
పోస్టల్ బ్యాలెట్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పై ఉద్యోగులు, సిబ్బంది ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఓటు వినియోగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటూ ఎంతో కీలకం. దీనిని గుర్తించిన ఎన్నికల సంఘం.. ఎలక్షన్ విధుల్లో పాలుపంచుకుంటున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోంది.
అయితే, ఉద్యోగులు, సిబ్బంది పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. విధుల్లో పాల్గొన్న వారిలో 73.82 శాతం మంది పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చివరిసారిగా 2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానంలో పోలైన ఓట్ల తీరును చూస్తే ఈ విష యం స్పష్టమవుతోంది. 2014లో ప్రస్తుతం కొత్త రంగారెడ్డి పరిధిలోకి వచ్చే ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 35 వేల మందికిపైగా అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఇందులో 9,165 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. అంటే మొత్తం ఓట్లలో కేవలం 26.18 శాతం మందే ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
ఓటేసినా చెల్లడం లేదు..
అధికారులు, ఉద్యోగులు కొందరు బాధ్యతాయుతంగా ఓటేసినా.. పలు తప్పిదాల వల్ల కొన్ని సందర్భాల్లో అవి చెల్లుబాటు కావడం లేదు. ఇలా పనికిరాకుండా పోతున్న ఓట్ల శా తం కూడా గణనీయంగానే ఉండడం కలవరానికి గురిచేస్తోంది. విద్యావంతులు కూడా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటేయలేకపోవడంపై పలువురు ఉన్నతాధికారులు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ విధానంపై పలుమార్లు అవగాహన కల్పించినా పూర్తిస్థాయిలో మార్పు రాకపోవడానికి కారణం నిర్లక్ష్యమేనని విశ్లేషిస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ జె.రాజేశ్వర్‌రెడ్డి
గత ఎన్నికల్లో జిల్లా పరిధిలో 34.06 శాతం ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 9,165 మంది ఉద్యోగులు, సిబ్బంది ఓటు వేయగా.. ఇందులో 6,043 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. మరో 3,122 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పూర్తిసా ్థయిలో ఓటు వినియోగించుకోకపోవడానికి, ఒకవేళ ఓటేసినా అవి చెల్లుబాటు కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ జె.రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ సమస్యలను అధిగమిస్తే వినియోగించుకున్న ఓటు నూరుశాతం చెల్లు బాటు అవుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఆసక్తి లేకపోవడానికి కారణాలు
ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ) దగ్గరి నుంచి పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకోకపోవడం.
ఎన్నికల విధి నిర్వహణ ఉత్తర్వుల కాపీతోపాటు ఫారం–12 సకాలంలో అందించకపోవడం.
ఓటర్ల జాబితాలో ఉన్నట్లుగా తన ఓటుకు సంబంధించిన పార్ట్, సీరియల్ నంబర్ వివరాలను తప్పుగా నమోదు చేయడం.
ఎన్నికల విధుల్లో పనిచేసే వారికి సకాలంలో డ్యూటీ ఆర్డర్స్ అందకపోవడం.
ఫారం–12లో తప్పుడు చిరునామా పేర్కొనడం.
తీసుకున్న బ్యాలెట్ పేపర్‌రు నిర్ణీత సమయంలోగా ఆర్‌ఓకు అందజేకపోవడం.
తిరస్కరణకు గల కారణాలు
డిక్లరేషన్‌పై సంతకం చేయకపోవడం. బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ రాయకపోవడం.
గెజిటెడ్ ఆఫీసర్‌తో ధ్రువీకరించకపోవడం.
ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్‌ను 13బి కవరులో పెట్టకపోవడం.
పోస్టల్ బ్యాలెట్, డిక్లరేషన్‌ను ఒకే కవరులో పెట్టడం.
పోస్టల్ బ్యాలెట్‌లో సంతకం లేకపోవడం (గోప్యత లేకపోవడం).
ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు మార్క్ చేయడం.
ఏ అభ్యర్థికీ మార్క్ చేయకపోవడం. కొన్ని సందర్భాల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేశారో తెలియకుండా పైన.. కింద మార్క్ చేయడం.
Comments
Please login to add a commentAdd a comment