ఎన్నికల వేళ.. చేతినిండా ‘పని’ | Many Businesses That Have Been Stimulated During The Election Campaign | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. చేతినిండా ‘పని’

Published Tue, Nov 27 2018 2:27 PM | Last Updated on Tue, Nov 27 2018 6:23 PM

Many Businesses That Have Been Stimulated During The Election Campaign - Sakshi

ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇది కొందరికి ఉపాధిమార్గంలా మారింది. మరో పదిరోజుల పాటు చేతినిండా దొరుకుతుంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొన్ని వ్యాపారులు మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థుల జేబు ఖాళీ అవుతుండగా.. కొందరు ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ‘నాలుగు రాళ్లు’ పోగేసుకుంటున్నారు

సాక్షి,శంషాబాద్‌:    తెలంగాణ  ఎన్నికల ప్రచారం నేపథ్యంలో  ప్రస్తుతం అడ్డాకూలీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. భవన నిర్మాణ కార్మికులుగా పనిచే సే వీరు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోతున్నారు. పొద్దంతా చేమటోడిస్తే వచ్చే దినసరి వేతనం కన్నా అభ్యర్థుల వెంట కొన్ని గంటలు తిరిగి ప్రచారం చేస్తే వచ్చే సొమ్ముతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా దొరుకుతుండగా ఎన్నికల ప్రచారానికే ‘జై’ కొడుతున్నారు. దీంతో ఇప్పటికే ఆయా పార్టీలు తమ ప్రచారానికి వీరిని ముందస్తుగా బుక్‌ చేసుకుంటున్నారు. వీరు నేరుగా ఉదయం లేవగానే ఆయా అభ్యర్థి ఇళ్లకు వెళ్లి అక్కడే అల్పాహారం పూర్తి చేసుకుని ప్రచారానికి వెళ్తున్నారు. ప్రతిరోజు వీరికి రూ. 500 వందల నుంచి 700 వందల వరకు నేతలు చెల్లిస్తున్నారు. 

కళాకారులు ధూంధాం 
ఎన్నికల ప్రచారంలో కళాకారులది కీలక పాత్ర. గొంతెత్తి వీరు పాడే పాటలకు ప్రచారానికి వన్నె తెస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తక్కువ సంఖ్యలో ఉండే కళాకారులు అభ్యర్థులకు దొరకడమే కష్టంగా మారింది. వారిని వెతికి పట్టుకునే పనిలో ఆయా పార్టీల నేతలు అష్టకష్టాలు పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం వీరికి మంచి డిమాండ్‌ ఉంది. మిగతా సమయాల్లో ఖాళీగా ఉండే కళాకారుల బృందాలు ఇప్పుడు బీజీబీజీగా మారి డబ్బులు సంపాదించుకుంటున్నారు. 

పరిమళిస్తున్న పూల దుకాణాలు
బరిలో నిలిచిన అభ్యర్థి ఇంటి నుంచి ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు అభిమానులు వారిని పూలదండలతో ముంచెత్తుతున్న పరిస్థితి నెలకొంది. సన్మానాలకు సత్కారాలకు పుష్పగుచ్చాలు.. పూలదండలు తప్పనిసరి. దీంతో పూలదండలు తయారు చేసి అమ్మేవారికి చేతినిండా పని దొరకవడంతో గిరాకీ అమాంతం పెరిగిపోయింది. యాభై రూపాయల దండ కాస్త డెబ్బై నుంచి వంద వరకు విక్రయిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో వ్యాపారి కనీసం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు పూల విక్రయాలు జరుపుతున్నాడు. 

డిజిటల్‌ మార్కెటింగ్‌ 

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అనిమార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రచారంలో ప్రస్తుతం కీలకభూమిక పోషిస్తున్న సామాజిక మాధ్యమాలవైపు చూస్తున్నారు. మంచి కంటెంట్‌తో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ప్రచారం చేసి పెట్టడానికి డిజిటల్‌ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో డిజిటల్‌ మార్కెటింగ్‌ చేసే వారికి చేతినిండా పనిదొరుకుతోంది.  

ట్రావెల్స్‌కు డిమాండ్‌ 
ట్యాక్సీలు.. ట్రావెల్స్‌ అన్ని కూడా ఇప్పుడు బిజీగా మారిపోయాయి. ప్రచారానికి నియోజకవర్గ స్థాయిలో తిరుగుతున్న సమయాల్లో పార్టీల అనుచరగణాన్ని తరలించేందుకు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతల బహిరంగ సభలు నియోజకవర్గ పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ ఏర్పాటు చేసిన సమయాల్లో వాహనాలు దొరికే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పవచ్చు. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ‘స్టీరింగ్‌’ నిండా పని దొరికింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement