కొడంగల్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ హోరాహోరీ | Congress, TRS Tough Competition In Kondangal | Sakshi
Sakshi News home page

కొడంగల్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ హోరాహోరీ

Published Tue, Dec 4 2018 2:54 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress, TRS Tough Competition  In Kondangal - Sakshi

రేవంత్‌రెడ్డి,  నరేందర్‌రెడ్డి

కొడంగల్‌ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఒకవైపు..  గెలుపే లక్ష్యంగా టీర్‌ఎస్‌ ఎంచుకున్ననరేందర్‌రెడ్డి మరో వైపు బరిలో ఉన్నారు. ఇద్దరు ఉద్దండుల రాజకీయ రణరంగంలో కొడంగల్‌ ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారనే అంశంపై ఉత్కంఠ సాగుతోంది.

కొడంగల్‌: కొడంగల్‌లో పోరాటం నువ్వా.. నేనా అనేలా సాగుతోంది నియోజకవర్గంలోని సెకండ్‌ కేడర్‌ నాయకులు చాలా మంది ఈ మధ్యకాలంలో టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. కుల సంఘాల ప్రతినిధులను నరేందర్‌రెడ్డి తన వైపునకు తిప్పుకొన్నారు. కొడంగల్‌ ప్రజల ఆత్మగౌరవమే తనకు ముఖ్యమని రేవంత్‌ ప్రచారం చేస్తున్నారు.  7న జరిగే ఎన్నికల్లో గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. నేతలిద్దరూ గెలుపు తమదేనని చెబుతున్నా.. చివరికి ఏం జరుగుతుందోననే భయం  వీరి లో కనిపిస్తోంది.

 సీఎం కేసీఆర్‌ సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కొడంగల్‌పై దృష్టిసారించి రేవంత్‌ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించు కుంటున్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం తనకు 30 వేల మెజారిటీ వస్తుందని, ప్రజలు మళ్లీ తననే ఆదరిస్తారని పేర్కొంటున్నారు. కొడంగల్‌ నియోజకవర్గం చుట్టూ హై టెన్షన్‌ వైరులా తాను కాపాలా ఉన్నానని.. తాను ఉన్నంత వరకు కొడంగల్‌ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్నాళ్లు జరిగిన ఎన్నికలు ఒకవంతు అయితే డిసెంబర్‌ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరో వంతుగా మారాయి. అభ్యర్థులిద్దరూ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమి తెలియని ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.

నువ్వా.. నేనా !
కొడంగల్‌ ప్రజల ఆత్మగౌరవం పేరుతో రేవంత్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి మంత్రంతో టీఆర్‌ఎస్‌ నరేందర్‌రెడ్డి జనానికి దగ్గరవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నేతగా ఉన్న రేవంత్‌ తనదైన ప్రణాళికతో ఉన్నట్లు కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. రెండేళ్లుగా ప్రతీ గ్రామంలో ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులను ఓవర్‌ టేక్‌ చేసే విధంగా రేవంత్‌ ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో రాటుదేలిన రేవంత్‌రెడ్డి తన గెలుపు కోసం వేస్తున్న ఎత్తుగడలు స్థానికులకు అంతుపట్టడం లేదు. ఇదిలా ఉండగా మంగళవారం సీఎం కేసీఆర్‌ కోస్గి సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిరసన తెలియజేయాలని రేవంత్‌ పిలుపునివ్వడం ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  


ఓటర్లు ఎటువైపు.. 
నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు ఉన్నారో అంతుపట్టడం లేదు. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీని గెలిపించారు. కొడంగల్‌ ఆది నుంచి కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోట. ఒకదఫా కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. మరోసారి టీడీపీకి అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల వరకు కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ ఉండేది. ప్రస్తుతం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షాలుగా నిలిచాయి. అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 సార్లు సార్వత్రిక ఎన్నికలు కాగా ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ ఐదుసార్లు, టీడీపీ నాలుగు సార్లు, స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు గెలిచారు. 1996లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement