ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభావం చవిచూసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాకు తొలిసారిగా వస్తున్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని శంషాబాద్ నుంచి పూరించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9న క్లాసిక్ కన్వెన్షన్–3 పక్కన ఉన్న మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలను అధిక సంఖ్యలో తరలించాలని భావిస్తున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి నుంచి 50 వేలకుపైగా పార్టీ శ్రేణులను సమీకరించాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. ఈ బాధ్యతలను ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌చార్జులకు అప్పగించారు. ఈ సభా వ్యవహారాలను మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందటంతో ఇక్కడ విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలవడం కలిసొచ్చే అంశమని పరిగణనిస్తున్నాయి.
మరోసారి ఉనికి చాటేలా..
మరోపక్క టీఆర్‌ఎస్ పార్టీ తన ప్రాబల్యాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో టీఆర్‌ఎస్ పార్టీ ఉంది. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని 9న చేవెళ్లలోని ఫరా కళాశాల మైదానంలో నిర్వహించ తలపెట్టింది. కొన్ని రోజులుగా పార్టీ వర్గాలు ఏర్పాట్లలో మునిగిపోయాయి. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు హాజరవుతున్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టాన తర్వాత తొలిసారి కేటీఆర్ జిల్లాకు వస్తుండడంతో ఆయన ఘనంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సన్నాహక సభకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి దాదాపు 20 వేల మందిని తరలించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా సభలు నిర్వహిస్తుండడంతో రాజకీయాలు వేడెక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment