ఇబ్రహీంపట్నం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల కలయిక ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ముఖ్యంగా నాలుగు పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్, మహాకూటమి(టీడీపీ), బీఎస్పీ, బీజేపీల మధ్య హోరాహోరీగా ఉంది. సీపీఎంకు నియోజకవర్గంలో కొంతమేర బలం ఉన్నా ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటీని తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 2,57,681 మంది ఓటర్లు ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం 20.14 శాతం ఎస్సీలు, 7.55 శాతం ఎస్టీలు ఉన్నారు. ఉపాధి ఆవకాశాలు తక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో అసంఘటిత కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అధికంగా ఉన్నారు. ఔటర్ రింగురోడ్డు, రాష్ట్రీయ, అంతర్గత రోడ్లు ఉన్నాయి. వివిధ రక్షణ, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. 2004 ఎన్నికల వరకు ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న ఈ స్థానం నియోజకవర్గాల పునర్విభజనతో కందుకూరు, మహేశ్వరం మండలాలు విడిపోయాయి. నగర శివారులోని హయత్‌నగర్ మండలం రూరల్ గ్రామాలు (ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో) ఇందులో కలిశాయి. అనంతరం జనరల్‌గా మారింది. ఈనేపథ్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల కలబోతగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఏర్పడింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగానే జరిగాయి.
2009 ఎన్నికల్లో....
2009లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో 1,96,880 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై గెలిచారు. మంచిరెడ్డి 9,216 ఓట్ల మెజార్టీతో విజయం సా«ధించారు.
రెండుసార్లు గెలిచిన మంచిరెడ్డి
2014లో జరిగిన ఎన్నికల్లో 2,30,388 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.81 లక్షల ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 48,397 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మల్‌రెడ్డి రాంరెడ్డికి 37,341 ఓట్లు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన క్యామ మల్లేష్‌కు 36,865 ఓట్లు, టీఆర్‌ఎస్ నుంచి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డికి 21,779 ఓట్లు వచ్చాయి. మంచిరెడ్డి 11,056 ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయదుందుభి మోగించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
హ్యాట్రిక్‌పై మంచిరెడ్డి గురి
రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన మంచిరెడ్డి ఈసారి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఈసారి ఆయన టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే ధీమాతో ఉన్నారు. టీఆర్‌ఎస్ పథకాలే తనను గెలుస్తాయని చెబుతున్నారు.
మొత్తం ఓటర్ల సంఖ్య 2,57,681
తాజా జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2,57,681 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అత్యధికంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 1,14,739 మంది ఓటర్లున్నారు. గత పదేళ్లలో దాదాపు 10 వేల ఓట్లు పెరిగాయి.
పథకాలపైనే మంచిరెడ్డి ఆశలు
అధికార పార్టీ కావడం, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నమ్ముకొని తాజామాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జనాల్లోకి వెళ్తున్నారు. మరోసారి తనను గెలిపించాలని కోరుతున్నారు. సర్కారు ప్రవేశపెట్టిన పథకాలే శ్రీరామరక్ష అని, అవే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా శివన్నగూడ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి ఈ ప్రాంత భూములను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇస్తున్నారు.
సర్కారు వైఫల్యాలే అస్త్రంగా సామ.. ముందుకు
మహాకూటమి అభ్యర్థి సామ రంగారెడ్డి(టీడీపీ)
ప్రభుత్వ వైఫల్యాలు, తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై జనాల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆక్రమాలు, భూదందాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని చెబుతున్నారు.
అసంతృప్తుల అండతో మల్‌రెడ్డి..
గతంలో మలక్‌పేటకు పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అవినీతి బాగోతం బయటపెడతానంటూ ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. అయితే, అధికార టీఆర్‌ఎస్ అసంతృప్తి నేతలందరూ మల్‌రెడ్డికి మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తున్నారు.
కేంద్ర పథకాలే అస్త్రంగా..
కేంద్రంలో ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి వచ్చిన పథకాలను వివరిస్తున్నారు బీజేపీ అభ్యర్థి అశోక్‌గౌడ్. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment