కొత్త, పాతల ‘పోరు’! | Senior Leaders Vs Junior Leaders Tough Competition in RangaReddy DistricI | Sakshi
Sakshi News home page

కొత్త, పాతల ‘పోరు’!

Published Mon, Nov 19 2018 2:19 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Senior Leaders Vs Junior Leaders Tough Competition in RangaReddy  DistricI - Sakshi

ఎ.చంద్రశేఖర్‌ (స్వతంత్ర) వికారాబాద్, మహేందర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) తాండూరు, సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్‌) మహేశ్వరం, ఆనంద్‌ (టీఆర్‌ఎస్‌) వికారాబాద్, గణేశ్‌ గుప్త (టీడీపీ) రాజేంద్రనగర్, పటేల్‌ రవిశంకర్‌ (బీజేపీ) తాండూరు

ప్రస్తుత ఎన్నికల్లో పోటీ కొత్త, పాత నేతల మధ్య కొనసాగుతోంది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతం జూనియర్లు .. సీనియర్ల మధ్య పోటీ కనిపిస్తోంది. పలు సార్లు ఎమ్మెల్యేలుగా కొనసాగి ప్రస్తుతం పోటీలో ఉన్నవారు కొత్త నేతలతో పోటీ పడుతున్నారు. ఏకంగా టీఆర్‌ఎస్‌ మూడు చోట్ల కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇదే సమయంలో వికారాబాద్‌ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్‌ ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా ఏడో సారి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో నాలుగు సార్లు గెలువగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు.తాండూరు నుంచి పోటీ చేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి ఆరోసారి పోటీ చేస్తుండగా గతంలో నాలుగు సార్లు విజయం సాధించి ఒక సారి ఓడారు. షాద్‌నగర్‌ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న శంకర్‌రావు ఐదో సారి పోటీ చేస్తుండగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఇక మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్న  సబితారెడ్డి ప్రస్తుతం నాల్గో సారి పోటీ చేస్తుండగా గతంలో చేవెళ్ల నుంచి రెండు సార్లు, మహేశ్వరం నుంచి ఒక సారి విజయం సాధించారు. ఇక కొడంగల్‌ నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం మూడో సారి పోటీ చేస్తుండగా గతంలో రెండు సార్లు విజయం సాధించారు.   

సాక్షి, పరిగి: టీఆర్‌ఎస్‌ ఈ సారి మూడు చోట్ల కొత్త వారికి టికెట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోనే హాట్‌ టాపిక్‌గా మారిన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిపై పోటీకి పట్నం నరేందర్‌రెడ్డి మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. హేమాహేమీలైన ఇద్దరు మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఎ. చంద్రశేఖర్‌రావు పోటీలో ఉన్నా వికారాబాద్‌లోనూ టీఆర్‌ఎస్‌ కొత్త వ్యక్తి సబితానంద్‌కు టికెట్‌ కేటాయించింది. ఇదే సమయంలో పరిగిలోనూ  టీఆర్‌ఎస్‌ కొత్త  వ్యక్తికే టికెట్‌ కేటాయించటం గమనార్హం మాజీ డిప్యూటీ స్పీకర్‌  కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తనయుడు కొప్పుల మహేశ్‌రెడ్డిని పరిగి నుంచి టీఆర్‌ఎస్‌ బరిలో దింపింది.

చంద్రశేఖర్‌ ఏడోసారి పోటీ.. 
వికారాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ పోటీ పడుతున్నారు. ఇతను నాల్గో సారి పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు గెలవగా ఒక సారి ఓటమిపాలయ్యారు. మరో మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్‌రావు ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా 7వ సారి పోటీ చేస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ తరపున కొత్త వ్యక్తి ఆనంద్‌ మొదటి సారిగా పోటీ చేస్తున్నారు. 

మహేందర్‌రెడ్డి ఆరోసారి..
తాండూరు నియోజకవర్గం నుంచి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రస్తుతం ఆరో సారి పోటీ చేస్తున్నారు. గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది  ఓసారి ఓడారు. కాంగ్రెస్‌ నుంచి చేస్తున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి రెండో సారి పోటీ చేస్తుండగా గతంలో ఓ సారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పటేల్‌ రవిశంకర్‌ మొదటి సారి పోటీ చేస్తున్నారు. 

వంశీచంద్‌రెడ్డి రెండోసారి..
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున వంశీచంద్‌రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న  జైపాల్‌ యాదవ్‌ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఐదో సారి  బరిలో దిగుతున్నారు. ఇక బీజేపీ తరపున ఐదో సారి ఆచారి పోటీ చేస్తుండగా ఆయన ఇంకా గెలుపు రుచి చేడలేదు. గత ఎన్నికల్లో మాత్రం స్వల్ప ఓట్ల తోడాతో ఓటమిపాలయ్యారు.

సబితారెడ్డినాలుగో సారి..
మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరçఫున మాజీ మంత్రి సబితారెడ్డి నాల్గో సారి పోటీ చేస్తున్నారు. గతంలో చేవెళ్ల, మహేశ్వరం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి  మూడో సారి పోటీ చేస్తుండగా గతంలో ఒక సారి ఓడి, ఒక సారి గెలుపొందారు. హైదరాబాద్‌ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి మూడో సారి పోటీ చేస్తున్నారు. గతంలో ఒక సారి ఓడి ఒక సారి గెలుపొందారు. ఇక టీఆర్‌ఎస్‌ తరపున కొత్త వ్యక్తి కొప్పుల మహేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా కో–ఆర్డినేటర్‌గా ప్రత్యక్ష  రాజకీయాల్లోకి  వచ్చిన అతను మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి టికెట్‌ ఖరారు కానప్పటికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు పోటీ చేసే అవకాశం ఉంది. అతను గతంలో ఓసారి  ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ప్రశాశ్‌గౌడ్, రేవంత్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మంచిరెడ్డి మూడో పర్యాయం..
రాజేంద్రనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో పోటీ చేసిన  రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం హ్యాట్రిక్‌పై కన్నేశారు. ఇక  కూటమి పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయించగా ఆ పార్టీ కొత్త వ్యక్తి గణేశ్‌గుప్త పేరు ఖరారు చేసింది. అయితే కాంగ్రెస్‌ తరపున కార్తీక్‌రెడ్డి గట్టిగా టికెట్‌ కోసం పట్టుబట్టడంతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు రంగంలోకి  దిగనున్నారు. ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా మొదటి సారి పోటీ చేస్తున్నవారే.

కొడంగల్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మూడో సారి పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ నుంచి గతంలో ఎమ్మెల్సీగా  ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా మొదటి సారి పోటీ చేస్తున్నారు.

షాద్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున ప్రతాప్‌రెడ్డి మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గతంలో ఒకసారి గెలిచి ఒక సారి ఓడారు. టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్న అంజయ్య యాదవ్‌ సైతం మూడోసారి  ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా గతంలో ఒక సారి ఓడి ఒకసారి గెలుపొందారు. ఆ స్థానం నుంచి ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శంకర్‌రావు ప్రస్తుతం ఐదోసారి పోటీ చేస్తుండగా గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉంది.

చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ నుంచి కేఎస్‌ రత్నం మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో పోటీ చేసిన రెండు పర్యాయాల్లో ఒక సారి గెలుపొంది మరోసారి ఓటమి పాలయ్యారు. అతనికి గతంలో జెడ్పీ చైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఇక టీఆర్‌ఎస్‌ తరపున  మాజి ఎమ్మెల్యే కాలే యాదయ్య బరిలో ఉన్నారు. ఇతను రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా ఇటీవలి వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రస్తుతం మూడో సారి పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక కూటమి తరపున సామ రంగారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, రెండు సార్లు ఓడారు. గతంలో ఓ సారి పోటీ చేసి ఓడిన క్యామా మల్లేష్‌లు కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీ చేస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement