ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల గెలుపు, ఓటములపై చర్చ జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులే గడువు ఉండగా.. 13 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల తీర్పులో ప్రతిసారీ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడి ఎన్నికలలో ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో అప్పటివరకు ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండగా నిలిచారు. ఉద్యమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ నాలుగేళ్ల పనితీరుకు పరీక్షగా నిలుస్తున్న ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఓడేదెవరో..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
సాక్షి, కరీంనగర్ : హుజూరాబాద్‌లో ద్విముఖం..టీఆర్‌ఎస్ కీలక నేత, మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో నాలుగోసారి పోటీ చేస్తున్నారు. అంతకుముందు రెండు పర్యాయాలు కమలాపూర్ నుంచి గెలుపొందారు. ఈటల రాజేందర్ (టీఆర్‌ఎస్)తో పాడి కౌశిక్‌రెడ్డి (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. మంత్రిగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ మందితో వ్యక్తిగత పరిచయాలు ఈటల రాజేందర్‌కు అనుకూల అంశాలు. కాంగ్రెస్ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో ఎన్నికల వ్యూహంలో ఆ పార్టీ కొంత వెనుకబడి ఉంది. నీటి వనరుల అభివృద్ధి, ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలతను పెంచుతోంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి గట్టి పట్టున్న హుజూరాబాద్‌లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆలస్యంగా ప్రకటించడంతో ప్రత్యర్థితో పోల్చితే కౌశిక్‌రెడ్డి ప్రచారంలో వెనుకబడగా, 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు.
కరీంనగర్‌లో త్రిముఖ పోటీ..
కరీంనగర్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ గంగుల (టీఆర్‌ఎస్), పొన్నం (కాంగ్రెస్), బండి (బీజేపీ) మధ్య ప్రధాన పోటీనెలకొంది. వెలమ కోటగా ముద్ర పడగా.. ఆ కోటలో తొలిసారి గెలిచిన బీసీ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్. ఆయన ఇక్కడ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. హిందుత్వం కోసం చావడానికైనా సిద్ధమే అంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన సంజయ్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్ 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. రాష్ట్రం కోసం లోక్‌సభలో పోరాటం, బీసీ నినాదం కలిసి వస్తుందని భావిస్తున్నారు.
కోరుట్లలో నువ్వా నేనా..!
కోరుట్లలో గత ఎన్నికల ప్రత్యర్థులే మళ్లీ పోటీ పడుతున్నారు. తాజామాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (టీఆర్‌ఎస్), జువ్వాడి నర్సింగారావు (కాంగ్రెస్) నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. విద్యాసాగర్‌రావు నాలుగోసారి ఇక్కడ టీఆర్‌ఎస్ నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ద్వితీయ స్థానంలో నిలిచిన నర్సింగారావు ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. నాలుగేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులు, కేసీఆర్ సంక్షేమ పథకాలపై విద్యాసాగర్‌రావు భరోసాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేయగా, ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంది.
జగిత్యాల రసవత్తరం..
జగిత్యాల ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీపోటీగా ఎన్నికల వ్యూహా లను అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత తాటి జీవన్‌రెడ్డి లక్ష్యంగా టీఆర్‌ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవిత ఇక్కడ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరిస్తున్నారు. టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), ఎ.సంజయ్‌కుమార్ (టీఆర్‌ఎస్) వరుసగా రెండోసారి పోటీ పడుతున్నారు. జగిత్యాల నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పూర్తిస్థాయిలో జీవన్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా రమణ, జీవన్‌రెడ్డిలో ఎవరో ఒకరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పని చేస్తుండడంతో టీఆర్‌ఎస్‌కు గట్టి సవాల్‌గా మారింది. కాంగ్రెస్ శాసనసభపక్ష ఉపనేతగా జీవన్‌రెడ్డి చేసే విమర్శలకు దీటుగా సమాధానం చెబుతూ కవిత మూడేళ్లుగా ఇక్కడ టీఆర్‌ఎస్ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నా రు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు జీవన్‌రెడ్డికి అనుకూలిస్తున్నాయి. టీఆర్‌ఎస్ అండగా నిలిచే ప్రధాన సామాజికవర్గం ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థి వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే ఈ వర్గం ఓటర్లతో జీవన్‌రెడ్డికి ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. స్వతహాగా వైద్యుడైన టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ ప్రజల కోసం, పార్టీ కోసం సమయం కేటాయిస్తారనే అభిప్రాయం ఉంది.
సిరిసిల్ల.. కేటీఆర్ ఇలాకా..!
టీఆర్‌ఎస్ ముఖ్యనేత, మంత్రి కె.తారకరామారావు నాలుగోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌తో మాజీ ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి కేటీఆర్‌కు ఎన్నికలలో అనుకూలంగా మార్చింది. సాగునీటి వనరుల అభివృద్ధి, అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతో కేటీఆర్‌కు ఆదరణ పెరిగింది. చేనేత వర్గీయుల సంక్షేమ కోసం చేపట్టిన పథకాలతో ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ వర్గీయులలో కేటీఆర్ సానుకూలత ఉంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ప్రత్యర్థి పార్టీల ముఖ్యనేతలు, శ్రేణులు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌తో సిరిసిల్లకు గుర్తింపు వచ్చిందని ఇక్కడ అభిప్రాయం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి సైతం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
రాజన్న ఆశీస్సులు ఎవరికో..!
వేములవాడలో నాలుగోసారి పాత ప్రత్యర్థులే పోటీ పడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు (టీఆర్‌ఎస్), ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి ప్రతాప రామకృష్ణకు వచ్చే ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనులతోనే రమేశ్‌బాబు ప్రచారం చేస్తున్నారు. అవినీతి అరోపణలు లేకుండా పని చేశామని చెబుతున్నారు. ప్రత్యర్థి పాత వ్యక్తి కావడం రమేశ్‌కు అనుకూల అంశంగా కనిపిస్తోంది. రమేశ్‌బాబు గెలిచినా అందుబాటులో ఉండరనే శ్రీనివాస్ ప్రచారాన్ని ఓటర్లు గత ఎన్నికలలో పట్టించుకోలేదు. రమేశ్‌బాబు పౌరసత్వంపై ఆది శ్రీనివాస్ న్యాయపోరాటం కొనసాగుతోనే ఉంది. రమేశ్‌బాబు, ఆది శ్రీనివాస్ 2009 నుంచి ఈ స్థానానికి పోటీ పడుతున్నారు. ఈసారి కూడా నువ్వానేనా అన్న తీరులో తలపడటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment