాను ఉన్నంత వరకు కొడంగల్ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్నాళ్లు జరిగిన ఎన్నికలు ఒకవంతు అయితే డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరో వంతుగా మారాయి. అభ్యర్థులిద్దరూ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమి తెలియని ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. నువ్వా.. నేనా ! కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం పేరుతో రేవంత్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి మంత్రంతో టీఆర్ఎస్ నరేందర్‌రెడ్డి జనానికి దగ్గరవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నేతగా ఉన్న రేవంత్ తనదైన ప్రణాళికతో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. రెండేళ్లుగా ప్రతీ గ్రామంలో ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను ఓవర్ టేక్ చేసే విధంగా రేవంత్ ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో రాటుదేలిన రేవంత్‌రెడ్డి తన గెలుపు కోసం వేస్తున్న ఎత్తుగడలు స్థానికులకు అంతుపట్టడం లేదు. ఇదిలా ఉండగా మంగళవారం సీఎం కేసీఆర్ కోస్గి సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిరసన తెలియజేయాలని రేవంత్ పిలుపునివ్వడం ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎటువైపు.. నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు ఉన్నారో అంతుపట్టడం లేదు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీని గెలిపించారు. కొడంగల్ ఆది నుంచి కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోట. ఒకదఫా కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. మరోసారి టీడీపీకి అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల వరకు కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ ఉండేది. ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షాలుగా నిలిచాయి. అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 సార్లు సార్వత్రిక ఎన్నికలు కాగా ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఐదుసార్లు, టీడీపీ నాలుగు సార్లు, స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు గెలిచారు. 1996లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
ప్రచారంలో దూసుకుపోతున్న ‘ఏనుగు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏనుగు.. జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసిస్తోంది. యూపీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే బహుజన్ సమాజ్ (బీఎస్పీ) పార్టీ మన జిల్లాలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులను ‘బెహన్జీ’ మాయవతి అక్కున చేర్చుకున్నారు. టికెట్లు కేటాయించి ఆదరించారు. ఏనుగు గుర్తుతో రంగంలోకి దిగిన అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మేడ్చల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. మేడ్చల్‌లో టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో రెబల్‌గా బరిలో దిగిన నక్కా ప్రభాకర్‌గౌడ్ బీఎస్పీ పార్టీ గుర్తుపై పోటీచేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిల గెలుపోటములలో నిర్ణయాత్మక శక్తిగా మారిన ప్రభాకర్.. చాపకింద నీరులా ప్రజల్లోకి చొచ్చుకెళుతున్నారు. మొదట్నుంచి మేడ్చల్‌లో సొంతవర్గాన్ని కూడగట్టిన ఆయన మాయవతితో బహిరంగ సభ నిర్వహించి బలాన్ని ప్రదర్శించారు. బీసీ కార్డును ప్రయోగించడం ద్వారా ఆయా వర్గాల్లో బీఎస్పీకి ఉన్న ఆదరణ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. జవహర్‌నగర్, మేడ్చల్ ప్రాంతాల్లో ఉత్తరాది ప్రాంత ఓటర్లు ఎక్కువగా కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు. షాద్‌నగర్‌లోనూ ఐరావతం షాద్‌నగర్ సెగ్మెంట్లోనూ అంబారీ సవారీ చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన వీర్లపల్లి శంకర్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తొలుత ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని నిర్ణయించుకున్న ఆయన చివరి నిమిషంలో జాతీయ పార్టీ గుర్తుతో పోటీకి దిగారు. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ అభ్యర్థిగా కదనరంగంలోకి దూకిన శంకర్ ముఖ్య పార్టీల అభ్యర్థులకు తీసిపోని విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేవలం ఈ మూడు నియోజకవర్గాలే గాకుండా ఎల్బీనగర్ మినహా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని సెగ్మెంట్ల బరిలో బీఎస్పీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో చిన్నా చితక పార్టీలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో బీఎస్పీ టికెట్ల కూడా గిరాకీ వచ్చింది. కాగా, మూడు స్థానాల్లో ప్రత్యర్థులను గట్టిగా ఢీకొంటున్న ఏనుగు.. ఇతర నియోజకవర్గాల్లో మాత్రం ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. కూటమికి తలనొప్పి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్‌ను ఆశించిన మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఏనుగెక్కారు. కాంగ్రెస్ టికెట్ రాకపోగా.. సీటును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడంతో నిరాశ చెందిన ఆయన బీఎస్పీ బీ–ఫారం దక్కించుకున్నారు. ఏనుగు గుర్తుపై పోటీచేస్తున్న మల్రెడ్డి కాంగ్రెస్ కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు దీటుగా ఆయన ప్రచారపర్వాన్ని కొనసాస్తుండడంతో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది. గత ఎన్నికల్లో ఆయన సోదరుడు రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ సారి ఆ ఓటు బ్యాంకేగాకుండా కాంగ్రెస్ శ్రేణులు కూడా కలిసివస్తాయని మల్రెడ్డి బ్రదర్స్ అంచనా వేస్తున్నారు. అంతేగాకుండా ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు కూడా గణనీయంగా ఉండడం అనుకూలం కానుందని భావిస్తున్నారు. -
కేసీఆర్ అప్పులు పెంచారు
సాక్షి, వికారాబాద్: రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాండూరులో సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాటాడారు. తెలంగాణ ప్రజల కలలను టీఆర్ఎస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని వదిలేసిన కేసీఆర్ రీ డిజైన్లకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఈ ప్రాంతానికి సాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఖర్చు మొదట్లో రూ.10 వేల కోట్లు ఉంటే.. రీడిజైన్ చేసి.. రూ.60 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తా మని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులు రూ.17 వేల కోట్లు ఉండగా, ప్రస్తుతం ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షల అప్పు ఉందని తెలిపారు. కానీ కేటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బంగారుమయమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ రూ.300 కోట్ల బంగళాలో విశ్రాంతి తీసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. చార్మినార్‌లో కలుపుతాం... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తాండూరు ప్రాంత ప్రజల, నిరుద్యోగుల ఆకాంక్షలను విరుద్ధంగా జిల్లాను జోగులాంబ జోన్లో కలిపి అన్యాయం చేశారన్నారు. ఈ ప్రాంతం కంది సాగుకు ప్రసిద్ధి పొందిందని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్న కంది బోర్డు ఏర్పాటు కలను తీరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ టౌన్ మంజూరుచేయగా, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శాటిలైట్ టౌన్‌కు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. తాండూరుకు బైపాస్ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయిందని విమర్శించారు. స్టోన్ పరిశ్రమ కారణంగా వెలువడుతున్న కాలుష్య నియత్రంణకు చర్చలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తాండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రులను కూడా అప్‌గ్రేడ్ చేసి, ఈఎస్ఐ దవాఖానా సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాత తాండూరులో ఫ్లైఓవర్ లేదా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పారు. నాపరాతి పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి వ్యాపారాన్ని దివాలాతీసే విధంగా మోదీ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. జిల్లాలోని కోట్‌పల్లి, శివసాగర్, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని వివరించా దొరల పాలన అంతం కావాలి రాష్ట్రంలో దొరల పాలన అంతం కావాలంటే ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. మన భూములు, నీళ్లు, నిధులు మనకు దక్కాలన్నారు. చండీయాగాలు చేస్తే ప్రజలు అభివృద్ధి చెందరని, ప్రజారంజకమైన పాలన సాగించాలని తెలిపారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... పాటనై వస్తున్నానమ్మో అంటూ గద్దర్ తాను రాసిన పాటలను ఆలపించి సభికులను ఉత్తేజపరిచారు. ఆయన పాట పాడుతున్న సమయంలో రాహుల్‌గాంధీ ఆసక్తిగా గమనించడం విశేషం. కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి కమీషన్లు.. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో పైసలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి, కమీషన్లు మాత్రం కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి వెళ్తున్నాయని టీజేఎస్ అధినేత, ఫ్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఏ ఒక్కడివల్లనో తెలంగాణ రాష్ట్రం రాలేదని, ఎంతోమంది త్యాగాలు, బలిదానాల కారణంగానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏడాదిలోగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగావకాశాల కోసం నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. -
‘పట్నం’లో పాగా ఎవరిదో!
ఇబ్రహీంపట్నం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల కలయిక ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ముఖ్యంగా నాలుగు పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్, మహాకూటమి(టీడీపీ), బీఎస్పీ, బీజేపీల మధ్య హోరాహోరీగా ఉంది. సీపీఎంకు నియోజకవర్గంలో కొంతమేర బలం ఉన్నా ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటీని తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 2,57,681 మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 20.14 శాతం ఎస్సీలు, 7.55 శాతం ఎస్టీలు ఉన్నారు. ఉపాధి ఆవకాశాలు తక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో అసంఘటిత కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అధికంగా ఉన్నారు. ఔటర్ రింగురోడ్డు, రాష్ట్రీయ, అంతర్గత రోడ్లు ఉన్నాయి. వివిధ రక్షణ, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. 2004 ఎన్నికల వరకు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ స్థానం నియోజకవర్గాల పునర్విభజనతో కందుకూరు, మహేశ్వరం మండలాలు విడిపోయాయి. నగర శివారులోని హయత్‌నగర్ మండలం రూరల్ గ్రామాలు (ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో) ఇందులో కలిశాయి. అనంతరం జనరల్‌గా మారింది. ఈనేపథ్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల కలబోతగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఏర్పడింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగానే జరిగాయి. 2009 ఎన్నికల్లో.... 2009లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో 1,96,880 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై గెలిచారు. మంచిరెడ్డి 9,216 ఓట్ల మెజార్టీతో విజయం సా«ధించారు. రెండుసార్లు గెలిచిన మంచిరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో 2,30,388 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.81 లక్షల ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 48,397 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మల్రెడ్డి రాంరెడ్డికి 37,341 ఓట్లు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన క్యామ మల్లేష్‌కు 36,865 ఓట్లు, టీఆర్ఎస్ నుంచి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డికి 21,779 ఓట్లు వచ్చాయి. మంచిరెడ్డి 11,056 ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయదుందుభి మోగించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. హ్యాట్రిక్‌పై మంచిరెడ్డి గురి రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన మంచిరెడ్డి ఈసారి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఈసారి ఆయన టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ పథకాలే తనను గెలుస్తాయని చెబుతున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,57,681 తాజా జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2,57,681 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అత్యధికంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 1,14,739 మంది ఓటర్లున్నారు. గత పదేళ్లలో దాదాపు 10 వేల ఓట్లు పెరిగాయి. పథకాలపైనే మంచిరెడ్డి ఆశలు అధికార పార్టీ కావడం, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నమ్ముకొని తాజామాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జనాల్లోకి వెళ్తున్నారు. మరోసారి తనను గెలిపించాలని కోరుతున్నారు. సర్కారు ప్రవేశపెట్టిన పథకాలే శ్రీరామరక్ష అని, అవే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా శివన్నగూడ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి ఈ ప్రాంత భూములను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇస్తున్నారు. సర్కారు వైఫల్యాలే అస్త్రంగా సామ.. ముందుకు మహాకూటమి అభ్యర్థి సామ రంగారెడ్డి(టీడీపీ) ప్రభుత్వ వైఫల్యాలు, తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై జనాల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆక్రమాలు, భూదందాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని చెబుతున్నారు. అసంతృప్తుల అండతో మల్రెడ్డి.. గతంలో మలక్‌పేటకు పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అవినీతి బాగోతం బయటపెడతానంటూ ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ అసంతృప్తి నేతలందరూ మల్‌రెడ్డికి మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పథకాలే అస్త్రంగా.. కేంద్రంలో ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి వచ్చిన పథకాలను వివరిస్తున్నారు బీజేపీ అభ్యర్థి అశోక్‌గౌడ్. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. -
చేవెళ్లలో నువ్వా.. నేనా!
చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్టుగా సాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నియోజకవర్గం 1952లో ఏర్పడిన నాటినుంచి ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సెంటిమెంటుగా మారిన ఈ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. గతంలో తొమ్మిది పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టిన నియోజకవర్గం ప్రజలు మరోసారి గెలిపిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అస్త్రంగా టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం ప్రయత్నిస్తోంది. ఎవరు ఎన్ని సార్లు గెలుపు కాంగ్రెస్ – 9 టీడీపీ – 4 జనతాపార్టీ – 1 ఇండిపెండెంట్ – 1 ప్రస్తుత ఓటర్ల సంఖ్య మొత్తం – 2,21,887 పురుషులు – 1,13,972 మహిళలు – 1,07,893 ఇతరులు – 22 పోలింగ్ కేంద్రాలు – 292 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ స్థానంగా ఉన్న చేవెళ్ల 2009లో ఎస్సి రిజర్వుడుగా మారింది. దీంతో 25 సంవత్సరాలనుంచి అధికారంలో ఉన్న పట్లోళ్ల కుటుంబం మరోస్థానానికి బదిలీ కావాల్సి వచ్చింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాలె యాదయ్యను రంగంలోకి దించగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా చేసిన అనుభవం ఉన్న కెఎస్.రత్నంను తెలుగుదేశంపార్టీ పోటీకి నిలిపింది. ఈపోటీలో టీడీపీ అభ్యర్థి కెఎస్ రత్నం గెలుపొందారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలో కేఎస్ రత్నం టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్‌పార్టీ నుంచి కాలె యాదయ్య రెండో సారి పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు జైకొట్టారు. అది కూడా తెలంగాణవాదంతో ప్రత్యేక రాష్ట్రంలోని అధిక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు పట్టం కడితే.. ఇక్కడ చేవెళ్ల గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా అని నిరూపించారు. గెలుపొందిన కాలె యాదయ్య కాంగ్రెస్‌పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేఎస్. రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీకి దిగారు. బలపడుతున్న బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి హిమాయత్‌నగర్ మాజీ సర్పంచ్ కంజర్ల ప్రకాశ్ పోటీచేస్తున్నారు. ఇయన గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీకి నియోజకవర్గంలో బలమైన నాయకత్వం లేకపోవటంతో ప్రధాన పార్టీగా పోటీలో ఉంటున్నా గెలుపు సాధించలేకపోతుంది. నియోజకవర్గంలోక్యాడర్ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. మరి ఇది వారికి ఏ స్థాయిలో కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే. ఇక మిగిలిన ఆరు మందిలో ఒక్కరు జుట్టు భీమయ్య స్వతంత్ర అభ్యర్థి కాగా మిగిలిన ఐదు మందిలో ఒక్కరు బీఎస్పీ పార్టీ నుంచి కె. సునిల్‌కుమార్, జైస్వరాజ్పార్టీ నుంచి ఎ. నర్సింహులు, బహుజన రాజ్యం పార్టీ నుంచి ఉప్పరి శ్రీనివాస్, అలిండియా సమతాపార్టీ నుంచి జి. చిన్న మానిక్యం, రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా నుంచి రవీందర్ మాలలు చేవెళ్ల అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలమధ్యనే పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సెంటిమెంటే ఆయుధంగా కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం సెంటిమెంటు ప్రాంతమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భావించారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమమైనా, ప్రచారకార్యక్రమైనా , చివరకు ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైనా చేవెళ్లనుంచి ప్రారంభించడం ఆనవాయితీగా మార్చారు. అదే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా పాటిస్తూ ఎన్నికల బస్సు యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించింది. చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ హోంశాఖ మంత్రి సబితారెడ్డికి గట్టి క్యాడర్ ఉంది. ఆమె అదేశాలను పాటించి కాంగ్రెస్‌పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ఉన్న కేఎస్ రత్నం సైతం తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను టీఆర్ఎస్లో ఉండగానే తయారు చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్‌లోకి మారటం, ఆయన క్యాడర్‌కూడా కాంగ్రెస్‌లోకి రావటంతో మరింత బలం చేకూరింది. సంక్షేమ పథకాలే అస్త్రంగా టీఆర్ఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కాలె యాదయ్య నాలుగున్నరేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారినప్పుడుఆయనతోపాటు కొంత మంది ప్రజాప్రతినిధులు మాత్రమే టీఆర్ఎస్లోకి మారారు. గ్రామాల్లో ఉన్న పూర్తిస్థాయి కాడ్యర్ మారలేదు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొత్తగా టీఆర్ఎస్ క్యాడర్‌ను ఇప్పుడిప్పుడే తయారు చేసుకున్నారు. ఇతర పార్టీల నుంచి చేరుతున్నవారితో పార్టీకి బలం పెరుగుతోందని టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రజాధరణ ఉందని మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే లక్ష్యంగా పార్టీ క్యాడర్ మొత్తం పనిచేస్తోంది. సైలెంట్‌గా దూసుకుపోతున్న బీజేపీ భారతీయ జనతాపార్టీ నియోజకవర్గంలో సైలెంట్‌గా ప్రచారంలో దూసుకుపోతున్నది. అభ్యర్థి కంజర్ల ప్రకాశ్ గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని వేగవంతం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రచారం చేసే పనిలో ఉన్నారు. ప్రదాన మంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పథకాలే పార్టీకి అండగా నిలుస్తాయని అదేస్థాయిలో అభివృద్ది జరుగుతుందని బీజేపీని గెలపించాలని కోరుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పూర్థిస్థాయిలో క్యాడర్ లేకపోయినా ప్రజలకు కేంద్రం అందిస్తున్న పథకాలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. కనిపించని ఇతర పార్టీల ప్రచారం ప్రధాన పార్టీలు మినహాయిస్తే పోటీలో ఉన్న మిగత ఆరుగురు అభ్యర్థుల ప్రచారం ఎక్కడా కనిపించటం లేదు. ఒక్క బీఎస్పీ అభ్యర్థి కె. సునిల్‌కుమార్, బహుజన రాజ్యం పార్టీ అభ్యర్థి ఉప్పరి శ్రీనివాస్‌లు ప్రచారం కొనసాగిస్తున్నారు. మిగతా అభ్యర్థుల ప్రచారం బహిరంగంగా ఎక్కడ కనిపించటం లేదు. నియోజకవర్గం వివరాలు నియోజకవర్గంలో చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్, నవాబుపేట మండలాలు ఉన్నాయి. నియోజకవర్గం 2009లో ఎస్సీ నియోజకవర్గంగా మారింది. షాబాద్, నవాబుపేట మండలాల్లో ఎక్కువగా ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉండటంతో నియోజకవర్గాన్ని ఎస్సీకి రిజర్వుడు చేశారు. ఎస్సీ జనాభా తరువాత స్థానం బీసీలదే. బీసీ ఓటర్లు సైతం రెండో స్థానంలో ఉండటంతో బీసీ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. నియోజకవర్గం హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉండటంతోపాటు నగర వాతావారణానికి ప్రజలు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. నియోజకవర్గంలోని మొయినాబాద్‌లో చిల్కూరి బాలాజీ దేవాలయం ఎంతో పేరుగాంచింది. ప్రశాంతమైన వాతవారణంలో ఎలాంటి పొల్యూషన్ లేని ప్రాంతంగా చేవెళ్ల నియోజకవర్గం ఉంది. -
మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి అచ్చొచ్చిన 6666
ఇబ్రహీంపట్నం రూరల్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన కారును సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. హోండసీటీ 6666 నెంబరు గల కారులో ప్రచారం చేస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఈ కారులోనే ప్రచారం చేసి గెలుపొందారు. మళ్లీ అదే సెంటిమెంట్ పాటిస్తున్నారు. కొత్తకార్లు ఉన్నప్పటికీ ఆయన పాత కారునే వాడుతున్నారు. అదేవిధంగా ప్రచార పత్రాల్లో, వాల్‌పోస్టర్లలో ఒక పక్కన ఎర్రబొట్టును వాడటం కూడా ఆయన ప్రత్యేకతట. -
మై ఓట్.. నాట్ ఫర్ సేల్!
షాద్‌నగర్ టౌన్: ‘మై ఓట్ నాట్ ఫర్ సేల్’ అనే చైతన్య నినాదం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఏ ముంది ప్రత్యేకత అనుకుంటున్నారా ఇది ఎన్నికల సంఘం రూపకల్పన చేసినట్లు ముద్రించి ఉంది. ఈ నినాదం అధికారిక పిలుపు అయితే ఇదొక శుభపరిణామం. ఓటు కోసం ఐదు వందల రూపాయలు ఇస్తుండగా తిరస్కరిస్తున్నట్లు అర్థం వచ్చేలా తీర్చిదిద్దడంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. చూసిన చాలా మంది ఇతర వ్యక్తులకు సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్నారు. అంతేకాకుండా అందరి దృష్టిని ఆకట్టుకోవడానికి చాలా మంది వాట్సాప్ స్టేటస్ ఫొటో ఉపయోగిస్తున్నారు. ఇలాంటి నినాదాలు అందరిని ఆకట్టుకోపోయినా కొందరైనా నీతి, నిజాయితీగా ఓటు వేసేలా దోహదపడే ఆస్కారం కచ్చితంగా ఉంటుంది. ప్రచార మాధ్యమాల్లో ప్రమాణ సందేశాలు .... అన బడే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, నోటుకు, మధ్యానికి, కులానికి, మతానికి సంక్షేమ పథకాలకు లొంగకుండా విచక్షణ జ్ఞానంతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటానని ప్రమాణం చేస్తున్న సందేశాలు ప్రచార మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటి తరహా సందేశాలు ప్రజాస్యామ్యానికి ఎంతో అవసరం అనే అభిప్రాయాలను చాలా మంది మేధావులు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి ఉద్యోగి ఓటేసేలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోస్టల్ బ్యాలెట్‌పై యంత్రాంగం నిశిత దృష్టి సారించింది. ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న ఉద్యోగులు, సిబ్బంది వంద శాతం తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. గత ఎన్నికల్లో 26.18 శాతం మందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. ఇంత తక్కువ శాతం మంది ఓటేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న యంత్రాంగం.. ఈసారి ప్రతిఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ విధానంపై దాదాపుగా అవగాహన కల్పించారు. మైక్రోఅబ్జర్వర్లకు మాత్రం వచ్చేనెల 2వ తేదీన తర్ఫీదు ఇవ్వనున్నారు. పది వరకు అవకాశం.. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల విధుల్లో సుమారు 35 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది, ఇతరులు పాల్గొనున్నారు. వీరంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు ప్రతి నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. నిర్దేశిత ఫార్మాట్లో ఫారంలను పూర్తి చేసి ఇక్కడ ఉన్న డ్రాప్ బాక్స్‌లో బ్యాలెట్‌ను వేయాల్సి ఉంటుంది. ఈనెల 27 నుంచి ఫారం–12లను (పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు పత్రం) ఉద్యోగులకు అందజేస్తున్నారు. వచ్చేనెల 3వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను ఇవ్వనున్నారు. నిర్దేశిత ఫార్మాట్లో పూర్తిచేసి వచ్చేనెల 10వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్‌ను డ్రాప్ బాక్స్‌లో వేయొచ్చు. లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా ఉద్యోగుల ఓటు హక్కు ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ చిరునామాకు పంపొచ్చు. ఇప్పటివరకు 1,545 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. -
నీట్‌గా ఉంటే ఎక్కువ పైసల్!
సాక్షి,రాజేంద్రనగర్: ‘ఏం యాదన్న.. ఈమధ్య రోజూ టిక్..టాక్ తయారైపోతున్నావు. ఏంది సంగతి. ఆ ఏమి లేదు నర్సన్న. కూలీ అయితే రోజూ ఎలాగో అలా... పొయ్యేటొళ్లం. ఇప్పుడు ఎన్నికలు కదా. అందుకే ఉదయమే తానం చేసి, ఇస్త్రీ చేసిన బట్టలు ఏసుకొని ప్రచారానికి పోతున్న. గిట్ల మంచిగ తయారై పోతే నాలుగు డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే టిక్.. టాక్‌గా తయారై పోతున్నా. ’ఇదీ ప్రస్తుత పరిస్థితి. ఎన్నికల సీజన్ కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా బలగం చూపించుకుంటున్నారు. దీంతో నేతలు మహిళలతో పాటు పురుషులను రప్పించుకుంటున్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ ప్రాంతాల్లో పని చేస్తే కూలీలను సైతం తమ వెంట తీసుకువెళ్తున్నారు. నేరుగా వారి వద్దకు వెళ్లకుండా వారి తరఫున ఉన్న కాంట్రాక్టర్లు, ఏజెంట్లు, మేస్త్రీలు వారిని ఆశ్రయిస్తున్నారు. మామూలుగా వెంట తిరిగే వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు డబ్బును ఇస్తున్నారు. ఓ మోస్తారు నాయకులుగా కనిపించేందుకు వారిని ప్రతిరోజు నీట్‌గా రెడీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉన్న వారికి ఇతరుల కంటే డబ్బు ముట్టజెబుతున్నారు. -
ప్రచార సందడి
సాక్షి, నెట్వర్క్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో బుధవారం ప్రచార సందడి నెలకొంది. మంత్రి కేటీఆర్ వివిధ ప్రాంతాల్లో రోడ్డు షో, ప్రచారం నిర్వహించారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు యువత భారీగా తరలివచ్చింది. రాములమ్మ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కేటీఆర్ రోడ్డుషోలకు కార్యకర్తలు, జనం భారీగా హాజరయ్యారు. తాండూరులో హెలికాప్టర్ దిగి సభకు వస్తున్న రాములమ్మ తాండూరులో భవనాలు ఎక్కి విజయశాంతి ప్రసంగం వింటున్న జనం చేవెళ్లలో కూటమి అభ్యర్థి రత్నంను గెలిపించాలని చెబుతున్న రాములమ్మ మొయినాబాద్ రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్ మొయినాబాద్ రోడ్ షోకు హాజరైన ప్రజలు -
రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓటు గల్లంతు
రాజేంద్రనగర్: పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటును వినియోగించుకునేందుకు వచ్చిన ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓటు గల్లంతవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. రాజేంద్రనగర్ కృష్ణానగర్ హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన రామకృష్ణ చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా ఆయనకు విధులను కేటాయించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి బుధవారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిషన్‌బాగ్ గురునానక్ స్కూల్లో బుధవారం సంబంధించిన కార్యక్రమం జరిగింది. రామకృష్ణ తన ఓటును వినియోగించుకునేందుకు ఓటర్ కార్డు డబ్ల్యూపీకే 2581933తో పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది లిస్టులో పరిశీలించి రామకృష్ణ ఓటు లేదని నిర్ధారించారు. దీంతో ఆశ్చర్యానికి గురైన రామకృష్ణ మరోసారి లిస్టు అంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక వెనుతిరిగాడు. ఒక అధికారి పేరు ఓటర్ లిస్టులో లేకపోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
వ్యూహాల్లో అ‘ద్వితీయం’
షాద్‌నగర్ టౌన్: ఎన్నికల్లో విజయతీరం చేరుకోవాంటే ఎత్తుకు పైఎత్తులు వేయాలి. ప్రత్యర్థులు వేసిన ఎత్తులను చిత్తు చేయాలంటే రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టాల్సి ఉంటుంది. ఎన్నికలు దగ్గరుపడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వాటిని నేతలు పసిగట్టి అప్రమత్తం అయితే ఫలితాన్ని సునాయసంగా అందుకోవచ్చు. అందుకు తగ్గట్లు నేతలు పావులు కదపాలి. తద్వారా ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ప్రతి గల్లీకి వెళ్లి చక్రం తిప్పలేరు. దీనికోసం ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతలు అద్వితీయమైన వ్యూహాలు రచిస్తూ పార్టీతోపాటు అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధాన అనుచరులే అండ.. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి పార్టీలో పదుల సంఖ్యలో ముఖ్య నాయకులు ఉంటారు. వీరే పార్టీ అభ్యర్థులకు ప్రధాన అనుచరులుగా ఉంటూ వారికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తుంటారు. వీరు కార్యకర్తలను ఏకం చేయడం, ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మామూలు సమయాల్లో కంటే ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర అన్ని పార్టీల్లో కీలకంగా మారుతుంటుంది. ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రచించడం.. గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకుల ఎత్తులకు పై ఎత్తులు వేసి పావులు కదుపుతున్నారు. బరిలో ఉండే తమ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకుల సమాచారాలను చేరవేస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. అనుక్షణం.. అప్రమత్తం అనుక్షణం ప్రత్యర్థి పార్టీ నాయకుల కదలికలను గమనిస్తూ వారి కోటలను బద్దలు కొట్టి తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ద్వితీయ శ్రేణి నేతలు పావులు కదుపుతుంటారు. పార్టీ బలాన్ని పెంచడంతో పాటుగా ఎదుటి పార్టీలో అలకబూనిన నేతలను, అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి అక్కున చేర్చుకొని సరికొత్త వ్యూహాలను అమలు చేసే బాధ్యతను నేతలు తమ భుజాలపై వేసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడి ఓట్లు వేయించి ఎన్నికల్లో ఆధిపత్యం కొనసాగేలా దూసుకెళ్తున్నారు. అన్ని తామై వ్యవహరిస్తున్న ద్వితీయ శ్రేణినేతలు ఆయా గ్రామాల్లో ముందుకు సాగుతున్నారు. గెలుపోటముల్లో కీలక పాత్ర ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల గెలుపోటముల్లో రెండో శ్రేణి నేతలది కీలక పాత్ర. ఎన్నికల నేపథ్యంలో ప్రతిచోట నాయకులు పార్టీలు మారడం, కొత్త వారిని పార్టీల్లోకి చేర్చడంలో అభ్యర్ధుల ప్రధాన అనుచరులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే ఎన్నికలు జరిగే సమాయానికి ఓటర్లను ఆకట్టుకొని వారి ద్వారా ఓట్లు వేయించే విషయంలోనూ వీరిపాత్ర అద్వితీయం. ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానంగా ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లు పాలించాలంటే ఈ నేతలే కీలకంగా మారుతున్నారు. -
కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
సాక్షి, చేవెళ్ల: ‘దొరా.. కేసీఆర్.. ఇదేంది అన్నా.. తెలంగాణ వస్తే ఏమో చేస్తావని అనుకున్నాం కానీ, ఏమి చేయాలేదు’ అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏదో చేస్తావని నమ్మిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. దళితబిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పావా లేదా అన్నా... గుర్తు తెచ్చుకోండి అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబ సభ్యులంతా పడి అమ్మా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని కేసీఆర్ అడిగారన్నారు. ప్రజలకు దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి.. లోపల తననే ముఖ్యమంత్రి చేయమని అడగటంపై సోనియా ఆశ్చర్యపోయారని, దీంతో సోనియా.. దళితబిడ్డనే ముఖ్యమంత్రిని చేయాలి నేను మిమల్ని ముఖ్యమంత్రి చేయను, నీవు నా పార్టీలో చేరవద్దు అని పంపించారని విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని, అలాంటి దేవతను విమర్శించే హక్కు, స్థాయి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, కవితకు లేదన్నారు. ఇంటింటికో ఉద్యోగం, దళితులకు భూమి, డబుల్బెడ్రూం ఇళ్లు అన్ని ఇచ్చి హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు ఆశీర్వదించాలని సభలు పెడుతున్నారని, మళ్లీ ప్రజలు ఓటు వేస్తారనే భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాపీ, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తుందని, ఏడాదికి పేదలకు ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుందన్నారు. 5లక్షల వరకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అనుకున్నామని, జిల్లాకు ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా రాలేదన్నారు. అప్పుడు ఓట్లు కోసం వచ్చాడు, ఇప్పుడు ఓట్ల కోసం వస్తాడని విమర్శించారు. ఈ ప్రాంతానికి ప్రాణహితను అడ్డుకున్నాడు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల తీసుకొస్తామని చెప్పాడు. ఇప్పుడు దానిని పాలమూరు ఎత్తిపోతల అని మార్చాడన్నారు.ఆ నీళ్లు వస్తాయో రావో తెలియదన్నారు. యువతకు ఉద్యోగాలు రాలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కేస్ రత్నంను అప్పుడు కొన్ని దుష్టశక్తులు కలిసి ఓడించాయని, ఈసారి భారీ మోజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సభలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి పి.వెంకటస్వామి, ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ అగిరెడ్డి, మహిళా నాయకురాలు సదాలక్ష్మీ, నాయకులు గోపాల్‌రెడ్డి, వెంకటేశంగుప్తా, వసంతం, మధుసూదన్‌గుప్తా, రవికాంత్‌రెడ్డి, శర్వలింగం, శ్రీనివాస్‌గౌడ్, టేకులపల్లి శ్రీను, శ్రీదర్‌రెడ్డి, కె.రామస్వామి, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, రఘువీర్‌రెడ్డి, విఠలయ్య, శివానందం, ప్రకాశ్‌గౌడ్, శంకర్, ప్రభాకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డిలో పారుతున్న డబ్బు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికలంటేనే డబ్బు.. డబ్బులున్న నేతలకే టికెట్లు.. నీళ్లలాగా డబ్బులు ఖర్చు పెడితేనే నలుగురు వెంట తిరిగేది.. ఏంటీ డబ్బు గోల అనుకుంటున్నారా..? రాజధాని శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఒక్కో అభ్యర్థి ప్రచార వ్యయం సగటున రూ.20 కోట్లు దాటుతుందంటే ముక్కున వేలేసుకోవాల్సిందే! కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.120 కోట్ల దాకా కూడా ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అంచనా వేసుకోవచ్చు. రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బు వ్యయం చేసే నియోజకవర్గాల్లో జిల్లాలోని రెండు సెగ్మెంట్లను ఎన్నికల సంఘమే స్వయంగా గుర్తించింది. ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. ఎన్నికల సంఘం లెక్కలు అలా ఉంటే.. బుధవారం జరిగిన ఐటీ సోదాల్లో కొడంగల్ ప్రధాన పార్టీ అభ్యర్థి బంధువు ఫామ్‌హౌజ్‌లో కోట్ల రూపాయలు దొరికాయనే వార్తలు జిల్లాలో డబ్బుల చర్చకు కారణమవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లాలో ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా డబ్బు గోలే. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నుంచి నాయకులను ప్రసన్నం చేసుకునేంతవరకు, పోస్టర్లు, కరపత్రాల నుంచి డిజిటల్ ప్రచారం వరకు నిధులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చుకు అధికారిక లెక్కలేమీ లేకపోయినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చలు, అంచనాలను బట్టి జిల్లాలో ఈ ఎన్నికలకు రూ.450 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇది కేవలం అంచనా మాత్రమే. ఈ సెగ్మెంట్లపై ఈసీ నిఘా ఇబ్బడిముబ్బడిగా ధనప్రవాహం జరిగే అవకాశమున్నట్లు గుర్తించిన శాసనసభ నియోజకవర్గాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షాద్‌నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలుండగా.. వికారాబాద్‌లో కొడంగల్, తాండూ రును గుర్తించింది. ఈ సెగ్మెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది. మరోవైపు సంపన్నులు పోటీ చేస్తున్న శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం స్థానాలపై డేగ కన్ను వేయాలని సూచించింది. ఈ నియోజకవర్గాల పరిధిలో జరిగే బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా వ్యవహారాలను నిశితంగా పరిశీలించాలని నిర్దేశించింది. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి సోదాలు నిర్వహించడం ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీచేసింది. పరి‘మితి మీరుతోంది’ వ్యయ పరిమితిని రూ.28 లక్షలకే కట్టడి చేసినా.. ఇవి కేవలం అధికారిక చిట్టా పద్దులకే పరిమితమవుతోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ధన ప్రవాహం రెట్టింపయింది. చావో.. రేవో తేల్చుకోవాలని భావిస్తున్న ఉద్ధండులు ఈసారి బరిలో ఉండడంతో ఖర్చుకు వెరవడంలేదు. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేసిన మరుక్షణమే టీఆర్ఎస్ అభ్యర్థులు రణక్షేత్రంలోకి వెళ్లారు. దీంతో మొదటి రోజు నుంచే జేబు చిలుము వదిలించుకోవాల్సిన పరిస్థితి తలెత్తెంది. ఇక నామినేషన్ల పర్వం మొదలు కావడం.. ప్రత్యర్థులు కూడా ఖరారు కావడంతో దూకుడు పెంచాల్సి వచ్చింది. వీరి పరిస్థితి ఇలా ఉంటే సమరాంగణంలోకి ఆలస్యంగా వచ్చామని ఆ వేదనతో ఉన్న ప్రజా కూటమి అభ్యర్థులు కూడా ఇతర పార్టీలకు దీటుగా ఖర్చు చేస్తున్నారు. సందడే.. సందడి ముందస్తు ఎన్నికలకు నగారా మోగడమే తరువాయి గ్రామాల్లో పండగ వాతావరణం ఏర్పడింది. టికెట్ల కోసం బలప్రదర్శన, సమావేశాలు, ఊరేగింపులు పేరిట రోజుకో నేత ‘సమ్‌తృప్తి’ పరుస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. ప్రచార పర్యానికి పాల్గొనే శ్రేణులకు ప్రతి రోజూ విందు, మందు ఏర్పాటు చేస్తున్న అభ్యర్థులు.. దిగువ శ్రేణి నేతల గొంతెమ్మ కోరికలను తీర్చడానికి భారీగా నగదును ఆఫర్ చేస్తున్నారు. కేవలం సొంత పార్టీ నాయకులే గాకుండా ప్రత్యర్థి శిబిరాలను కూడా బలహీనపరిచేందుకు తృణమో ఫణమో ముట్టజెప్తున్నారు. ఇవేగాకుండా కుల సంఘాలు, యువజన సంఘాల డిమాండ్లను నెరవేర్చడానికి తలూపుతున్నారు. క్రికెట్ కిట్లు, వంట సామగ్రి, టెంట్లు, కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, గోపురాలకు హామీలు ఇస్తూ ముందస్తుగా కొంత సమర్పించుకుంటున్నారు. పోలింగ్‌కు ఇంకా వారం రోజుల గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో ఎన్నికల వ్యయం కాస్తా తారస్థాయికి చేరే అవకాశముంది. -
ఎన్నికలు.. మద్యం.. మాంసం..
సాక్షి, రంగారెడ్డి : ఎన్నికల ప్రచారం జోరు మీదుంది. ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అలిసిపోతున్న నాయకులు, కార్యకర్తలు సేద తీరడానికి చల్లని బీరు, మద్యం కోసం వైన్స్‌ల బాటపడుతున్నారు. అభ్యర్థులు సైతం తమ అనుచరులు.. పార్టీ శ్రేణులు చేజారిపోకుండా మందుతో కూడిన విందులు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మద్యం మాత్రమే కాకుండా ప్రతిరోజు మాంసాహారం తప్పనిసరి అయింది. దీంతో మార్కెట్లో ఇప్పుడు మద్యం దుకాణాలతో పాటు చికెన్, మటన్ షాపులు సైతం కళకళలాడుతున్నాయి. దీంతో పనిలో పనిగా వంటలు, కేటరింగ్ చేసే వాళ్లకు మంచి చేతి నిండా పని దొరుకుతోంది. కడుపు నిండా తిండి.. ఎన్నికల ప్రచారం ప్రారంభంతో హోటళ్ల వద్ద సందడి పెరిగిపోయింది. చాయ్ తాగుతూ బాతాకానీ కొట్టే వారు కొందరైతే.. అభ్యర్థుల వెంట తిరిగి అలిసిపోయిన వారు ఘుమఘుమలాడే బిర్యానీల కోసం హోటళ్ల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో హోటళ్లలో బిర్యానీ సైతం దొరకడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో ఇప్పుడు బిర్యానీ దొరకడం కొంత కష్టంగానే మారిందని చెప్పవచ్చు. -
ఎన్నికల వేళ.. చేతినిండా ‘పని’
ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇది కొందరికి ఉపాధిమార్గంలా మారింది. మరో పదిరోజుల పాటు చేతినిండా దొరుకుతుంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొన్ని వ్యాపారులు మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థుల జేబు ఖాళీ అవుతుండగా.. కొందరు ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ‘నాలుగు రాళ్లు’ పోగేసుకుంటున్నారు సాక్షి,శంషాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం అడ్డాకూలీలకు డిమాండ్ బాగా పెరిగింది. భవన నిర్మాణ కార్మికులుగా పనిచే సే వీరు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోతున్నారు. పొద్దంతా చేమటోడిస్తే వచ్చే దినసరి వేతనం కన్నా అభ్యర్థుల వెంట కొన్ని గంటలు తిరిగి ప్రచారం చేస్తే వచ్చే సొమ్ముతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా దొరుకుతుండగా ఎన్నికల ప్రచారానికే ‘జై’ కొడుతున్నారు. దీంతో ఇప్పటికే ఆయా పార్టీలు తమ ప్రచారానికి వీరిని ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు. వీరు నేరుగా ఉదయం లేవగానే ఆయా అభ్యర్థి ఇళ్లకు వెళ్లి అక్కడే అల్పాహారం పూర్తి చేసుకుని ప్రచారానికి వెళ్తున్నారు. ప్రతిరోజు వీరికి రూ. 500 వందల నుంచి 700 వందల వరకు నేతలు చెల్లిస్తున్నారు. కళాకారులు ధూంధాం ఎన్నికల ప్రచారంలో కళాకారులది కీలక పాత్ర. గొంతెత్తి వీరు పాడే పాటలకు ప్రచారానికి వన్నె తెస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తక్కువ సంఖ్యలో ఉండే కళాకారులు అభ్యర్థులకు దొరకడమే కష్టంగా మారింది. వారిని వెతికి పట్టుకునే పనిలో ఆయా పార్టీల నేతలు అష్టకష్టాలు పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం వీరికి మంచి డిమాండ్ ఉంది. మిగతా సమయాల్లో ఖాళీగా ఉండే కళాకారుల బృందాలు ఇప్పుడు బీజీబీజీగా మారి డబ్బులు సంపాదించుకుంటున్నారు. పరిమళిస్తున్న పూల దుకాణాలు బరిలో నిలిచిన అభ్యర్థి ఇంటి నుంచి ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు అభిమానులు వారిని పూలదండలతో ముంచెత్తుతున్న పరిస్థితి నెలకొంది. సన్మానాలకు సత్కారాలకు పుష్పగుచ్చాలు.. పూలదండలు తప్పనిసరి. దీంతో పూలదండలు తయారు చేసి అమ్మేవారికి చేతినిండా పని దొరకవడంతో గిరాకీ అమాంతం పెరిగిపోయింది. యాభై రూపాయల దండ కాస్త డెబ్బై నుంచి వంద వరకు విక్రయిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో వ్యాపారి కనీసం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు పూల విక్రయాలు జరుపుతున్నాడు. డిజిటల్ మార్కెటింగ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అనిమార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రచారంలో ప్రస్తుతం కీలకభూమిక పోషిస్తున్న సామాజిక మాధ్యమాలవైపు చూస్తున్నారు. మంచి కంటెంట్‌తో ఫేస్బుక్, ట్విట్టర్లలో ప్రచారం చేసి పెట్టడానికి డిజిటల్ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో డిజిటల్ మార్కెటింగ్ చేసే వారికి చేతినిండా పనిదొరుకుతోంది. ట్రావెల్స్‌కు డిమాండ్ ట్యాక్సీలు.. ట్రావెల్స్ అన్ని కూడా ఇప్పుడు బిజీగా మారిపోయాయి. ప్రచారానికి నియోజకవర్గ స్థాయిలో తిరుగుతున్న సమయాల్లో పార్టీల అనుచరగణాన్ని తరలించేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతల బహిరంగ సభలు నియోజకవర్గ పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ ఏర్పాటు చేసిన సమయాల్లో వాహనాలు దొరికే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పవచ్చు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ ‘స్టీరింగ్’ నిండా పని దొరికింది.