narendrareddy
-
కోవిడ్ కట్టడిలో ప్రభుత్వ చర్యలు భేష్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కోవిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటోందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి అన్నారు. కోవిడ్ కట్టడిలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలను రాష్ట్రంలోనే చేస్తున్నారని తెలిపారు. రోగులకు చికిత్స అందించడంలో ప్రభుత్వ చర్యలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. దేశంలోనే మెరుగైన వైద్యం రాష్ట్రంలో మాత్రమే అందుతోందని కుండబద్దలు కొట్టారు. కరోనా కష్టకాలంలోనూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద ఉన్న ఆస్పత్రులను ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. గతంలో బకాయిలు నెలల తరబడి రాక చాలా ఇబ్బందులు పడేవాళ్లమని.. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను కేవలం రెండు వారాల్లోనే చెల్లిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే సిబ్బందికి జీతాలివ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. అన్ని విధాలా తమకు సహకారమందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. సోమవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్రరెడ్డి ఏమన్నారంటే.. కోవిడ్ సేవలు అందించేందుకు సిద్ధం ► కరోనాపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ► రాష్ట్రంలోని 560 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ► ఏ జిల్లాలో ఎలాంటి సాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ► ప్రతి కోవిడ్ ఆస్పత్రిలో ఎన్ని పడకలు ఉన్నాయనే సమాచారం ఆన్లైన్లో కూడా ఉంది. ► ప్రతి ఆస్పత్రికి ప్రభుత్వం ఒక నోడల్ అధికారిని నియమించడంతోపాటు వలంటీర్ల ద్వారా రోగుల సమాచారాన్ని వారి బంధువులకు తెలియజేస్తోంది. ► ఆస్పత్రిల్లో బెడ్లు, వైద్యం అందవనే అనుమానాలు వద్దు. ► ప్రతి జిల్లాలో కలెక్టర్ల ద్వారానే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ► కరోనా వైరస్ నిర్ధారణకు సీటీ స్కాన్ ప్రామాణికం కాదు. ► ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కోవిడ్ రోగులకు చికిత్స అందిçస్తున్నారు. ► రాష్ట్రంలోనే మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ► ప్రజలు కోవిడ్ గురించి భయపడకుండా అవగాహన పెంచుకోవాలి. ► స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందొచ్చు. మధ్యస్థ స్థాయిలో లక్షణాలు ఉంటే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆస్పత్రిలో చేరాలి. ► ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రమేశ్, డాక్టర్ ఎ.వినయ్, డాక్టర్ నరేశ్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘ఆరోగ్యశ్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు’
సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ‘డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం’ నిరుపేదలకు ఎంతో మేలు చేస్తోందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్తుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బి నరేంద్రరెడ్డి పేర్కొన్నారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీ మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాము. తమకు ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతాం’ అని పేర్కొన్నారు. -
కొడంగల్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరాహోరీ
కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఒకవైపు.. గెలుపే లక్ష్యంగా టీర్ఎస్ ఎంచుకున్ననరేందర్‌రెడ్డి మరో వైపు బరిలో ఉన్నారు. ఇద్దరు ఉద్దండుల రాజకీయ రణరంగంలో కొడంగల్ ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారనే అంశంపై ఉత్కంఠ సాగుతోంది. కొడంగల్: కొడంగల్‌లో పోరాటం నువ్వా.. నేనా అనేలా సాగుతోంది నియోజకవర్గంలోని సెకండ్ కేడర్ నాయకులు చాలా మంది ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. కుల సంఘాల ప్రతినిధులను నరేందర్‌రెడ్డి తన వైపునకు తిప్పుకొన్నారు. కొడంగల్ ప్రజల ఆత్మగౌరవమే తనకు ముఖ్యమని రేవంత్ ప్రచారం చేస్తున్నారు. 7న జరిగే ఎన్నికల్లో గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. నేతలిద్దరూ గెలుపు తమదేనని చెబుతున్నా.. చివరికి ఏం జరుగుతుందోననే భయం వీరి లో కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కొడంగల్‌పై దృష్టిసారించి రేవంత్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించు కుంటున్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం తనకు 30 వేల మెజారిటీ వస్తుందని, ప్రజలు మళ్లీ తననే ఆదరిస్తారని పేర్కొంటున్నారు. కొడంగల్ నియోజకవర్గం చుట్టూ హై టెన్షన్ వైరులా తాను కాపాలా ఉన్నానని.. తాను ఉన్నంత వరకు కొడంగల్ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్నాళ్లు జరిగిన ఎన్నికలు ఒకవంతు అయితే డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరో వంతుగా మారాయి. అభ్యర్థులిద్దరూ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమి తెలియని ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. నువ్వా.. నేనా ! కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం పేరుతో రేవంత్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి మంత్రంతో టీఆర్ఎస్ నరేందర్‌రెడ్డి జనానికి దగ్గరవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నేతగా ఉన్న రేవంత్ తనదైన ప్రణాళికతో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. రెండేళ్లుగా ప్రతీ గ్రామంలో ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను ఓవర్ టేక్ చేసే విధంగా రేవంత్ ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో రాటుదేలిన రేవంత్‌రెడ్డి తన గెలుపు కోసం వేస్తున్న ఎత్తుగడలు స్థానికులకు అంతుపట్టడం లేదు. ఇదిలా ఉండగా మంగళవారం సీఎం కేసీఆర్ కోస్గి సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిరసన తెలియజేయాలని రేవంత్ పిలుపునివ్వడం ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎటువైపు.. నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు ఉన్నారో అంతుపట్టడం లేదు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీని గెలిపించారు. కొడంగల్ ఆది నుంచి కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోట. ఒకదఫా కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. మరోసారి టీడీపీకి అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల వరకు కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ ఉండేది. ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షాలుగా నిలిచాయి. అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 సార్లు సార్వత్రిక ఎన్నికలు కాగా ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఐదుసార్లు, టీడీపీ నాలుగు సార్లు, స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు గెలిచారు. 1996లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
కారు, లారీ ఢీ: ఇద్దరి మృతి
కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో జాతీయరహదారిపై ఈ ఘటన జరిగింది. వైఎస్సార్ జిల్లా కడప నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు.. నంద్యాల వైపు వస్తున్న లారీ ఎదురుగా ఢీకొనటంతో కారులో ఉన్న ఇద్దరు చనిపోగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన నరేంద్రారెడ్డి, వర్షగా గుర్తించారు.