అయ్యో మల్లికార్జునా!.. ఎంత పనిచేశావయ్యా! | Head Constable Died In A Road Accident After Visiting Srisailam Mallanna | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు

Published Tue, Jul 9 2019 11:09 AM | Last Updated on Sun, Sep 22 2019 1:51 PM

Head Constable Died In A Road Accident After Visiting Srisailam Mallanna - Sakshi

వాహనం నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న పోలీసులు

 సాక్షి, కాజీపేట:  దైవదర్శనం చేసుకుని... మొక్కలు చెల్లించుకున్నారు.. కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఇళ్లకు బయలుదేరారు.. మధ్యలో కాసేపు విరామం తీసుకుని భోజనం పూర్తిచేశా రు.. ఆ తర్వాత వాహనంలో బయలుదేరిన వారికి అదే చివరి ప్రయాణం అవుతుందని తెలియదు.. ఒక్కసారి మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న పగడాల దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన భార్య, చిన్నకుమారుడు, అక్కా, బావలు కన్నుమూశారు.. రెప్పపాటులో జరిగిన ఈ ఘోరంతో ఆ కుటుంబంలో దుర్గాప్రసాద్‌ తల్లి, మరో కుమారుడు మాత్రమే మిగలడం విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ వద్ద జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన దుర్గాప్రసాద్‌ కాజీపేట వాసి కాగా.. మట్టెవాడ పోలీసుస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

రహమత్‌నగర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌ మట్టెవాడ పీఎస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భార్య, కుమారుడు, అక్కాబావలతో కలిసి ఆదివారం వెళ్లాడు.. దైవదర్శనం అనంతరం అక్కడే బస చేసిన వారు సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు.. అయితే, అదే చివరి ప్రయాణమవుతుందని వారికి తెలియదు.. మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా అమనగల్లు వద్ద భోజనం చేసి వస్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైకి లారీ దూసుకొచ్చింది. ఆ లారీని వీరు వెళ్తున్న ఇన్నోవా వేగంగా ఢీకొట్టింది.. 

ఈ ఘటనలో దుర్గాప్రసాద్, ఆయన భార్య, విజయలక్ష్మి, కుమారుడు శంతన్‌కుమార్‌తో పాటు అక్కాబావలు పద్మ, రాజు సైతం మృతి చెందారు.. వీరు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు అందులో చిక్కుకుపోయాయి.. ప్రమాదంలో దుర్గాప్రసాద్, ఆయన సతీమణి, కుమారుడు మృతి చెందగా అనారోగ్యంతో ఇక్కడే ఉండిపోయిన తల్లి, ఆస్ట్రేలియాలో ఉంటున్న మరో కుమారుడు శ్రయాజ్‌ మాత్రం కుటుంబంలో మిగిలినట్లయింది.. విషయం తెలియగానే ఆయన నివాసముండే రహమత్‌నగర్‌తో పాటు పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మల్లన్న దర్శనం కోసం..
కాజీపేట 52వ డివిజన్‌ రహమత్‌నగర్‌ కాలనీకి చెందిన పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పగడాల దుర్గాప్రసాద్‌ (50) తన భార్య విజయలక్ష్మి(46), చిన్నకొడుకు శంతన్‌కుమార్‌(25), హైదరాబాద్‌ కు చెందిన బావ రాజు, అక్క పద్మతో కలిసి ఆదివారం ఉదయం కర్నూల్‌ జిల్లా శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లారు. రాత్రి అక్కడే బసచేసిన వారు దైవదర్శనం అనంతరం సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఓ హోటల్‌లో భోజ నం చేశారు.

ఈమేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగ ల్లు మండలం మేడిగడ్డతండా గేటు వద్ద హైదరా బాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న లారీ కుడివైపున ఉన్న శ్రీలక్ష్మీ గణపతి వే బ్రిడ్జి వద్దకు ఒక్కసారిగా మళ్లింది. దీంతో వేగంగా వస్తున్న ఇన్నోవా లారీ ముందు భాగంలోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, శంతన్, రాజు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మి, పద్మజ ఆమనగల్లు ప్రభుత్వాçస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారం భించేలోపే కన్నుమూశారు. ఇన్నోవా డ్రైవర్‌ ఖలీల్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

పోలీసు అధికారుల పర్యవేక్షణ
ఆమన్‌గల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్గప్రసాద్‌ కుటుంబ సభ్యుల మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కాజీపేటకు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లను సీపీ డాక్టర్‌ విశ్వనా«థ్‌ రవీందర్‌ పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించి సోమవారం రాత్రిలోగా పోస్టుమార్టం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ మేరకు మృతదేహాలు మంగళవారం తెల్లవారుజాము వరకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిసింది.

కాజీపేట సీఐ అజయ్‌తోపాటు పోలీసు సిబ్బంది మృతుడి ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. దుర్గాప్రసాద్‌ పెద్దకుమారుడు శ్రయా జ్‌ ఆస్ట్రేలియా నుంచి బయలుదేరగా మంగళవారం మధ్యాహ్నంలోగా హైదరాబాద్‌ చేరుకుంటాడని తెలిసింది. ఆయన కాజీపేటకు రాగానే పోలీసులాంఛనలతో 
అంత్యక్రియలు జరగనున్నాయి.

కేసుల ఛేదనలో దిట్ట
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు పోలీసు స్టేషన్లలో పనిచేసిన దుర్గాప్రసాద్‌కు ఉన్నతాధికారుల వద్ద మంచి పేరు ఉంది. ఎక్కువగా క్రైం విభాగంలో పనిచేసిన ఆయన కేసుల ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించేవాడని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పనితీరును మెచ్చిన అధికారులు ఎక్కువగా నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనే పోస్టింగ్‌ ఇచ్చేవారని తెలిసింది

ఇదీ కుటుంబ నేపథ్యం
రైల్వేలో లోకో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే పుల్లయ్య 1971లో రహమత్‌నగర్‌లో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. పుల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆమన్‌గల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూతురు పద్మ, అల్లుడు రాజు, కొడుకు దుర్గాప్రసాద్, కోడలు విజయలక్ష్మి, మనవడు శంతన్‌కుమార్‌ మృతి చెందారు. కొద్దికాలం క్రితం పుల్లయ్య మరణించడంతో తల్లి పూలమ్మ వృద్ధాప్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఇక దుర్గాప్రసాద్‌ కుమారుడు శంతన్‌కుమార్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండగా దుర్గాప్రసాద్‌ మట్టెవాడ పీఎస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పెద్దకుమారుడు శ్రయాజ్‌ ఆస్ట్రేలియాలో ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. 

దైవభక్తి ఎక్కువ
దుర్గా ప్రసాద్‌కు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ. 2018లో పదోన్నతి వచ్చిన తరక్వాత పలు దేవాలయాలకు వస్తానని మొక్కుకున్నట్లు సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇటీవలే వేములవాడ, కొండగట్లు ఆలయాలను కుటుంబ సభ్యులతో సందర్శించుకోని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిసింది. శనివారం విధులు నిర్వర్తించిన దుర్గాప్రసాద్‌ ఆది, సోమవారం రెండు రోజుల పాటు సెలవు పెట్టి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ దైవ దర్శనం చేసుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడం అందరినీ కలిచివేసింది. 

అధికారుల సంతాపం
వరంగల్‌ క్రైం/రామన్నపేట: హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్గాప్రసాద్‌ మృతి పట్ల వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ నరసింహ, ఏసీపీ నర్సయ్య, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ జీవన్‌రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, దీపక్‌ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ తదితరులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి ప్రకటించి సంతాపం తెలిపారు. 
ఉద్యోగుల దిగ్భ్రాంతి

వరంగల్‌ క్రైం: మట్టెవాడ పోలీసుస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న దుర్గాప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియగానే సహచర ఉద్యోగులు, పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాం తికి గురయ్యారు. 1990 బ్యాచ్‌కి చెందిన దుర్గాప్రసాద్‌ మొగుళ్లపల్లి, మడికొండ, స్టేషన్‌ఘున్‌పూర్, సుబేదారి, మట్టెవాడ పోలీస్‌ స్టేషన్లలో పనిచేశారు. 2014 డిసెంబర్‌లో జరిగిన బదిలీల్లో మట్టెవాడ వెళ్లారు. అక్కడే ఆయనకు 2018 ఫిబ్రవరిలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి వచ్చింది. 

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి
తీర్ధయాత్రలకు వెళ్లిన తన కొడుకు, కుమార్తెల కుటుంబాలు కన్నుమూశాయన్న విషయం తెలుసుకున్న దుర్గప్రసాద్‌ తల్లి పూలమ్మ బోరున విలపిస్తున్నారు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు, పెద్దకూతురు, అల్లుడితో పాటు భార్య, కోడలు ప్రమాదంలో చనిపోయారని ఇంటి పక్కల వారు చెప్పడంతో తల్లి ఆచేతనంగా మారిపోయింది. మాట రాకుండా మంచంలోనే పడిపోవడం చూపరులను కలిచివేసింది. 

ఉన్నతాధికారుల పరిశీలన
ఆమనగల్లు:ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆమనగల్లు ఎస్‌ఐ మల్లీశ్వర్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్నోవా వాహనంలో చిక్కుకున్న మతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీశారు. ఇక ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఘటన స్థలాన్ని సోమవారం సాయంత్రం శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ ప్రసాద్‌రావ్, షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ సీఐ సునీల్, ఆమనగల్లు సీఐ నర్సింహారెడ్డి పరిశీలించారు. 

అందరితో కలివిడిగా..
రోడ్డు ప్రమాదంలో మరణించిన దుర్గాప్రసాద్‌ కుటుంబం రహమత్‌నగర్‌లో అందరితో కలివిడిగా ఉండేవారు. పండుగలు, పబ్బలకు హాజరవుతూ చిన్నాపెద్ద తేడా లేకుండా కలిసిపోయే వారు. వినాయక చవితి, శ్రీరామనవమి, ఉగాది వేడుకలను కాలనీవాసులతో కలిసి ఘనంగా రుపుకోవడానికి ప్రాధాన్యతనివ్వడమే కాకుండా నిర్వహణకు చేయూతనిచ్చేవారు. సహచర మిత్రుల్లో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి పరిష్కరించేవాడనే పేరుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ప్రమాదానికి కారణమైన లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement