రంగారెడ్డిలో పారుతున్న డబ్బు | Money In The District Is Now In The Constituency. | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిలో పారుతున్న డబ్బు

Published Thu, Nov 29 2018 9:09 AM | Last Updated on Thu, Nov 29 2018 3:56 PM

 Money In The District Is Now In The Constituency. - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎన్నికలంటేనే డబ్బు.. డబ్బులున్న నేతలకే టికెట్లు.. నీళ్లలాగా డబ్బులు ఖర్చు పెడితేనే నలుగురు వెంట తిరిగేది.. ఏంటీ డబ్బు గోల అనుకుంటున్నారా..? రాజధాని శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఒక్కో అభ్యర్థి ప్రచార వ్యయం సగటున రూ.20 కోట్లు దాటుతుందంటే ముక్కున వేలేసుకోవాల్సిందే! కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.120 కోట్ల దాకా కూడా ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అంచనా వేసుకోవచ్చు.

రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బు వ్యయం చేసే నియోజకవర్గాల్లో జిల్లాలోని రెండు సెగ్మెంట్లను ఎన్నికల సంఘమే స్వయంగా గుర్తించింది. ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. ఎన్నికల సంఘం లెక్కలు అలా ఉంటే.. బుధవారం జరిగిన ఐటీ సోదాల్లో కొడంగల్‌ ప్రధాన పార్టీ అభ్యర్థి బంధువు ఫామ్‌హౌజ్‌లో కోట్ల రూపాయలు దొరికాయనే వార్తలు  జిల్లాలో డబ్బుల చర్చకు కారణమవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లాలో ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా డబ్బు గోలే.

క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నుంచి నాయకులను ప్రసన్నం చేసుకునేంతవరకు, పోస్టర్లు, కరపత్రాల నుంచి డిజిటల్‌ ప్రచారం వరకు నిధులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చుకు అధికారిక లెక్కలేమీ లేకపోయినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చలు, అంచనాలను బట్టి జిల్లాలో ఈ ఎన్నికలకు రూ.450 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇది కేవలం అంచనా మాత్రమే. 

ఈ సెగ్మెంట్లపై ఈసీ నిఘా
ఇబ్బడిముబ్బడిగా ధనప్రవాహం జరిగే అవకాశమున్నట్లు గుర్తించిన శాసనసభ నియోజకవర్గాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షాద్‌నగర్, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాలుండగా.. వికారాబాద్‌లో కొడంగల్, తాండూ రును గుర్తించింది. ఈ సెగ్మెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది.

మరోవైపు సంపన్నులు పోటీ చేస్తున్న శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం స్థానాలపై డేగ కన్ను వేయాలని సూచించింది. ఈ నియోజకవర్గాల పరిధిలో జరిగే బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా వ్యవహారాలను నిశితంగా పరిశీలించాలని నిర్దేశించింది. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి సోదాలు నిర్వహించడం ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీచేసింది.

పరి‘మితి మీరుతోంది’ 
వ్యయ పరిమితిని రూ.28 లక్షలకే కట్టడి చేసినా.. ఇవి కేవలం అధికారిక చిట్టా పద్దులకే పరిమితమవుతోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ధన ప్రవాహం రెట్టింపయింది. చావో.. రేవో తేల్చుకోవాలని భావిస్తున్న ఉద్ధండులు ఈసారి బరిలో ఉండడంతో ఖర్చుకు వెరవడంలేదు. సెప్టెంబర్‌ 6న అసెంబ్లీ రద్దు చేసిన మరుక్షణమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రణక్షేత్రంలోకి వెళ్లారు.

దీంతో మొదటి రోజు నుంచే జేబు చిలుము వదిలించుకోవాల్సిన పరిస్థితి తలెత్తెంది. ఇక నామినేషన్ల పర్వం మొదలు కావడం.. ప్రత్యర్థులు కూడా ఖరారు కావడంతో దూకుడు పెంచాల్సి వచ్చింది. వీరి పరిస్థితి ఇలా ఉంటే సమరాంగణంలోకి ఆలస్యంగా వచ్చామని ఆ వేదనతో ఉన్న ప్రజా కూటమి అభ్యర్థులు కూడా ఇతర పార్టీలకు దీటుగా ఖర్చు చేస్తున్నారు. 

సందడే.. సందడి 
ముందస్తు ఎన్నికలకు నగారా మోగడమే తరువాయి గ్రామాల్లో పండగ వాతావరణం ఏర్పడింది. టికెట్ల కోసం బలప్రదర్శన, సమావేశాలు, ఊరేగింపులు పేరిట రోజుకో నేత ‘సమ్‌తృప్తి’ పరుస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. ప్రచార పర్యానికి పాల్గొనే శ్రేణులకు ప్రతి రోజూ విందు, మందు ఏర్పాటు చేస్తున్న అభ్యర్థులు.. దిగువ శ్రేణి నేతల గొంతెమ్మ కోరికలను తీర్చడానికి భారీగా నగదును ఆఫర్‌ చేస్తున్నారు.

కేవలం సొంత పార్టీ నాయకులే గాకుండా ప్రత్యర్థి శిబిరాలను కూడా బలహీనపరిచేందుకు తృణమో ఫణమో ముట్టజెప్తున్నారు. ఇవేగాకుండా కుల సంఘాలు, యువజన సంఘాల డిమాండ్లను నెరవేర్చడానికి తలూపుతున్నారు. క్రికెట్‌ కిట్లు, వంట సామగ్రి, టెంట్లు, కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, గోపురాలకు హామీలు ఇస్తూ ముందస్తుగా కొంత సమర్పించుకుంటున్నారు. పోలింగ్‌కు ఇంకా వారం రోజుల గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో ఎన్నికల వ్యయం కాస్తా తారస్థాయికి చేరే అవకాశముంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement