
దేవేందర్‌గౌడ్
సాక్షి, పరిగి (రంగారెడ్డి): జిల్లా హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల నుంచి తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా నిర్వహించిన 2014 అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు అత్యధికంగా ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. 1999నాటి ఎన్నికల్లో ఉప్పల్ నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి తూళ్ల దేవేందర్‌గౌడ్‌కు అత్యధిక మెజారిటీ లభించింది. 77,883 ఓట్లతో ఆయన విజయం సాధించారు. 1983 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమావెంకట్రాంరెడ్డి 64 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలిచారు.
1952 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎంబీ గౌతం అత్యల్ప మెజారిటీతో గెలుపొందారు. ఎస్‌సీఎఫ్ పార్టీకి చెందిన కేకే మానెపై 1,490 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానానికి పోటీ చేసిన గౌతంకు 13,432 ఓట్లు, మానెకు 11,942 ఓట్లు దక్కాయి. దీంతోపాటు వికారాకాబాద్ ద్విసభ్య సెగ్మెంట్‌గా ఉండేది. జనరల్ స్థానానికి బరిలో దిగిన మర్రి చెన్నారెడ్డి భారీ మెజారిటీతో నెగ్గారు. సోషలిస్ట్ నేత రామారావుపై 31,850 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఓటమిపాలైన రామారావుకు 11,985 వచ్చాయి.
1957లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అత్యల్ప మెజారిటీ నమోదైంది. పీడీఎఫ్ అభ్యర్థి హన్మంత్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎన్ లక్ష్మీనరసయ్య 2,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అత్యధిక మెజారిటీ వికారాబాద్ సెగ్మెంట్‌లో వచ్చింది. ద్విసభ్య సెగ్మెంట్‌గా ఉండగా.. జనరల్ స్థానానికి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 21,195 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి ఎన్‌ఎం జైసూర్యపై విజయఢంకా మోగించారు.
1962 ఎన్నికల్లో..అత్యల్ప మెజారిటీతో తాండూరు నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి సి.శేఖర్‌పై 268 ఓట్లతో నెగ్గారు. మొత్తం 34,200 ఓట్లకుగాను చెన్నారెడ్డికి 15,658 ఓట్లు, శేఖర్‌కు 15,390 ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎన్ లక్ష్మీ నరసయ్య 21,921 ఓట్ల మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థి కేపీ రెడ్డిపై విజయం పూరించారు. మొత్తం 35,588 ఓట్లకు గాను నరసయ్యకు 27,295 మంది ఓటేశారు. కేపీ రెడ్డికి 5,374 ఓట్లు దక్కాయి.
1967 ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీ పరిగి నియోజకవర్గంలో నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ షరీఫ్‌పై స్వతంత్ర అభ్యర్థి కమతం రాంరెడ్డి కేవలం 850 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాంరెడ్డికి 21,087 ఓట్లు, షరీఫ్‌కు 20,237 ఓట్లు పోలయ్యాయి. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రా దేవి 14,441 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ కేఆర్ అబ్బయ్యకు 4,560 ఓట్లు, సుమిత్రకు 19,001 ఓట్లు దక్కాయి.
1972లో అతి తక్కువ మెజారిటీతో వికారాబాద్ సెగ్మెంట్‌లో స్వతంత్ర అభ్యర్థి వీబీ తిరుమలయ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత టీఎన్ సదాలక్ష్మిపై 4,691 ఓట్లతో నెగ్గారు. తిరుమలయ్యకు 19,339 ఓట్లు, సదాలక్ష్మికి 14,648 ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.అనంతరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. సీపీఎం అభ్యర్థి కేకే మూర్తిపై 31,251 ఓట్లతో ఆయన నెగ్గారు. అనంతరెడ్డికి 44,061 ఓట్లు, మూర్తికి 12,812 ఓట్లు వచ్చాయి.
1978లో చేవెళ్ల నియోజకవర్గంలో అత్యల్ప మెజారిటీతో జనతా పార్టీ అభ్యర్థి సి.ప్రతాపలింగం గెలుపొందారు. ఇందిరా కాంగ్రెస్ నేత టీఆర్ ఆనందంపై 5,319 ఓట్లతో గెలుపొందారు. ప్రతాప్‌నకు 26,071 ఓట్లు, ఆనందంకు 20,752 ఓట్లు దక్కాయి. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీతో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రాదేవి విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి, జనతా పార్టీ నేత కేఆర్ కృష్ణస్వామిపై 23,561 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1983 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగింది. చివరకు 64 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి టీపీ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఉమావెంకట్రాం రెడ్డి నెగ్గారు. ఉమకు 34,853, టీపీ రెడ్డికి 34,789 ఓట్లు దక్కాయి. అలాగే పరిగిలోనూ ఇదే తరహాలో టఫ్ ఫైట్ కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఏ.షరీఫ్ 85 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి కేఏ రెడ్డిపై విజయం సాధించారు. తాండూరు సెగ్మెంట్‌లో భారీ మెజార్టీ నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.మాణిక్యరావు.. స్వంతంత్ర అభ్యర్థి ఎస్.సాయిరెడ్డిపై 18,297 ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకున్నారు.
1985 ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో అత్యల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.చంద్రశేఖర్ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఎస్.బాలప్పపై 14,203 ఓట్ల మెజారిటీ సాధించారు. భారీ మెజారిటీతో చేవెళ్ల సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి పట్లోళ్ల ఇంద్రారెడ్డి విజయఢంకా మోగించారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.విక్రంకుమార్ రెడ్డిపై 39,805 ఓట్ల మెజారిటీ పొందారు.
అతి తక్కువ ఓట్లతో 1989లో వికారాబాద్ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్.. కాంగ్రెస్ అభ్యర్థి వీబీ తిరుమలయ్యపై నెగ్గారు. 3,964 ఓట్ల మెజారిటీ సాధించారు. అత్యధిక మెజారిటీ మేడ్చల్ నియోజకవర్గంలో నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఉమావెంకట్రాంరెడ్డి 20,823 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఎస్.ఉమాదేవిపై గెలుపొందారు.
1994 ఎన్నికల్లో తాండూరు నుంచి టీడీపీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.నారాయణరావుపై 10,191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహేందర్‌కు 41,135 ఓట్లు, నారాయణరావుకు 30,944 ఓట్లు పోలయ్యాయి. చేవెళ్లలో టీడీపీ అభ్యర్థి పట్లోళ్ల ఇంద్రారెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పి.పాండుపై 64,603 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఇంద్రారెడ్డికి 85,437 మంది ఓటెయ్యగా.. పాండుకు 20,834 మంది ఓటర్ల ఆశీర్వాదం లభించింది.
1999 ఎన్నికల్లో.. అతి తక్కువ ఓట్ల తేడాతో వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బి.మధురవేణిపై టీడీపీ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ నెగ్గారు. ఈయనకు కేవలం 203 మెజారిటీ లభించింది. చంద్రశేఖర్‌కు 52,733 ఓట్లు దక్కగా.. మధురవేణికి 52,530 ఓట్లు లభించాయి. అత్యధిక మెజారిటీతో తూళ్ల దేవేందర్ గౌడ్ రికార్డు సృష్టించారు. మునుపెన్నడూ లేనివిధంగా 77,883 భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.హరివర్ధన్‌రెడ్డిపై విజయ కేతనం ఎగురవేశారు. గౌడ్‌కు 1.93 లక్షల ఓట్లు, హరివర్ధన్‌రెడ్డికి 1.15 లక్షల ఓట్లు దక్కాయి.
2004లో వికారాబాద్ సెగ్మెంట్‌లో అతి తక్కువ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బి.మధురవేణిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ గెలుపొందారు. ఈయనకు 2001 ఓట్ల మెజారిటీ దక్కింది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ఎస్.భూపాల్‌రెడ్డిపై 41,585 ఓట్ల మెజారిటీని సాధించారు.
నియోజకవర్గాల పునర్శిభజన జరిగిన తర్వాత 2009లో తొలిసారిగా జరిగిన ఈ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ శేరిలింగంపల్లి సెగ్మెంట్‌లో నమోదైంది. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై కాంగ్రెస్ అభ్యర్థి 1,327 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కూకట్‌పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వి.నర్సింగ్‌రావుపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నెగ్గారు. ఈయనకు 28,183 ఓట్ల మెజారిటీ లభించింది.
గత ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య గెలుపొందారు. టీఆర్‌ఎస్ నేత కేఎస్ రత్నంపై 781 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యాదయ్యకు 64,182 ఓట్లు, రత్నానికి 63,401 ఓట్లు దక్కాయి.
శేరిలింగంపల్లిలో అత్యధిక మెజారిటీ టీడీపీ అభ్యర్థి అరికెపూడి గాంధీకి లభించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.శంకర్‌గౌడ్‌పై 77,257 ఓట్ల మెజారిటీ సాధించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇది రెండో అత్యధిక మెజారిటీ. గాంధీకి 1.29 లక్షల ఓట్లు, శంకర్‌కు 53 వేల పైచిలుకు ఓట్లు దక్కాయి.