సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల గెలుపు, ఓటములపై చర్చ జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులే గడువు ఉండగా.. 13 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల తీర్పులో ప్రతిసారీ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడి ఎన్నికలలో ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో అప్పటివరకు ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండగా నిలిచారు. ఉద్యమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ నాలుగేళ్ల పనితీరుకు పరీక్షగా నిలుస్తున్న ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఓడేదెవరో..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
రిజర్వుడు స్థానాల్లో మళ్లీ ఎవరు..?
ఉమ్మడి కరంనగర్ జిల్లాలో ధర్మపురి, మానకొండూరు, చొప్పదండి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు. ఈ మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్ గతంలో గెలుపొందగా, ఈసారి మళ్లీ ఎవరిని విజయం వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ధర్మపురిలో పాత అభ్యర్థులే మళ్లీ బరిలో ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ (టీఆర్‌ఎస్), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు, తర్వాత కొప్పుల ఈశ్వర్ 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈసారి మధ్యే పోటీ నెలకొంది.
చొప్పదండిలో సుంకె రవిశంకర్ (టీఆర్‌ఎస్), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్), బొడిగె శోభ (బీజేపీ) మధ్య పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రవిశంకర్ కేసీఆర్ ప్రభుత్వ పథకాలతోనే ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మేడిపల్లి సత్యంకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ పాలనలో చొప్పదండి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ప్రచారంతో సత్యం ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్ ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ తరుపున బరిలో నిలిచారు.
మానకొండూరు సెగ్మెంట్ ఏర్పడిన తర్వాత జరిగిన గత రెండు ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు ఒకసారి కాంగ్రెస్‌ను, మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఏర్పుల బాలకిషన్ (టీఆర్‌ఎస్), మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ (కాంగ్రెస్) మధ్య ప్రధాన పోటీ ఉంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బాలకిషన్ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండరనే కాంగ్రెస్ ప్రచారం టీఆర్‌ఎస్ అభ్యర్థికి ప్రతికూలంగా ఉంది.
రామగుండం.. ఎవరికో వరం..!
కార్మిక క్షేత్రం రామగుండంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. 2009 నుంచి వరుసగా మూడోసారి ఒకేరకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సోమారపు సత్యనారాయణ (టీఆర్‌ఎస్), కోరుకంటి చందర్ (ఏఐఎఫ్‌బీ), మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ (కాంగ్రెస్), బల్మూరి వనిత (బీజేపీ) పోటీ పడుతున్నారు. 2009లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన కోరుకంటి చందర్.. 2014లో, ఇప్పుడు టీఆర్‌ఎస్ రెబెల్‌గా ఏఐఎఫ్‌బీ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల తరహాలోనే సోమారపు సత్యనారాయణకు, కోరుకంటి చందర్‌కు మధ్య ప్రధాన పోటీ ఉంది.
పెద్దపల్లిలో.. పెద్దపీట ఎవరిదో..!
పెద్దపల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి (టీఆర్‌ఎస్), చింతకుంట విజయరమణారావు (కాంగ్రెస్) నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన విజయరమణారావు ఈసారి కాంగ్రెస్ తరఫున బరిలో దిగారు. నియోజకవర్గంలో ఫలితాలపై ప్రభావం చూపే ప్రధాన సామాజికవర్గం ఓట్లపై టీఆర్‌ఎస్ అభ్యర్థి ధీమాతో ఉన్నారు. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన రమణారావుకు వ్యక్తిగత సంబంధాలు ప్రధాన బలంగా ఉన్నాయి. వీరిద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
సిరిసిల్ల.. కేటీఆర్ ఇలాకా..!
టీఆర్‌ఎస్ ముఖ్యనేత, మంత్రి కె.తారకరామారావు నాలుగోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌తో మాజీ ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి కేటీఆర్‌కు ఎన్నికలలో అనుకూలంగా మార్చింది. సాగునీటి వనరుల అభివృద్ధి, అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతో కేటీఆర్‌కు ఆదరణ పెరిగింది. చేనేత వర్గీయుల సంక్షేమ కోసం చేపట్టిన పథకాలతో ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ వర్గీయులలో కేటీఆర్ సానుకూలత ఉంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ప్రత్యర్థి పార్టీల ముఖ్యనేతలు, శ్రేణులు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌తో సిరిసిల్లకు గుర్తింపు వచ్చిందని ఇక్కడ అభిప్రాయం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి సైతం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
మంథనిలో హోరాహోరి..!
మంథనిలోనూ గత ఎన్నికల ప్రత్యర్థులే మళ్లీ పోటీ పడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (టీఆర్‌ఎస్), మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్) మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. గత ఎన్నికల తర్వాత శ్రీధర్‌బాబు అందుబాటులో లేరనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణులలో ఉంది. అయితే.. ఇటీవల కొందరు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు కలిసొస్తుందంటున్నారు. మంత్రిగా శ్రీధర్‌బాబు చేసిన అభివృద్ధి, టీఆర్‌ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని పోల్చుతూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అయితే.. కాంగ్రెస్ ఆలస్యంగా ప్రచార వ్యూహం మొదలు పెట్టింది. కాగా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ప్రాంతం కావడంతో ఆ పార్టీకి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. సామూహిక వివాహాలు, సేవా కార్యక్రమాలు, నిత్యం ప్రజలకు సన్నిహితంగా ఉండడం మధుకు అనుకూలంగా ఉంది. మారుమూల అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యాల కల్పనతో ఆయా ప్రాంతాల్లో మధుకర్‌కు ఎన్నికలలో ఉపయోగడుతోందంటున్నారు.
హుస్నా‘బాద్’షా ఎవరు..!
కరువు ప్రాంతంగా పేరున్న హుస్నాబాద్ స్థానాన్ని సర్దుబాటులో ప్రజాకూటమి సీపీఐకి కేటాయించింది. తాజా మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు (టీఆర్‌ఎస్), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), చాడ శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ) మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఇక్కడ పోటీలో లేకపోవడమే టీఆర్‌ఎస్ అభ్యర్థికి పెద్ద ఊరటగా మారింది. అయితే.. తాగునీటి సరఫరా, జిల్లాలు, మండలాల పునర్విభజన విషయంలో ఎక్కువ గ్రామాల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడంతో టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ఏడాదిన్నర క్రితం ఇక్కడ నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగసభలో ఏఐసీసీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. అనంతరం ప్రవీణ్‌రెడ్డి 136 గ్రామాల్లో పూర్తిస్థాయిలో ప్రచారం చేశారు. ఇప్పుడు సీపీఐకి ఆ స్థానం కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు కొంత ఆగ్రహానికి గురై దూరమయ్యారు. అధిష్టానం బుజ్జగింపులతో ప్రవీణ్‌రెడ్డి సైతం చాడ వెంకటరెడ్డికి మద్దతుగా ప్రచారంలో దిగడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment