
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌కు ఇంటిపోరు మొదలైంది. తిరుగుబాటు అభ్యర్థుల వ్యవహారం పార్టీకి చికాకు కలిగిస్తోంది. సర్దుకుపోవాలని సముదాయించినా ఏకంగా బరిలో దిగి సవాల్ విసురుతుండడంతో ఆత్మరక్షణలో పడింది. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు ఆశావహులు అధినాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించారు. ఆరు నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ఈ నేతలు.. సమాజ్‌వాది, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తుండడం కాంగ్రెస్‌ను కలవరపరుస్తోంది. వీరి బలం గెలిచే స్థాయిలో లేకున్నా గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్‌కు చెమటలు పట్టిస్తోంది.
తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, వికారాబాద్, శేరిలింగంపల్లి స్థానాల నుంచి ఇండిపెండెంట్లుగా బరిలో దిగిన అభ్యర్థులకు స్థానికంగా గట్టి పట్టుంది. వికారాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ డాక్టర్ ఎ.చంద్రశేఖర్ ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఘనత ఉంది. గత ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన ఈసారి టికెట్ లభిస్తుందని ఆశించారు.
అయితే, టికెట్‌ను మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు ఖరారు చేయడంతో చంద్రశేఖర్ అసంతృప్తికి లోనయ్యారు. ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని భావించిన ఆయన అభ్యర్థుల జాబితా వెల్లడించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధిష్టానం పెద్దలు కొప్పుల రాజు బుజ్జగించినా మెత్తబడని చంద్రశేఖర్.. స్వతంత్ర అభ్య ర్థిగా నామినేషన్ వేశారు. ప్రధాన పార్టీలకు దీటు గా ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టిన చంద్రశేఖర్ వల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు.
తాడోపేడో తేల్చుకోవడానికి...
ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 2014లో ఇదే స్థానాన్ని ఆశించినప్పటికీ చివరి నిమిషంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కు లభించింది. దీంతో మహేశ్వరం స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించినా స్నేహపూర్వక పోటీగా పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బీ–ఫారంను కూడా అందజేసింది. దీంతో మహేశ్వరంలో తాను రంగంలోకి దిగి.. ఇబ్రహీంపట్నం నుంచి సోదరుడు రాంరెడ్డిని రెబల్‌గా బరిలోకి దించారు.
అక్కడ.. ఇక్కడ రెండు స్థానాల్లోనూ మల్‌రెడ్డి బ్రదర్స్‌కు చుక్కెదురైంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో టికెట్ సంపాదించాలని సర్వశక్తులొడ్డిన మల్‌రెడ్డి.. మహాకూటమికి ఈ స్థానాన్ని కేటాయించడంతో కుంగిపోయారు. అయినా, వెనక్కి తగ్గకుండా పోటీచేయడం ద్వారా సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా బరిలో దిగే అవకాశముందని గమనించిన ఏఐసీసీ బుజ్జగింపుల కమిటీ మల్‌రెడ్డి రంగారెడ్డిని పిలిపించి మాట్లాడినా మెత్తబడకపోగా.. సోమవారం బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి సవాల్ విసిరారు.
కొత్త కండువాతో శంకరన్న..
మాజీ మంత్రి శంకర్రావు కూడా పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. కంటోన్మెంట్ సీటును కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు కేటాయించిన అధిష్టానం.. షాద్‌నగర్ నుంచి తనకు లేదా తనయకు కేటాయించాలని పట్టుబట్టారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి అభ్యర్థిత్వానికే పార్టీ నాయకత్వం పచ్చజెండా ఊపడంతో కినుక వహించిన శంకరన్న హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు.
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మరుక్షణమే సమాజ్‌వాదీ పార్టీ కండువాతో ప్రత్యక్షమయ్యారు. మాజీ శాసనసభ్యుడు కేఎస్ రత్నం చేరికతో టికెట్ రాకుండా పోయిందని ఆవేదన గురైన డీసీసీ మాజీ సారథి పడాల వెంకటస్వామి కూడా రెబల్‌గా బరిలో దిగారు. మూడు పర్యాయాలుగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నా తనకు గాకుండా ఇతరులు కట్టబెట్టడాన్ని తప్పుబడుతున్న ఆయన పార్టీ నాయకత్వంపై నిరసనగళం వినిపిస్తున్నారు. కూటమి సీట్ల కేటాయింపులో భాగంగా టీడీపీకి కట్టబెట్టిన శేరిలింగంపల్లిలోనూ తిరుగుబాటు తప్పడంలేదు.
మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమేగాకుండా కూటమి అభ్యర్థిని చావు దెబ్బతీస్తానని శపథం చేస్తున్నారు. రాజేంద్రనగర్ సీటును కూడా టీడీపీ కేటాయించడంతో నిరాశకు గురైన మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి పోటీచేయనున్నట్లు ప్రకటించినప్పటికీ బుజ్జగింపుల కమిటీ మాట్లాడడంతో శాంతించారు. అయితే, ఈ స్థానం నుంచి వేణుగౌడ్, ఒకరిద్దరు స్వతంత్రులుగా బరిలో దిగడం గమనార్హం.
తాండూరు అభ్యర్థిత్వం కోసం ఢిల్లీ, హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేసి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పార్టీకి రాజీనామా చేయడమేగాకుండా ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఇదిలావుండగా, ఈయన ఈ నెల 25న తాండూరు ఎన్నికల ప్రచారానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment