
తాండూరు టౌన్: జిల్లా ప్రజలు ఒకే రోజు ఇద్దరు సీఎంలను చూడనున్నారా..? అనే చర్చ ప్రస్తుతం తాండూరులో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సందర్భంగా ఈ నెల 25న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇదే రోజున బీజేపీ నేతలు సైతం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సభ నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇరువురు ముఖ్యమంత్రులకు సంబంధించిన సభలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనే నిర్వహించేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆదిత్యనాథ్ సభ కోసం ఈ నెల 16న బీజేపీ నాయకులు కళాశాల ప్రిన్సిపల్ నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే రోజున కేసీఆర్ బహిరంగ సభను సైతం ఈ మైదానంలోనే నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ వర్గాలు ఏర్పాట్లు ప్రారంభించాయి.
తాము కూడా 25న సభ కోసం మైదానం కావాలని ప్రిన్సిపల్ వద్ద అనుమతి తీసుకున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇరువురు సీఎంల సభలను ఒకే రోజు.. ఒకే గ్రౌండ్‌లో ఎలా నిర్వహిస్తారనే విషయంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇద్దరు సీఎంల సభలకు భద్రతాపరమైన అనుమతులు లభిస్తాయో..? లేదో..? అనే వివరాలు తేలాల్సి ఉంది. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే ఒక పార్టీకి చెందిన సమావేశాన్ని మరో మైదానానికి తరలిస్తారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment