సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికార పార్టీలో నంబర్–2 స్థానంలో ఉన్న బావ, బామ్మర్దులకు మరో కొత్త సవాల్ ముందుకొచ్చింది. మన జిల్లాలో రెండు స్థానాల్లో గెలుపు బాధ్యతలను ఇరువురు మంత్రులు భుజాన వేసుకోవడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గాలపైనే పడింది. ప్రధానంగా కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్ స్థానంలో గులాబీ పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతలను బావ హరీష్‌రావు చేపట్టగా.. రియల్ ఎస్టేట్, విద్య, వాణిజ్య, ఐటీ రంగానికి నెలవైన ఇబ్రహీంపట్నంలో కారు జోరు పెంచే బాధ్యతను బావమరిది కేటీఆర్ స్వీకరించారు.
ఇద్దరూ అధికార పార్టీకి స్టార్ క్యాంపెయినర్లే కావడం.. అదీ స్వయానా బావామరదులు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.æ రాష్ట్రవ్యాప్తంగా 20 కీలక నియోజకవర్గాలను గుర్తించిన గులాబీ బాస్ కేసీఆర్.. వీటిలో ప్రచార వ్యూహాలను అమలు చేసే బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించారు. ప్రత్యర్థి బలంగా ఉన్న, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న, సొంతపార్టీలో అసమ్మతి తీవ్రంగా ఉన్న స్థానాలను ఎంపిక చేశారు. ఇందులో మన జిల్లాలో కొడంగల్, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లను గుర్తించారు. ఈ రెండు స్థానాలను ప్రతిష్టాత్మకంగా భావించిన గులాబీ అధినాయకత్వం.. వీటి గెలుపు బాధ్యతలను హరీష్‌రావు, కేటీఆర్‌కు కట్టబెట్టింది.
పట్నంలో కేటీఆర్
గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(టీడీపీ) గులాబీ గూటికి చేరినా.. ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్ హైకమాండ్ గుర్తించింది. కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలున్నప్పటికీ సొంత పార్టీ నేతల్లోనూ లుకలుకలుండడం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లు అంతర్గత సర్వేలో తేలడంతో ఈ సెగ్మెంట్‌పై పట్టు సాధించేందుకు మంత్రి కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ రంగంలోకి దించింది. ముఖ్యంగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను సద్దుమణిగేలా చేయడం, ప్రత్యర్థులను బలహీనపరిచే బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌లో విజయ పతాకం ఎగురవేయడం కేటీఆర్‌కు సవాలుగా మారింది.
రేవంత్ ఓటమే ధ్యేయంగా..
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ నాయకత్వం వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆర్నెల్ల క్రితమే టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్‌ను ఉప ఎన్నికల్లో ఓడించాలని భావించింది. అయితే, ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు కాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఇవ్వడంతో ఉప ఎన్నికకు చాన్స్‌లేకుండా పోయింది. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే చావుదెబ్బ తీయాలని అధికారపార్టీ అనుకుంది. అందుకనుగుణంగా కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు రాష్ట్ర కేబినెట్ అంతా ఏదో ఒక సందర్భంలో నియోజకవర్గంలో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అంతేగాకుండా 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన గురునాథ్‌రెడ్డి స్థానే ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిని బరిలో దించనున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో గురునాథ్ వర్గీయుల నుంచి అసమ్మతి రాకుండా జాగ్రత్త పడ్డారు.
ఎన్నికలొప్పుడొచ్చినా టికెట్ ఖాయమని తేలడంతో నరేందర్‌రెడ్డి పూర్తిస్థాయిలో కొడంగల్‌పైనే దృష్టిపెట్టారు. మరోవైపు సోదరుడు, మంత్రి మహేందర్‌రెడ్డి కూడా నరేందర్‌ను గెలిపించడం కోసం తనదైన శైలిలో వ్యూహాలు రూపొందించారు. అనూహ్యంగా శాసనసభ రద్దు కావడం.. ఎన్నికలకు నగారా మోగడంతో ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడం టీఆర్‌ఎస్‌కు తప్పనిసరి అయింది. శాసనసభ లోపల, బయటా మాటల చాతుర్యంతో కొరకరాని కొయ్యగా మారిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని ఓడించకపోతే చికాకు తప్పదని గులాబీ దళపతి కేసీఆర్ అంచనా కొచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ని మట్టికరిపించేందుకు ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావును తెరమీదకు తెచ్చారు. స్టార్ క్యాంపెయినర్‌గా నరేందర్‌రెడ్డిని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యతను అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment