పల్లె పాలన నుంచి అసెంబ్లీకి.. | Promotion Village To Assembly Ruling | Sakshi
Sakshi News home page

పల్లె పాలన నుంచి అసెంబ్లీకి..

Published Thu, Nov 15 2018 11:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Promotion Village To Assembly Ruling - Sakshi

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న, గతంలో పోటీ చేసిన వివిధ పార్టీల నేతలందరూ స్థానిక సంస్థల నుంచి వచ్చిన వారే.. వీరి రాజకీయ ప్రస్థానం పల్లె నుంచి మొదలైంది. అంచెలంచెలుగా వివిధ పదవులు చేపట్టి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జైపాల్‌యాదవ్, దివంగత పట్లోళ్ల ఇంద్రారెడ్డి, కేఎస్‌.రత్నం, కాలె యాదయ్య, గడ్డం ప్రసాద్‌కుమార్, మల్‌రెడ్డి రంగారెడ్డి, మంచిరెడి కిషన్‌రెడ్డి ఉన్నారు. వీరిలో కొందరు మంత్రి పదవులను సైతం చేపట్టారు. 

ఎంపీటీసీ పదవితో తిరిగిన దశ
వికారాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థల నుంచే ప్రారంభమైంది. చాలా కాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తగా కొనసాగిన ఆయన  2001లో కోట్‌ మర్పల్లి నుంచి ఎంపీటీసీకి పోటీ చేసి విజయం సాధించారు. ఆ విజయం ఆయన రాజకీయ జీవితాన్నే మార్చివేసింది. అనూహ్యంగా మర్పల్లి ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో మంచి గుర్తింపు లభించింది. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో ఆయన ఎంతో చనువుగా ఉంటూ మర్పల్లి మండల అభివృద్ధికి కృషి చేశారనే ప్రచారాం ఉంది. 2008లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎ. చంద్రశేఖర్‌ తన పదవికి రాజీనాయ చేయడంతో వికారాబాద్‌ శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వికారాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ను గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఇచ్చారు. ప్రసాద్‌ కుమార్‌ గెలుపు బాధ్యతలను అప్పటి గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌పై ప్రసాద్‌ కుమార్‌ విజయం సాదించారు. మొదటి సారి విజయం సాధించిన ఏడాదికే 2009లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రసాద్‌ కుమార్‌కే టికెట్‌ ఇచ్చింది. దీంతో ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌ నుంచి రెండో సారి విజయం సాధించారు. 2012లో కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజీవరావు చేతిలో ఓటమి పాలయ్యారు.  

రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా..
హయత్‌నగర్‌: అబ్దుల్లాపూర్‌ మెట్టు మండలం తొర్రూర్‌కు చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా సర్పంచ్‌ స్థాయినుంచి స్వశక్తితో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1981లో   సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం తుర్కయాంజాల్‌ రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌గా పనిచేశారు. టీడీపీలో తెలుగురైతు జిల్లా అధ్యక్షునిగా ఉన్న అయన 1994లో మలక్‌పేట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మొదటిసారి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి సుధీర్‌కుమార్‌పై విజయం సాధించారు.  దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన 2004లో మలక్‌పేట్‌ నుంచి కాంగ్రేస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై దృష్టి పెట్టారు.

2009లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టికెట్‌ దక్కక పోవడంతో మహేశ్వరం నుంచి భరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి ఆయన తమ్ముడు రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. మోత్తం మీద నాలుగు సార్లు పోటీ చేసిన మల్‌రెడ్డి రెండు సార్లు గెలిచి రెండుసార్లు ఓడిపోయారు. నియోజక వర్గాల పునర్విభన అనంతరం తనకు పట్టున్న ప్రాంతాలు విడిపోవడం ఆయనకు కలిసిరాలేదు.

సర్పంచ్‌ నుంచి మంత్రిగా..
చేవెళ్ల: మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన దివంగత పట్లోళ్ల ఇంద్రారెడ్డి 1981లో కౌకుంట్ల సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1985లో   ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అంతకు ముందు ఆయన జనత పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవటంతో 1985లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అ తరువాత ఆయన వెనుదిరిగి చూడకుండా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు  మంత్రిగా పనిచేశారు.


 

జెడ్పీ చైర్మన్‌ టు ఎమ్మెల్యే..
చేవెళ్ల: నియోజకవర్గంలోని మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన కేఎస్‌ రత్నం శంషాబాద్‌ జేడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి 1995లో రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. అ తరువాత టీడీపీ తరుఫున హైదరాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో చేవెళ్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం మళ్లీ పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్నారు. 

అంచెలంచెలుగా ఎదిగి..
చేవెళ్ల: నియోజకవర్గంలోని నవాబుపేట  మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన కాలె యాదయ్య స్థానిక సంస్థల రాజకీయలనుంచే వచ్చారు.   మొదటి నుంచి కాంగ్రెస్‌పార్టీలో ఉన్న అయన 1992 నుంచి 1995 వరకు   నవాబుపేట మండలంలో  ఒకేసారి సింగిల్‌ విండో చైర్మన్‌గా, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌గా, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్‌గా పనిచేశారు.1995–2000 వరకు నవాబుపేట జెడ్పీటీసీగా, 2001–2006 వరకు నవాబుపేట ఎంపీపీగా  పనిచేశారు. కాంగ్రెస్‌పార్టీలో సీనియర్‌ నాయకునిగా పనిచేసిన ఆయన  2009లో చేవెళ్ల నియోజకవర్గం  ఎస్సీకి రిజర్వు కావటంతో  చేవెళ్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. 2014లో  చేవెళ్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలుపొందారు. గెలిచిన అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరారు.  ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ  ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.   

గ్రామ ప్రథమ పౌరుడి నుంచి..
ఇబ్రహీంపట్నం: సర్పంచ్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నాయకుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎల్మినేడు గ్రామానికి చెందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నిజాం కళాశాలలో గాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఆంధ్రాబ్యాంక్‌లో క్లర్క్‌ ఉద్యోగంలో చేరారు. ఈ దశలో 1980లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. చదువుకున్న వ్యక్తిని గ్రామానికి సర్పంచ్‌ను చేయాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఉద్యోగం చేస్తున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని సర్పంచ్‌గా పోటీ చేయాలని గ్రామస్థులు పట్టుబట్టడంతో..    సర్పంచ్‌ బరిలో నిలబడి విజయం సాధించారు. 25 ఏళ్ల వయస్సులో సర్పంచ్‌గా గెలిచిన కిషన్‌రెడ్డి, వెనుతిరిగి చూడకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీలో చేరారు.  1985 నుంచి 1990 వరకు ఎల్మినేడు సింగిల్‌విండో చైర్మన్‌గా డీసీసీబీ డైరెక్టర్‌గా   పనిచేశారు.1994–96 మధ్యకాలంలో జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శిగా, 1997 నుంచి 2004 వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు ఏపీఐడీసీ చైర్మన్‌గా కోనసాగారు. 2009లో టీడీపీ నుంచి ఇబ్రహీంపట్నం స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి శాసనసభ్యుడిగా తిరిగి గెలుపొందారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా సామాజిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.  ఎమ్మెల్యేగా హాట్రిక్‌ సాధించేందుకు ఇబ్రహీంపట్నం నియోజవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు.
 

జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి..
కొడంగల్‌: మాజీ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం నుంచి ఆయన 2006లో టీడీపీ పక్షాన జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. 2008లో స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. 2009లో కొడంగల్‌ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఏడు వేల మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కొడంగల్‌ నియోజకవర్గంలో 14వేల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం కొడంగల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

 

చల్లంపల్లి నుంచి మొదలై...
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి.జైపాల్‌యాదవ్‌ రాజకీయ ప్రస్థానం సర్పంచ్‌ నుంచి మొదలైంది. రెండు సార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు సర్పంచ్‌గా, జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నిక కావడం విశేషం. తలకొండపల్లి మండలం చల్లంపల్లికి చెందిన జి.జైపాల్‌యాదవ్‌ 1981లో తొలిసారిగా చల్లంపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1988లో మరోసారి చల్లంపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1995లో తలకొండపల్లి నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా విజయం సాధించారు.

1999లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన జైపాల్‌యాదవ్‌ తొలిసారి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో ఉమ్మడి జిల్లాలోని వంగూరు మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2009లో రెండో సారి టీడీపీ తరఫున కల్వకుర్తి నుంచి పోటీ చేసి  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా 2014లో కల్వకుర్తి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ప్రస్తుత ఎన్నికలలో మరోసారి జైపాల్‌యాదవ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement